ఎయిర్ ప్యూరిఫయర్లపై జీఎస్టీ తగ్గింపునకు కేంద్రం ’నో’
కాలుష్యంతో జనం చస్తుంటే పట్టింపు లేదా?: హైకోర్టు ప్రశ్న
జనవరి 9కి తదుపరి విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో, ఎయిర్ ప్యూరిఫయర్లపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) తగ్గించాలన్న డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో కీలక వ్యాఖ్యలు చేసింది. నిబంధనలను పక్కనపెట్టి, కోర్టు ఆదేశాల మేరకు జీఎస్టీని తగ్గిస్తే అది ‘పండోర బాక్స్’తెరిచినట్లవుతుందని, దీనివల్ల భవిష్యత్తులో అనేక క్లిష్ట సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఎయిర్ ప్యూరిఫయర్లను ‘వైద్య పరికరాల’జాబితాలో చేర్చాలని, ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది.
సమాఖ్య వ్యవస్థకు ముప్పు: కేంద్రం కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్. వెంకటరామన్ వాదనలు వినిపించారు. జీఎస్టీ కౌన్సిల్ అనేది రాజ్యాంగ బద్ధమైన సంస్థ అని గుర్తు చేశారు. పన్ను రేట్ల తగ్గింపు అనేది కేంద్రం, రాష్ట్రాల చర్చల ద్వారా, ఓటింగ్ ద్వారా నిర్ణయించాల్సిన అంశమని స్పష్టం చేశారు.
’ఇప్పుడు కోర్టు ఆదేశాలతో పన్నులు తగ్గిస్తే.. రేపు ప్రతి ఒక్కరూ పిటిషన్లు వేసి పన్నులు తగ్గించమని అడుగుతారు. ఇది ఒక పండోర బాక్స్ తెరిచినట్లవుతుంది. పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు ఉన్నాయి, వాటిని పరిశీలిస్తున్నాం. కానీ పద్ధతి ప్రకారం వెళ్లాలి’అని కోర్టుకు నివేదించారు. అసలు ఈ పిటిషన్ వెనుక ఎవరున్నారో ఆరా తీయాల్సి ఉందని, ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాకపోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
సామాన్యుడు ఎలా కొంటాడు?: హైకోర్టు ఆగ్రహం
జస్టిస్ వికాస్ మహాజన్, జస్టిస్ వినోద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించింది. ’ఒక ఎయిర్ ప్యూరిఫయర్ ధర రూ.10 వేల నుంచి రూ.15 వేలు వరకు ఉంది. సామాన్యుడు దీన్ని ఎలా కొనగలడు? జీఎస్టీని తగ్గించి సామాన్యుడికి అందుబాటులోకి తేవచ్చు కదా?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ప్రజారోగ్యం దృష్ట్యా ఈ విషయాన్ని అత్యవసరంగా జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లాలని గతంలోనే చెప్పామని గుర్తు చేసింది. దీనిపై సమగ్ర సమాధానం ఇచ్చేందుకు (కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు) కేంద్రం గడువు కోరడంతో, కోర్టు 10 రోజుల సమయం ఇచ్చింది. తదుపరి విచారణను జనవరి 9, 2026కి వాయిదా వేసింది. సెలవుల తర్వాత వెంటనే ఈ అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ ఎప్పుడు చర్చించగలదో తెలపాలని ఆదేశించింది.
విలాసం కాదు.. అవసరం: పిటిషనర్
పిటిషనర్ కపిల్ మదన్ వాదిస్తూ.. ఢిల్లీలో కాలుష్యం ఎమర్జెన్సీ స్థాయికి చేరిందన్నారు. ఎయిర్ ప్యూరిఫయర్ ఇప్పుడు లగ్జరీ కాదని, ప్రాణాలను కాపాడే వైద్య పరికరమని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తోందని, దీనివల్ల నగర ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్యూరిఫయర్లను తప్పుడు కేటగిరీలో ఉంచి పన్ను వసూలు చేస్తున్నారని వాదించారు.


