దీనిపై క్షేత్రస్థాయి పోరాటమే శరణ్యం
సీడబ్ల్యూసీ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోట్లమంది కడుపు నింపిన జాతీయ ఉపాధి హామీ (మన్‌రే) పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రద్దు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దీన్ని పేదల ఉపాధిని నిర్వీర్యం చేసే కుట్రగా అభివర్ణించారు. ఉపాధి పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడమంటే దేశ గౌరవాన్ని కించపర్చడమే అని మండిపడ్డారు. శనివారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించిన సీడబ్ల్యూసీ సమావేశంలో రేవంత్ మాట్లాడారు. బహుళ ప్రయోజనాలను ఆశించి నిరుద్యోగ, రైతు కూలీలు, దళిత, బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాలన్న సదుద్దేశంతో యూపీఏ ప్రభుత్వం మన్‌రేగా పథకాన్ని తీసుకొచ్చిందని గుర్తుచేశారు.
పేదలకు జీవనాధారంగా మారిన ఈ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి వారి కడుపుకొట్టిందని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వానికి పేదల బాధలు పట్టవని, కార్పొరేట్ వర్గాల ప్రయోజనాలే ప్రధాన లక్ష్యమని ధ్వజమెత్తారు. రాష్ట్రాలపై అదనపు భారాన్ని మోపే ‘వీబీ జీ రామ్ జీ పథకం’పై జాతీయస్థాయి ఉద్యమాలే శరణ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా మోదీ ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
రాహుల్‌తో మాటా మంతీ
సీడబ్ల్యూసీ సమావేశం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సరదాగా సంభాషించుకున్నారు. సమావేశం ముందు, తర్వాత.. రేవంత్ అధిష్టానం పెద్దలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులతో కలిసి నడిచారు. ఈ సమయంలో రేవంత్ వారితో చాలాసేపు నవ్వుతూ మాట్లాడారు. అలాగే.. రాహుల్‌తో ప్రత్యేకంగా కొంతసేపు మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాలు, 29 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలు, పంచాయతీ ఎన్నికల్లో విజయాలు, నామినేటెడ్ పదవులు, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది.
శనివారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించిన సీడబ్ల్యూసీ సమావేశం సందర్భంగా మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌లతో సీఎం రేవంత్‌రెడ్డి


