‘డీజీపీ’ అర్హుల లిస్ట్‌ యూపీఎస్సీకి పంపండి | Send the list of eligible candidates for DGP to UPSC | Sakshi
Sakshi News home page

‘డీజీపీ’ అర్హుల లిస్ట్‌ యూపీఎస్సీకి పంపండి

Dec 25 2025 4:09 AM | Updated on Dec 25 2025 4:09 AM

Send the list of eligible candidates for DGP to UPSC

రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు 

ఆ నివేదికను తమ ముందు ఉంచాలని స్పష్టం

శివధర్‌రెడ్డి నియామక రద్దుకు నిరాకరణ

తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డీజీపీ పోస్టుకు అర్హులైన వారి పేర్లతో ఐపీఎస్‌ అధికారుల ప్యానెల్‌ను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ)కి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. యూపీఎస్సీ పంపిన వివరాలు అక్కడి నుంచి వచ్చిన ఆమోదంతో ఓ నివేదికను తమ ముందు ఉంచాలని స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు శివధర్‌రెడ్డి నియామకాన్ని రద్దు చేస్తూ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పిటిషనర్‌కు తేల్చిచెప్పింది. 

తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా వేసింది. డీజీపీగా శివధర్‌రెడ్డి నియామకాన్ని సవాల్‌ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త టి.ధన్‌గోపాల్‌రావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సెప్టెంబర్‌ 2025న సర్కార్‌ జారీ చేసిన ఉత్తర్వులు.. 2018లో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ పుల్ల కార్తీక్‌ సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. 

ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఏ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కమిషన్‌కు పంపిన ప్యానె ల్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, యూపీఎస్సీ మధ్య జరిగిన ఉత్తర ప్ర త్యుత్తరాల వివరాలను సమర్పించారు. ఆంధ్రప్ర దేశ్‌కు కేటాయించగా, తెలంగాణలో పనిచేస్తున్న 1994 బ్యాచ్‌ అధికారిణి అభిలాష బిస్త్‌ను ప్యానెల్‌లో చేర్చవచ్చా అని కమిషన్‌ను ప్రభుత్వం అడిగిందని, అందుకు యూపీఎస్సీ నుంచి ప్రతికూల సమాధానం వచ్చిందన్నారు. 

కమిషన్‌ కోరిన వివరణలు, ప్రభుత్వం ఇచ్చిన సమాధానాల్లో లోపాల కారణంగా డీజీపీ ప్రక్రియ ఆలస్యమైందని యూపీఎస్సీ తరఫు న్యాయవాది అజయ్‌కుమార్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల మేరకు అడిగిన వివరాలు పంపితే.. ప్రక్రియ వేగవంతం చేస్తామన్నారు. పార్టీ ఇన్‌ పర్సన్‌ (పిటిషనర్‌) వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా చేపట్టిన శివధర్‌రెడ్డి నియామకం చట్టవిరుద్ధమన్నారు. వెంటనే రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. 

రెండు నెలలకుపైగా నిబంధనలకు విరుద్ధంగా ఆయన పదవిలో కొనసాగుతున్నారని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. శివధర్‌రెడ్డి నియామక రద్దుకు నిరాకరించారు. యూపీఎస్సీకి ఎంపిక ప్యానెల్‌ను పంపే ప్రక్రియ కొనసాగించాలన్నారు. నివేదిక అందజేసిన తర్వాత కౌంటర్‌ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి సమయం ఇస్తామంటూ విచారణ వాయిదా వేశారు. 

ప్రకాశ్‌సింగ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలివి...
» డీజీపీ ఖాళీకి మూడు నెలల ముందే రాష్ట్రాలు ఐపీఎస్‌ల పేర్లను యూపీఎస్సీకి పంపాలి
» కమిషన్‌ ముగ్గురితో కూడిన ప్యానెల్‌ను వెనక్కి  పంపించాలి
» అందులో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వాలు నియమించుకోవచ్చు
» డీజీపీకి కనీసం రెండేళ్ల పదవీకాలం ఉండేలా రాష్ట్రం, యూపీఎస్సీ ఎంపిక ఉండాలి 
» యాక్టింగ్, తాత్కాలిక డీజీపీలను రాష్ట్రాలు నియమించుకోవడం నిషేధం
» ఎంపిక చేసిన వ్యక్తి పదవీ విరమణ తర్వాత కూడా కొనసాగొచ్చు. అయితే, పొడిగింపునకు సహేతుక కారణం ఉండాలి
» సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా నియామకాలుంటే నిలిపివేయబడతాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement