పగలు హాట్‌... రాత్రి కూల్‌! | temperature increase in telangana | Sakshi
Sakshi News home page

పగలు హాట్‌... రాత్రి కూల్‌!

Feb 8 2026 6:22 AM | Updated on Feb 8 2026 6:22 AM

temperature increase in telangana

రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

మరో నాలుగు రోజులు ఇలాంటి వాతావరణమే..

ఆ తర్వాత క్రమంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు  

సాక్షి, హైదరాబాద్‌: చలికాలం చివరి దశలో రాష్ట్రంలో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. పగటి పూట ఎండలు చిటపటలాడుతుండగా.. రాత్రిపూట మాత్రం ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గుతూ చల్లని వాతావరణం నమోదవుతోంది. ప్రస్తుతం చలికాలం చివరి దశకు చేరింది. ఈ నెలాఖరు నుంచి ఎండలు తీవ్రం కానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న నాలుగు రోజులపాటు ఇలాంటి వాతావరణమే ఉంటుందని, ఆ తర్వాత క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

శనివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 34.4 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 13.2 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణంకంటే 3 డిగ్రీలు అధికంగా నమోదు కాగా.. హనుమకొండ, మెదక్, నిజామా­బాద్‌ ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే 2 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్ర­తలు నమోదయ్యాయి. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం సాధారణ స్థితిలోనే ఉన్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు రాష్ట్రవ్యాప్తంగా సాధారణంకంటే 1 నుంచి 2.5 డిగ్రీ సెల్సియస్‌ తక్కువగా నమోదయ్యాయి.

నెలాఖరు నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు...
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ప్రస్తుతానికి సాధారణ స్థితిలోనే ఉండగా... నెలాఖరు నుంచి వేగంగా మారే అవకాశం ఉంది. ఈ నెల చివరి వారంలో ఒకట్రెండు రోజులు ఉష్ణోగ్రతలు పెరగడం, తర్వాత రెండ్రోజులు తక్కువగా నమోదు కావడం గమనిస్తామని, ఆ తర్వాత క్రమంగా పెరుగుదల ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి కనిష్ట ఉష్ణోగ్రతల నమోదు ఎక్కువ రోజులు ఉందని చెబుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement