
‘నువ్వు ఏం చేయాలి అని సందిగ్ధానికి లోనయినప్పుడు, జీవితంలో నీకు తారసపడ్డ అత్యంత నిరుపేద, నిస్సహాయుడి ముఖాన్ని గుర్తు తెచ్చుకొని, ఇప్పుడు నీవు తలపెట్టిన పని అతనికి ఏవిధంగా నైనా సాయపడుతుందా? తన బ్రతుకు తాను బ్రతకడానికీ, తన జీవితం సఫలం చేసుకోవడానికీ నువ్వు చేయబోయే పని అతని కేమైనా ఊతమిస్తుందా అని ఆత్మావలోకన చేసుకో, కర్తవ్యం నీకు బోధపడుతుంద’న్న గొప్ప జీవన సందేశాన్ని ఇచ్చినవారు మహాత్మా గాంధీజీ. గాంధీజీ ప్రత్యేకత ఏమిటంటే... తాను చెప్పిన విషయాన్ని తాను స్వయంగా ఆచరించిన తర్వాతనే చెప్పేవారు. ఇతరులు ఎలాంటి వారైనా, మన పట్ల ఎంతటి ద్వేషభావన కలిగి ఉన్నా... మన ప్రవర్తన ద్వారా ఎదుటివారిలో మానవతను కలిగించేలా నడుచుకోవాలని ఉద్బోధించారు. ఆ ప్రకారమే పాలకులలో పరి వర్తన తీసుకురావడానికి ‘సత్యాగ్రహం’, ‘అహింస’, ‘సత్యం’ అనే మూడు ప్రధాన ఆయుధాలను ఉపయోగించుకొని జాతీయో ద్యమాన్ని మరో మలుపు తిప్పారు.
అహింసాయుతంగా, మౌనంగా పోలీసులు లాఠీలతో కొడుతున్నా భరిస్తూ తమ నిరసనను తెలియజేసే ‘సత్యాగ్రహం’ ఆయుధాన్ని గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ప్రయోగించి అనేక విజయాలు సాధించారు. గోపాలకృష్ణ గోఖలే కోరిక మేరకు దేశంలో అప్పటికే కొనసాగుతున్న జాతీయోద్యమంలో పాల్గొనడానికి భారత దేశానికి గాంధీజీ తిరుగు ప్రయాణం అయినప్పుడు దక్షిణాఫ్రికాకు చెందిన సైనికాధికారి జనరల్ ‘గిల్బల్ట్ ముర్రే’ బ్రిటీష్‌వారిని ఇలా హెచ్చరించాడు: ‘గాంధీకి సుఖాపేక్ష లేదు, ధనాపేక్ష లేదు; కామం, మోహం లేవు. తాను ధర్మం అని నమ్మిన దానిని ఆచరించడానికి ఎంత దూరమైనా వెళతాడు. అందువల్ల గాంధీ విషయంలో తగిన జాగ్రత్త వహించాలి. అటువంటి వ్యక్తి దేహంపై మీరు విజయం సాధించవచ్చునేమో గానీ, అతని వ్యక్తిత్వాన్ని జయించడం అసాధ్యం. గాంధీ మీకు ప్రమాదకరమైన చిక్కులు తెచ్చి పెట్టే శత్రువు అవుతాడు’. గిల్బర్ట్ చేసిన ఈ హెచ్చరిక ఎంత నిజమో ఆ తర్వాత కాలంలో భారతదేశంలోని బ్రిటిష్ పాలకులకు అనుభవంలోకి వచ్చింది.
ఒక సందర్భంలో గాంధీ తన ‘యంగ్ ఇండియా’ పత్రికలో ఇలా రాశారు: ‘‘నా భావాలు మారుతూ ఉంటాయి. సత్యాన్వేషణలో నేను అనేక విశ్వాసాలను వదులుకొన్నాను. కొత్త విశేషాలు తెలుసు కొన్నాను. సత్యమే నా దేవుడు. అందువల్ల ‘వెనుక చెప్పిన వాటికి, ఇప్పుడు చెప్పేవాటికి పొంతన లేకుండా ఉన్నదే...’ అని నన్ను విమర్శించే బదులు, నేను ఇటీవల చెప్పిన మాటనే గ్రహించమని కోరుతున్నాను’ అంటూ వివరణ ఇచ్చారు.
నిరాడంబరతకు చిహ్నంగా నిలిచారు గాంధీజీ. 1921 సెప్టెంబర్ 27న గాంధీజీ ఇతర దుస్తులన్నీ విసర్జించి భారతీయులుధరించే కొల్లాయిగుడ్డ, ఉత్తరీయానికి తన దుస్తుల్ని పరిమితం చేసుకొన్నారు. బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్‌తో చర్చలు జరప డానికి ఇంగ్లాండ్‌కు అదే వేషధారణతో వెళ్లిన గాంధీని బ్రిటీష్ పాలకులు ‘హాఫ్ నేక్‌డ్ ఫకీర్’ (అర్ధనగ్న సన్యాసి) అని అవహేళన చేసినప్పుడు గాంధీ చిరునవ్వు నవ్వి ‘మీరు చూడాల్సింది నా దుస్తులు కాదు... నేను మోసుకొచ్చిన కోట్లాది భారతీయుల ఆకాంక్ష’ అని చెప్పి, వారు సిగ్గుతో తలవంచుకొనేలా చేశారు. గాంధీజీ ప్రవచించి ఆచరించిన ఉన్నత మార్గాలలో ‘అహింసా మార్గం’ ఒక్కటే ‘ప్రపంచశాంతిని’ నెలకొల్పగలదని అన్ని సందర్భా లలో రుజువయ్యింది. గాంధీ బోధనలు, సత్యాన్వేషణకై ఆయన వేసిన మార్గాలు ఎప్పటికీ నిత్యనూతనం!
– డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
కేంద్ర మాజీ మంత్రి, ఏపీ శాసనమండలి సభ్యులు
( అక్టోబరు 2- గాంధీ జయంతి)