సాక్షి ఢిల్లీ: పార్లమెంట్ లో వందేమాతరంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడారు. దేశంలోని ఎన్నికల సంస్కరణలపై చర్చ పెట్టకుండా దాని నుంచి దృష్టి మరల్చాడానికే కేంద్ర ప్రభుత్వం వందేమాతరంపై చర్చ పేరుతో కొత్త కార్యక్రమం ప్రారంభించిందని ఆరోపించారు. వందేమాతరం అంటేనే ఓ చరిత్ర అని దేశంలోని కణం కణంలో అది జీవించే ఉంటుందని ఆమె అన్నారు.
బెంగాల్ లో త్వరలో జరగునున్న ఎన్నికల కోసమే కేంద్రం ఈ కొత్త స్టంట్ మెుదలుపెట్టిందన్నారు. వందేమాతరం పై చర్చ పేరుతో దేశం కోసం పోరాటం చేసిన స్వాతంత్ర్య సమర యోధులపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. బీజేపీ ఎప్పుడు ప్రజలకు గతమే చూపిస్తుందని భవిష్యత్తు ఆ పార్టీ చూడదని ప్రజలను చూడనివ్వదని దుయ్యబట్టారు. మోదీకి మాటలు ఎక్కువ చేతలు తక్కువని, డైవర్ట్ పాలిటిక్స్ చేయడం బీజేపీకి వెన్నెతో పెట్టిన విద్య అన్నారు.
మాజీ ప్రధాని నెహ్రూని విమర్శిస్తున్నారని ఆయన దేశం కోసం 12 ఏళ్లు జైలులో ఉన్నారని ప్రియాంక అన్నారు. ఒకవేళ ఆయన ఇస్రోను ప్రారంభించకపోతే మంగళయాన్ యాత్ర జరిగేదా అని ప్రశ్నించారు. నెహ్రూ ఎయిమ్స్ ను ఏర్పాటు చేయకపోతే కరోనా వైరస్ ను ధీటుగా ఎదుర్కునే వాళ్లమా అని అడిగారు. ప్రస్తుతం ఉన్న సమస్యలను వదిలేసి వందేమాతరం పై చర్చ జరుపుతున్నట్లుగా ప్రత్యేకంగా మాజీ ప్రధాని నెహ్రూపై చర్చ జరుపుదామని ప్రియాంక గాంధీ పార్లమెంటులో మాట్లాడారు.
వందేమాతరం 150 ఏళ్ల వేడుక సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ముస్లింలకు నచ్చదనే కారణంగా వందేమాతరాన్ని వ్యతిరేకించడంలో జవహర్ లాల్ నెహ్రూ, జిన్నాను అనుసరించాడన్నారు. 1937లో ముస్లిం లీగ్ వందేమాతర గీతానికి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టిందని తెలిపారు. అయితే దానిని వ్యతిరేకించాల్సింది పోయి వారి నిరసనలకు తలొగ్గి వందేమాతరం గీతం నుంచి కొన్ని పంక్తులను జవహర్ లాల్ నెహ్రూ తొలగించారని మోదీ అన్నారు. దీంతో ప్రధానిపై ప్రియాంక గాంధీ విమర్శలు చేశారు.


