సీఎం రేవంత్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం
బీజేపీతో కలిసి బీఆర్‌ఎస్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుండు
ఇచ్చిన హామీల సంగతి పక్కన పెట్టి తిట్లదండకం అందుకుండు
కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో ప్రచారం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/సిరిసిల్ల: ‘రేవంత్ బీజేపీ మనిషే.. బడేభాయ్ తమ్ముడే.. ఏనాడూ కాంగ్రెస్ మనిషి కాలేడు.. ఏనాటికైనా కాంగ్రెస్ పుట్టి ముంచెటోడే.. బీజేపీతో కలిసి బీఆర్‌ఎస్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుండు. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కేసీఆర్‌ను తిట్టుడే పనిగా పెట్టుకుండు’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డితోపాటు, సిరిసిల్లలో శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు రోడ్‌షోలు, ర్యాలీలు నిర్వహించిన అనంతరం కార్నర్ మీటింగ్‌లలో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ను తిట్టడానికే సమయం వెచ్చిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఫ్రీ బస్సు ఒక్కటి ఇచ్చి సీటు, గౌరవం లేకుండా చేసి మగవాళ్ల నుంచి డబుల్ చార్జీలు వసూలు చేస్తుండని విమర్శించారు.
స్టూవర్టుపురం దొంగలు
కాంగ్రెసోళ్లు ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం ఇస్తామని ఓట్లేయించుకున్నారని, ఎక్కువ అడిగితే మెడలో ఉన్న పుస్తెలు లాక్కెళ్లే దండుపాళ్యం, స్టూవర్టుపురం దొంగల ముఠాలుగా తయారయ్యారని కేటీఆర్ విమర్శించారు. ఐదేళ్లు మంత్రిగా, ఐదేళ్లు స్పీకర్‌గా అవకాశమిచ్చి బాన్సువాడ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు ఇచ్చిన కేసీఆర్‌ను, కారు గుర్తుపై ఓటేసి గెలిపించిన ప్రజలను దగా చేసి రేవంత్‌రెడ్డి కింద చేరిన పోచారం శ్రీనివాస్‌రెడ్డికి రోషముంటే రాజీనామా చేయాలని కేటీఆర్ సవాల్ చేశారు. పార్టీ మారిన పోచారంపై చర్యలు తీసుకోవాలని తాము స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే, తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని చెప్పాడని, మరి బీఆర్‌ఎస్‌లో ఉంటే ఈ వేదిక మీద తన పక్కన ఎందుకు లేడని ప్రశ్నించారు.
కులం.. మతం బువ్వ పెట్టవు
‘బీడీ కార్మికులు తంబాకు వాసనతో ఆరోగ్యం పాడవుతుందని తెలిసినా కుటుంబ పోషణకు మగవాళ్లకు తోడుగా కొంతైనా సంపాదించాలని శ్రమిస్తారు. చిన్నప్పుడు దుబ్బాకలో ఓ శాలోళ్ల ఇంట్లో ఉండి చదువుకున్న కేసీఆర్‌కు బీడీకార్మికుల బాధలన్నీ తెలిసే రూ.2 వేలు ఆసరా పెన్షన్‌ను కల్పించాడు’ అని కేటీఆర్ పేర్కొన్నారు. కులం, మతం బువ్వ పెట్టవని, మంచి గుణం ఉన్న నాయకుడిని ఎన్నుకుంటే.. మంచి జరుగుతుందన్నారు. మా కులపోడు.. మా మతపోడు అని ఎన్నికల్లో ఓట్లు వేయొద్దన్నారు. సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలు ఆగాలని, వాళ్ల బతుకుల్లో మార్పు రావాలని బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తే.. కాంగ్రెసోళ్లు బతుకమ్మ చీరలను బంద్ చేసి నేతన్నల బతుకులను ఆగం చేశారన్నారు. ‘నా మీద కోపంతో రాజన్న సిరిసిల్ల జిల్లాను రద్దు చేస్తారట.. మనకు జిల్లాలు వద్దా.. పాలన ప్రజలకు చేరువ కావద్దా..’ అని అడిగారు.
తొండి సంజయ్ ఏం చేశారు?
కేంద్ర మంత్రిగా, రెండు సార్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్‌కి తొండి సంజయ్ అనే పేరు సరిగ్గా సరిపోతుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రిగా ఉండి.. సిరిసిల్లకు ఏమైనా చేశాడా? రాష్ట్రానికి ఏమైనా తెచ్చాడా? అని ప్రశ్నించారు. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కోవడం తప్ప ఏమీ చేయలేదన్నారు. మనకు మంచి చేసే వాళ్లకే ఓట్లు వేయాలని, మోసం చేసే వాళ్లకు కాదన్నారు. పలువురు నాయకులు ఇతర పార్టీలను వీడి బీఆర్‌ఎస్‌లో చేరగా.. కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయా సభల్లో మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్‌షిందే, జాజాల సురేందర్, బీఆర్‌ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పాల్గొన్నారు.
బాన్సువాడలో కార్నర్ మీటింగ్‌లో మాట్లాడుతున్న కేటీఆర్


