తాజాగా పంపే జాబితా ప్రకారం డీజీ కేడర్‌లో వీపీ ఆప్టే, సీవీ ఆనంద్, శివధర్‌రెడ్డి, అభిలాష బిస్త్, శిఖాగోయల్, సౌమ్యామిశ్రా
గతంలో పంపిన జాబితాకు కొనసాగింపుగానే జాబితాను పంపుతారా? లేక తాజాగా మరో జాబితా పంపుతారా?
డీజీపీ జాబితాలో ఉన్న వారికి ఉద్యోగ విరమణకు కనీసం 6 మాసాల గడువుండాలన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
డీజీపీ శివధర్‌రెడ్డికి ఇంకా నాలుగు నెలల సర్వీసే..
రెండు వారాల్లోగా జాబితా పంపాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో డీజీపీ ఎవరన్నది ఆసక్తికరం
సాక్షి, హైదరాబాద్: శివధర్‌రెడ్డి పూర్తిస్థాయి డీజీపీగా కొనసాగుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. రెండు వారాల్లోగా పూర్తిస్థాయి డీజీపీ ఎంపికకు జాబితాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కి పంపించాలని హైకోర్టు ఆదేశించడంతో డీజీపీ నియామక వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. శివధర్‌రెడ్డిని డీజీపీగా నియమించే సమయంలో అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం డీజీ కేడర్ ఉన్న అధికారుల జాబితాను యూపీఎస్సీకి పంపించింది. రాష్ట్ర కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి వినాయక్ ప్రభాకర్ ఆప్టే పేరు ఆ జాబితాలో లేకపోవడంతో దానిని యూపీఎస్సీ తిప్పి పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో పంపించిన జాబితాలోని ఇద్దరు అధికారులు జితేందర్, రవిగుప్తా ఉద్యోగ విరమణ చేశారు.
ఈ జాబితా పంపించే సమయానికి అభిలాష బిస్త్ ఏపీ కేడర్ అధికారిగా డీఓపీటీ నిర్ణయించింది. దీంతో ఆమె పేరును కూడా పరిగణనలోకి తీసుకోలేదు. యూపీఎస్సీకి జాబితా తిరిగి పంపే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేసింది. ఈ తరుణంలో ఓ సామాజిక కార్యకర్త డీజీపీ నియామకం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తీక్ ధర్మాసనం డీజీపీ నియామకంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని, అందుకు అనుగుణంగా డీజీ ప్యానల్ జాబితాను యూపీఎస్సీకి రెండు వారాల్లోగా పంపించాలని ఆదేశించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా డీజీ కేడర్‌లో ఉన్న 1:2 నిష్పత్తిలో యూపీఎస్సీకి పంపించాల్సి ఉంటుంది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల్లో కీలకమైన వాటిలో డీజీ పోస్టు కోసం పంపించే జాబితాలోని అధికారులకు ఉద్యోగ విరమణకు ఇంకా కనీసం ఆరు మాసాల గడువు ఉండాలని స్పష్టం చేసింది. ప్రస్తుత ఇన్‌చార్జ్ డీజీపీ శివధర్‌రెడ్డి ఉద్యోగ విరమణకు ఇంకా నాలుగు నెలలు మాత్రమే సర్వీసు ఉన్న నేపథ్యంలో ఆయన పేరును యూపీఎస్సీ పరిగణనలోకి తీసుకుంటుందా? లేదా ? అన్నది కీలకంగా మారుతుందని సీనియర్ అధికారులు అంటున్నారు. ప్రభుత్వం యూపీఎస్సీకి పంపించే జాబితాలో ఇదివరకు వచ్చిన కొర్రీకి కొనసాగింపుగా సమాధానంగా పంపిస్తున్నట్టు పేర్కొంటే.. శివధర్‌రెడ్డికి ఇబ్బంది లేదని, లేని పక్షంలో ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మొదట జాబితా పంపించే సమయంలో వినయ్ ప్రభాకర్ ఆప్టే పేరును ఎందుకు చేర్చలేదన్నది చర్చనీయాంశంగా మారింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఆయా రాష్ట్రాల కేడర్‌కు కేటాయిస్తారు. వీరిలో కొందరు కేంద్రంలో పనిచేసేందుకు డిప్యుటేషన్‌పై వెళుతుంటారు. వినయ్ ప్రభాకర్ ఆప్టే కూడా డిప్యుటేషన్‌పై వెళ్లిన అధికారి మాత్రమే.. ఆయన సుదీర్ఘకాలంగా కేంద్ర సర్వీసుల్లో కొనసాగినంత మాత్రాన ఆయన రాష్ట్ర కేడర్‌కు చెందకుండాపోరని సీనియర్ అధికారులు అంటున్నారు.
యూపీఎస్సీ ఎత్తిచూపే వరకు జరిగిన పొరపాటును రాష్ట్ర అధికారులు గుర్తించకపోవడం గమనార్హమని ఓ అధికారి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు వారాల్లోగా పంపే జాబితాలో డీజీ కేడర్ అధికారులు వినయ్ ప్రభాకర్ ఆప్టే, సీవీ ఆనంద్, శివధర్‌రెడ్డి, అభిలాష బిస్త్, శిఖాగోయల్, సౌమ్యామిశ్రా ఉండనున్నట్టు తెలిసింది. ఈ జాబితా వెళ్లిన తర్వాత అందులో నుంచి ముగ్గురి పేర్లను యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే.. ఆ ముగ్గురిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమిస్తుంది. ఈ నియామక తేదీ నుంచి రెండేళ్లపాటు ఆయన అ పదవిలో కొనసాగుతారు.
గతంలో తెచ్చిన చట్టాన్ని అబయన్స్‌లో పెట్టిన సుప్రీం
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు డీజీపీ నియామకానికి సంబంధించి తీసుకొచ్చిన చట్టాన్ని సైతం సుప్రీంకోర్టు తప్పుపట్టడంతోపాటు అబయన్స్‌లో పెట్టింది. ‘తెలంగాణ డీజీపీ అపాయింట్‌మెంట్ యాక్ట్’సీనియర్ అధికారిని డీజీపీ నియమించుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం చట్టం ద్వారా తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కాదని తెచ్చిన ఈ చట్టంపై సుప్రీంకోర్టుకు వెళ్లడంతో దానిని సుప్రీంకోర్టు అబయన్స్‌లో పెట్టిందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.


