ఢిల్లీ: ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (ఐఏఎస్)కు ఎంపికైన వారికి కేంద్ర ప్రభుత్వం కేడర్ కేటాయించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024 సైకిల్‌లో ఐఏఎస్ సాధించిన వారి కేడర్ కేటాయింపు జాబితా (IAS cadre allocation list) విడుదలైంది. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఈమేరకు జాబితాను విడుదల చేసింది.
ఫస్ట్ ర్యాంకర్ శక్తి దూబే (Shakti Dubey) తన సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ను తన కేడర్‌గా పొందారు. హరియాణాకు చెందిన రెండో ర్యాంకర్ హర్షిత గోయల్.. గుజరాత్ కేడర్‌కు ఎంపికయ్యారు. మహారాష్ట్రకు చెందిన మూడో ర్యాంకర్ డోంగ్రే అర్చిత్ పరాగ్.. కర్ణాటక కేడర్ దక్కించుకున్నారు. నాలుగో ర్యాంకర్ షా మార్గి చిరాగ్(గుజరాత్), ఐదో ర్యాంకర్ ఆకాష్ గార్గ్ (ఢిల్లీ) సొంత రాష్ట్రాల్లో కేడర్ పొందారు. టాప్ 10 ర్యాంకర్లలో ఆరుగురు తమ సొంత రాష్ట్ర కేడర్ దక్కించుకున్నారు.
టాప్ 25లో 11 మంది మహిళలు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఏడాది ఏప్రిల్ 22న సివిల్ సర్వీసెస్ పరీక్ష తుది ఫలితాలను ప్రకటించింది. 1,009 మంది అభ్యర్థులు వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు. వీరీలో 725 మంది పురుషులు, 284 మంది మహిళలు ఉన్నారు. యూపీఎస్ఈ 2024 ఫలితాల్లో యూపీకి చెందిన శక్తి దూబే మొదటి స్థానం సాధించారు. టాప్ 5 ర్యాంకర్లలో ముగ్గురు మహిళలు ఉండడం విశేషం. టాప్ 25లో 14 మంది పురుషులు, 11 మంది మహిళలు ఉన్నారు.
దేశంలో అత్యంత పోటీ ఉన్న పరీక్షల్లో ఒకటైన సివిల్స్‌లో ప్రతిఏటా లక్షలాది మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS), ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇండియన్ ట్రేడ్ సర్వీస్‌లతో పాటు ఇతర కేంద్ర సర్వీసుల్లో గ్రూప్ A, B ఉద్యోగాలు పొందేందుకు సివిల్స్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
టాప్ 10 ర్యాంకర్ల కేడర్ కేటాయింపలు ఇలా ఉన్నాయి..
ర్యాంక్ | పేరు | కేటగిరీ | సొంత రాష్ట్రం | కేడర్ |
| 1 | శక్తి దూబే | జనరల్ | ఉత్తరప్రదేశ్ | ఉత్తరప్రదేశ్ |
| 2 | హర్షిత గోయల్ | జనరల్ | హరియాణా | గుజరాత్ |
| 3 | డోంగ్రే అర్చిత్ పరాగ్ | జనరల్ | మహారాష్ట్ర | కర్ణాటక |
| 4 | షా మార్గి చిరాగ్ | జనరల్ | గుజరాత్ | గుజరాత్ |
| 5 | ఆకాష్ గార్గ్ | జనరల్ | ఢిల్లీ | AGMUT |
| 6 | కోమల్ పునియా | జనరల్ | ఉత్తరాఖండ్ | ఉత్తరప్రదేశ్ |
| 7 | ఆయుషి బన్సల్ | జనరల్ | మధ్యప్రదేశ్ | మధ్యప్రదేశ్ |
| 8 | రాజ్ కృష్ణ | జనరల్ | బిహార్ | బిహార్ |
| 9 | ఆదిత్య విక్రమ్ అగర్వాల్ | జనరల్ | హరియాణా | ఉత్తరప్రదేశ్ |
| 10 | మయాంక్ త్రిపాఠి | జనరల్ | ఉత్తరప్రదేశ్ | ఉత్తరప్రదేశ్ |


