‘మేడ్చల్ జిల్లాలోని ఓ మున్సిపాలిటీలో విలీనమైన తండా. ఇక్కడ సుమారు 1,500 ఓటర్లున్నారు. వీరిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి ఇంటికి కిలో చికెన్ సహా బాస్మతి రైస్, అర బాటిల్ మద్యం ఆదివారం సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇలా ఈ ఒక్క తండాలో మాత్రమే కాదు ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీల్లోని విలీన గ్రామాల్లో ‘సండే’ ఎలక్షన్ దావత్ నడవనుంది’
సాక్షి, రంగారెడ్డిజిల్లా: నగర శివారులోని రంగారెడ్డి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లోని 126 వార్డులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు.. 68 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచే కాకుండా స్వతంత్ర అభ్యర్థులు సహా మొత్తం 696 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మున్సిపల్ చైర్మన్ పీఠాలను ఆశిస్తున్న ఆశావహులు తమ వార్డుల్లో ఎలాగైనా గెలుపొందాలని భావిస్తున్నారు. ఆ మేరకు ఓటర్లను మచి్చక చేసుకునేందుకు రకరకాల హామీలు ఇవ్వడంతో పాటు ప్రతి రోజూ మద్యం, మాంసం సరఫరా చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుండటం, నేడు ఆదివారం కావడంతో అభ్యర్థులు ఓటర్లకు ఇంటికి కిలో మటన్/ చికెన్ సహా ఓటర్ల సంఖ్యను బట్టి బాస్మతి రైస్, అర బాటిల్ మద్యం సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
ఒక్కో అభ్యర్థి ఖర్చు రూ.20 లక్షల పైనే..
అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.లక్ష దాటకూడదనే నిబంధన ఉంది. కానీ ఇప్పటికే ఒక్కో అభ్యర్థి ఖర్చు రూ.20 లక్షలు దాటినట్లు సమాచారం. కాలనీ, అపార్ట్‌మెంట్ సంక్షేమ, కుల, కారి్మక సంఘాలు, వివిధ వర్గాల ఓటర్లతో గెట్ టు గెదర్ పారీ్టలు ఏర్పాటు చేసి కావాల్సినవన్నీ సమకూర్చుతున్నారు. ఒకరిని చూసి మరొకరు పంపకాలకు తెర తీయడంతో అభ్యర్థుల ఖర్చులు రెట్టింపవుతున్నాయి. ఖర్చుల కోసం ఇంట్లోని బంగారు ఆభరణాలు తాకట్టు పెడుతున్నారు. తెలిసిన వ్యాపారుల వద్ద తమ ఇళ్లు, ప్లాట్లు, వ్యవసాయ భూములను కుదువపెట్టి అప్పులు తెచి్చ, ఓటర్లకు పంచుతుండటం విశేషం. ఓటర్లు మాత్రం ‘మా ఓటు మీకే’ అంటూ వచి్చన ప్రతి అభ్యరి్థకీ హామీలివ్వడం గమనార్హం. భారీగా మద్యం, మాంసం పంపిణీ జరుగుతున్నా.. ఎన్నికల నిఘా వర్గాలు అటు వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
కాంగ్రెస్ నేతలు ‘కోడ్’ ఉల్లంఘించారు
మేడ్చల్: అలియాబాద్ మున్సిపాలిటీ లాల్‌గడిమలక్‌పేట్‌లో శుక్రవారం చోటుచేసుకున్న ఘటనపై బీఆర్‌ఎస్ నాయకులు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదినికి, సైబరాబాద్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు రాళ్లు రువి్వ, దాడులకు దిగారని వినతి పత్రంలో పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, వివేకానంద, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, దాసోజ్ శ్రవణ్, పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు.


