breaking news
October 02
-
గాంధీగారు తప్పు చేస్తే?
‘‘ప్రపంచంలో సిగరెట్ల కోసం ఇంత మోజెందుకో నాకు అర్థం కాదు. పోగ త్రాగేవాళ్లతో రైలు ప్రయాణం నేను చేయలేను. నాకు ఊపిరాడదు. అంతకంటే మరో పెద్ద తప్పు చేశాను. నాకు 13 ఏండ్ల వయసులో మొదట సిగరెట్ల కోసం డబ్బులు దొంగిలించాను. తరువాత 15వ ఏట పెద్ద దొంగతనం చేశాను. మా అన్న చేతికి ఉండే బంగారు మురుగు నుంచి కొంచెం దొంగిలించాలని అతను అంటే నేను సరే అన్నాను. దానికి కారణం మా అన్న ఇరవై రూపాయలు అప్పుబడ్డాడు. ఈ అప్పు ఎలా తీర్చడమా అని మేమిద్దరం ఆలోచించాము. అతని చేతికి బంగారు మురుగు ఉంది. దానిలో ఒక తులం ముక్క తీయించడం తేలిక అని నిర్ణయించాం. ఆ పని చేశాం. అప్పు తీర్చాం. కాని ఈ చర్యను నేను సహించలేకపోయాను. ఇక దొంగతనం చేయకూడదని నిశ్చయించుకున్నాను. అయితే నా మనస్సు శాంతించలేదు. తండ్రిగారికి చెప్పవలెనని అనిపించింది. కాని ఆయన ముందు నోరు విప్పి ఈ విషయం చెప్పేందుకు సాహసం కలుగలేదు. వారు కొడతారనే భయం కలుగలేదు. తన బిడ్డలనెవ్వరినీ మా తండ్రి కొట్టరు. బంగారు మురుగు విషయం చెబితే మనస్తాపంతో క్రుంగిపోతారనే భయం నన్ను పట్టుకుంది. ఏది ఏమైనా దోషం అంగీకరిస్తేనే బుద్ధి కలుగుతుందని విశ్వాసం కలిగింది. తండ్రికి మనస్తాపం కలిగించినా పరవాలేదని భావించాను.చివరికి ఒక చీటీమీద చేసిన తప్పంతా రాసి క్షమించమని ప్రార్థించాలి అను నిర్ణయానికి వచ్చాను. ఒక కాగితం మీద జరిగినదంతా వ్రాశాను. వెళ్లి మా తండ్రిగారికి ఇచ్చాను. ఇంతటి తప్పు చేసినందుకు తగిన విధంగా శిక్షించమనీ, ఇక ముందు దొంగతనం చేయననీ శపథం చేశాను. ఇదంతా వ్రాసిన చీటీ వారి చేతికి ఇస్తున్నప్పుడు వణికిపోయాను. మా తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ మంచం పట్టి ఉన్నారు. ఆయన బల్లమీద పడుకుని ఉన్నారు. చీటీ వారి చేతికి ఇచ్చి ఎదురుగా నిలబడ్డాను. వారు చీటీ అంతా చదివారు. వారి కండ్లనుండి ముత్యాలవలె కన్నీరు కారసాగింది. ఆ కన్నీటితో చీటీ తడిసిపోయింది. ఒక్క నిమిషం సేపు కండ్లు మూసుకుని ఏమో యోచించారు. తరువాత చీటీని చింపివేశారు. మొదట చీటీ చదివేందుకు ఆయన పడకమీద నుంచి లేచారు. ఆ తరువాత తిరిగి పడుకున్నారు. నాకు కూడా ఏడుపు వచ్చింది. తండ్రికి కలిగిన వేదనను గ్రహించాను. చిత్రకారుడనైతే ఈ రోజు కూడా ఆ దృశ్యాన్ని చిత్రించగలను. ఆ దృశ్యం ఇప్పటికీ నా కండ్లకు కట్టినట్లు కనబడుతున్నది. వారి ప్రేమాశృవులు నా హృదయాన్ని కడిగివేశాయి. అనుభవించిన వారికే ఆ ప్రేమ బోధపడుతుంది.’’ -
Gandhi Jayanti 2021: గోఖలే - గాంధీ గురుశిష్య బంధానికి పునాది ఆ ఘట్టమే..
గాంధీని భారతీయులంతా మహాత్ముడని అంటారు. కానీ గాంధీజీ తన హృదయంలో మరొక మహాత్ముడిని ప్రతిష్ఠించుకున్నారు. గురువుగా ఆరాధించారు కూడా. ఆయనే గోపాలకృష్ణ గోఖలే (1866 – 1915). ‘గోఖలే: మై పొలిటికల్ గురు’ (గుజరాతీ భాషలో గాంధీజీ రాసిన ‘ధర్మాత్మ’ అనే చిన్న పుస్తకానికి ఇంగ్లిష్ అనువాదం)లో ఆ ఇద్దరి అనుబంధం గురించి రమణీయ చిత్రణ కనిపిస్తుంది. గాంధీజీ దక్షిణాఫ్రికాను వీడి భారతదేశం రావాలన్న ఉద్దేశం, స్వాతంత్య్రోద్యమ సారథ్యం స్వీకరించాలన్న ఆశయం గోఖలే మేధోజనితమే. దక్షిణాఫ్రికాకు వలసపోయిన తరువాత గాంధీజీ 12 అక్టోబర్, 1896లో ఒకసారి భారత్ వచ్చి, పూనా వెళ్లారు. మొదటిసారి గోఖలేని దర్శించుకున్నారు. ఫెర్గూసన్ కళాశాల మైదానంలో తొలిసారి చూసినప్పుడే గోఖలేకు భక్తుడయ్యారు గాంధీజీ. చరిత్రలో పెద్దగా నమోదుకాని గోఖలే, గాంధీ గురుశిష్య బంధానికి ఆస్కారం కల్పించినవారు మరొక జాతీయ కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్‌షా మెహతా. ‘మెహతా నన్ను హిమాలయంలా చూస్తున్నారు. కానీ లోకమాన్యుడు ఒక సాగరం. గోఖలే పవిత్ర గంగ. హిమాలయాన్ని అధిరోహించడం భయానకం. సముద్రయానమంటే భయం. స్నానం చేసి అద్భుత అనుభూతిని ఆస్వాదించమని గంగ ఆహ్వానిస్తుందంటారు ఆ పుస్తకంలో గాంధీజీ. గోఖలేని అంత సమున్నత దృష్టితో దర్శించారు. భిన్నధ్రువాలు ఆ సమయంలో గోఖలేని కలుసుకోవడానికి కొంచెం ముందు పూనాలోనే లోకమాన్య బాలగంగాధర తిలక్‌ను కూడా గాంధీజీ కలుసుకున్నారు. స్వాతంత్య్ర కాంక్ష ఉద్యమరూపం దాలుస్తున్న ఆ కాలం మీద తిలక్, గోఖలే రెండు తారకల్లా మెరిసినవారే. నిజానికి 20వ శతాబ్దం ఆరంభంలో భారతీయ రాజకీయ తాత్త్వికతను మలచినవారు ఆ ఇద్దరే. కానీ వారు భిన్నధ్రువాలు. గోఖలే పెద్ద మితవాది. రాజ్యాంగబద్ధమైన పద్ధతులలో రాజకీయహక్కులు సాధించాలన్నది మనసా వాచా ఆయన నమ్మిన మార్గం. స్వయం ప్రభుత్వం ఆ పద్ధతిలోనే కోరాలన్నది ఆయన రాజకీయతత్త్వం. కానీ తిలక్ ఆ మార్గానికి బద్ధ వ్యతిరేకి. చెడును నివారించడానికి ధర్మాగ్రహం ప్రదర్శించినా తప్పులేదనీ, గీతాసారం ఇదేననీ ఆయన ప్రగాఢ నమ్మకం. అయినా ఆ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి అపారమైన గౌరవం. జనవరి, 1908లో దేశద్రోహం కేసులో తిలక్‌కు ప్రవాస జైలుశిక్ష విధించి మాండలే జైలుకు పంపారు. దీనిని గోఖలే తీవ్రంగా వ్యతిరేకించారు. తిలక్ తరఫున కేసు వాదించినవారు మహమ్మద్ అలీ జిన్నా. ఉతికి ఆరేశారు ఆ రెండు భిన్నధ్రువాలను కలుసుకున్నా గాంధీజీ తనదైన బాటనే ఎంచుకున్నారు. తరువాత గోఖలే, గాంధీని మళ్లీ 1901 నాటి కలకత్తా జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశాలలో కలుసుకున్నారు. ఒకచోటే నెలరోజులు ఉండవలసి వచ్చింది. 1912లో దక్షిణాఫ్రికాకు గోఖలే వెళ్లినప్పుడు అక్కడ గాంధీజీ ఏర్పాటు చేసిన టాల్‌స్టాయ్ ఆశ్రమంలోనే ఉన్నారు. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ప్రవాస భారతీయుల హక్కుల కోసం జరుపుతున్న ఉద్యమం కోసం గోఖలే భారత్‌లో నిధి సేకరించి పంపారు. అక్కడి భారతీయ కార్మికుల హక్కుల కోసం అక్కడి అధికారులతో పాటు, బ్రిటిష్ ఇండియా పాలకులతో కూడా చర్చించారు. ఆ గురుశిష్యుల బంధం ఎంత బలపడిందంటే, పెద్ద పెద్ద సమావేశాలకు హాజరైనప్పుడు గోఖలే ఒక కండువా వేసుకునేవారు. అది ఆయనకు అత్యంత ఇష్టమైనది. ఎందుకంటే, మరొక మహనీయుడు మహదేవ గోవింద రానడే ఇచ్చిన కానుక. ఆ కండువాను ఉతికి, ఇస్త్రీ చేయవలసి వచ్చింది. కానీ సమయానికి లాండ్రీ ఏదీ అందుబాటులో లేదు. గాంధీజీ తానే ఆ పని చేసిపెడతానన్నారు. అందుకు గోఖలే,‘ న్యాయవాదిగా నీ ప్రతిభ మీద నాకు నమ్మకం లేదు కానీ, ఈ ఉతికి ఆరేసే పని బాగా చేస్తావనే అనుకుంటున్నాను’ అన్నారు. అక్కడ నడుపుతున్న ఆ అహింసాయుత ఉద్యమం చూశాకే, గాంధీజీ భారతదేశం రావలసిందేనని గోఖలే గట్టిగా కోరుకున్నారు. ఆ మాట హాస్యానికే అన్నా గాంధీజీ భారత్‌కు వచ్చిన తరువాత స్వాతంత్య్రోద్యమంలోకి రాకుండా చోద్యం చూస్తున్నవారి మకిలి మనస్తత్త్వాన్ని ఉతికి ఆరేశారు. గాంధీ రావడానికి అంగీకరించిన తరువాత, ‘నీవు దేశం వీడి చాలా కాలం అయింది కాబట్టి, సామాజిక పరిస్థితి అర్థం కావడానికి ఒకసారి భారతదర్శనం చేసుకురమ్మ’ని సలహా ఇచ్చినది కూడా ఆ గొప్ప రాజకీయ గురువే. అంతేకాదు, ఆ యాత్ర పూర్తయ్యే వరకు భారతీయ సమస్యల గురించి పల్లెత్తు మాట కూడా అననని గాంధీజీ చేత ప్రమాణం చేయించారు. వేషం మారింది 1914లో దక్షిణాఫ్రికాలోనే సత్యాగ్రహోద్యమం చివరిదశలో గోఖలే నుంచి లేఖ వచ్చింది. 1914 ఫిబ్రవరి 27న గాంధీజీ తిరిగి లేఖ రాశారు. ‘ఏప్రిల్‌లో నేను ఈ దేశం విడిచిరావాలని నిశ్చయించాను. తరువాత నేను మీరు నడిపించినట్టు నడుస్తాను. అనుభవం, విషయ పరిజ్ఞానం కోసం మీ అడుగుజాడలలో నడవాలని అనుకుంటున్నాను’ అని ప్రత్యుత్తరం ఇచ్చారు. 1914 జూలై 18న గాంధీజీ దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ నుంచి బయలుదేరారు. ఇంగ్లిష్ చానల్ దాటేసరికి మొదటి ప్రపంచ యుద్ధం మొదలయింది. దాంతో ఇంగ్లండ్‌లో చిక్కుపడిపోయారు. గోఖలే ఫ్రాన్స్‌లోని వీచీలో వైద్యం కోసం ఉన్నారు. సెప్టెంబర్ 18న ఆ ఇద్దరు కలుసుకున్నారు. గాంధీ ఆ డిసెంబర్ 19న ఎస్ఎస్ అరేబియా పేరుగల నౌక ఎక్కారు. అప్పుడే ఆయన ఆహార్యం మారిపోయింది. పంచెకట్టు, అంగీ, తలపాగాతో అచ్చమైన గుజరాతీ భూమిపుత్రునిలా తయారయ్యారు. 1915 జనవరి 9న బొంబాయిలోని అపోలో బందర్ నౌకాశ్రయంలో ఉదయం ఏడున్నరకు తొలి వెలుగులలో దిగారు. చిత్రంగా శిష్యుడికి స్వాగతం చెప్పడానికి గోఖలే ముందే పూనా చేరుకున్నారు. బొంబాయిలో గాంధీజీ గౌరవార్థం గుజరాతీ సంఘం ఏర్పాటు చేసిన సత్కార సభకు అధ్యక్షుడు సాక్షాత్తు జిన్నాయే. స్వచ్ఛ స్ఫటికం ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన గోఖలే.. గాంధీజీని వెంటనే పూనా పిలిపించారు. మొదట తన స్వచ్ఛంద సంస్థ సర్వెంట్స్ ఆఫ్ ఇండియాలో గాంధీ చేరాలని కోరుకున్నారు. అప్పటికి గోఖలే తరువాతి స్థానంలో వీఎస్ శ్రీనివాసశాస్త్రి ఉన్నారు. తన తరువాత ఆ సంస్థను గాంధీ నడిపించాలని కూడా కోరుకున్నారు. గోఖలేని కలుసుకున్న తరువాత గాంధీజీ కలుసుకోదలచిన మరొక వ్యక్తి అంతకు ఒకటిన్నర సంవత్సరం క్రితమే నోబెల్ సాహిత్య పురస్కారం అందుకున్న విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్. శాంతినికేతన్‌కు గాంధీజీ ప్రయాణం రోజు సాయంత్రమే గోఖలే సన్నిహితులతో ఒక విందు ఏర్పాటు చేశారు. తన నివాసానికి కొన్ని అడుగుల దూరంలోనే ఈ విందు జరుగుతున్నప్పటికి హాజరు కావాలని అనుకోలేదు. కదిలే ఓపిక లేదు. కానీ గాంధీ మీద అనురాగంతో అతికష్టం మీద వచ్చారు. అక్కడే స్పృహ కోల్పోతే మోసుకుని తీసుకువెళ్లవలసి వచ్చింది. గాంధీ భారత్‌లో అడుగుపెట్టిన ఐదారు వారాలకే 1915 ఫిబ్రవరి 18న గోఖలే కన్నుమూశారు. ‘రాజకీయ రంగంలో గోఖలే స్వచ్ఛ స్ఫటికం’ అన్నారు గాంధీ. కష్టపెట్టింది గోఖలే మొదట భావించినట్టుగా ‘సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ’లో చేరడానికి గాంధీ దరఖాస్తు చేసుకున్నారు. అయితే గోఖలే చనిపోగానే మిగిలిన సభ్యులు శాస్త్రిని అధ్యక్షుడిని చేశారు. సంస్థ లక్ష్యాల విషయంలో గాంధీకీ, శాస్త్రికి మధ్య జరిగిన చర్చలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. గాంధీజీ తన దరఖాస్తును ఉపసంహరించుకున్నారు. శాస్త్రి మితవాద కాంగ్రెస్ నాయకులకు మార్గదర్శకునిగా మిగిలారు.ఆయన న్యాయ నిపుణుడు. గాంధీ జననేత అయ్యారు. అంటే తాను భారత్ వచ్చిన తరువాత ఒక ప్రముఖ సామాజిక సంస్థకు అధ్యక్షుడు కావడానికి కూడా పోటీని ఎదుర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో అంత ఉద్యమం నడిపిన వ్యక్తికి ఇది కొంచెం మనసును కష్టపెట్టే విషయమే. వెంటనే గాంధీ సబర్మతి ఆశ్రమం స్థాపించారు. గాంధీజీ ధోరణి వేరు. 1924 జనవరి 12న గాంధీకి అపెండిసైటిస్ శస్త్ర చికిత్స చేయవలసి వచ్చింది. ఎరవాడ జైలు నుంచి బొంబాయిలోని ససూన్ ఆసుపత్రికి తరలించారు. తాను శ్రీనివాసశాస్త్రిని కలుసుకోవాలని చెప్పారు గాంధీ. శాస్త్రి వచ్చిన తరువాత తన శస్త్ర చికిత్స గురించి ఆందోళన పడవద్దని కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్పాలనీ, ఒకవేళ జైలు శిక్ష అనుభవిస్తున్న తనను ప్రభుత్వం ఈ సమయంలోనైనా విడుదల చేయాలని ఎవరైనా ఆందోళన చేయదలిస్తే శాంతియుతంగానే చేయాలని చెప్పాలనీ గాంధీ కోరారు. గాంధీజీకి శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగిందని తరువాత ప్రకటించింది శాస్త్రినే. గాంధీ ఆత్మకథ ‘ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్’ రాతప్రతినీ, ఇంగ్లిష్‌నీ శ్రీనివాసశాస్త్రి చేతనే సరిదిద్దించుకున్నారు. ఈ పనిని శాస్త్రి ఎంత శ్రద్ధగా చేశారో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆ పుస్తకానికి ఉన్న ఖ్యాతిని బట్టి తెలుస్తుంది. ఏ క్షణంలోనూ దిగిపోకూడదు తిలక్, గాంధీ బంధం గమనించదగినది. గోఖలేకూ, తిలక్‌కూ ఉద్యమ పంథాలో విభేదాలు న్నాయి. కానీ గోఖలేను గురువుగా స్వీకరించిన గాంధీజీకీ తిలక్‌కూ ఘర్షణ లేదు. 1907లో కాంగ్రెస్ నుంచి బహిష్కృతుడైన తిలక్ మాండలే జైలు నుంచి వచ్చిన తరువాత ఎలాంటి భేషజం లేకుండా మళ్లీ జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి కాంగ్రెస్ పంథాలో ఇమడగలిగారు కూడా. క్రమంగా గాంధీజీ మొత్తం స్వాతంత్య్ర సమరానికి నాయకుడయ్యారు. గాంధీ వెంట నడవడానికి తిలక్ వెనుకాడలేదు. 1920 జూలై 31న బొంబాయిలో లోకమాన్య బాలగంగాధర తిలక్ మృత్యువుతో పోరాడారు. నగరంలోని ప్రముఖ వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. కన్నుమూశారు. అప్పుడు బొంబాయిలోనే ఉన్న గాంధీజీకి వార్త తెలిసింది. పడుకున్న నులక మంచం మీదనే కూర్చుని, ఎదురుగా వెలుగుతున్న దీపం వైపే చాలాసేపు చూస్తూ ఉండిపోయారు. గాంధీజీ కార్యదర్శి మహదేవ దేశాయ్ అప్పుడే ఆ గదిలోకి వచ్చారు. వెంటనే గాంధీజీ ‘ఇంక క్లిష్ట సమయాలలో సలహా కోసం ఎవరి దగ్గరికి వెళ్లాలి నేను? మహారాష్ట్ర మొత్తం నుంచి సాయం కావాలని అనుకున్నప్పుడు ఇక ఎవరితో సంప్రదించాలి నేను? ఇప్పటివరకు నేను చేసిన పోరాటమంతా స్వరాజ్యం కోసమే. అయితే ఆ మాట నేను బయటకు అనలేదు. ఆ మాటను ఆయన చాటి చెప్పారు. ఆ నినాదం సజీవంగా ఉండేటట్టు చేయాలి. ఆ నినాదం మౌనం దాల్చకూడదు. స్వరాజ్ అంటూ ఆ యోధుడు ఎత్తిన పతాకం ఏ క్షణంలోను కిందకి దిగిపోకూడదు’ అన్నారు. మరొక సందర్భంలో, ‘లోకమాన్యుడు స్వరాజ్యం కోసం తపించని క్షణం లేదు. ఆయన మెలకువగా ఉన్నారంటే, స్వరాజ్యం కోసం ఆలోచిస్తున్నారనే’ అనీ గాంధీజీ అన్నారు. వెంట నడిపించారు 1889లో గోఖలే కాంగ్రెస్‌లో చేరారు. 1890లో తిలక్ చేరారు. 1904 ప్రాంతంలో మహమ్మద్ అలీ జిన్నా సభ్యుడయ్యారు. గాంధీజీ ఏనాడూ ఆరణాలు ఇచ్చి కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదు. కానీ తన వెంట నడిపించారు. అంటే తొలితరం నాయకుల నుంచి, 1947లో స్వాతంత్య్రం వచ్చిన నాటి కాంగ్రెస్ నాయకుల తరం వరకు గాంధీజీ వారందరితో కలసి అడుగులో అడుగు వేశారు. ఫిరోజ్‌షా మెహతా, గోఖలే, తిలక్, మాలవీయ, సరోజినీ నాయుడు, మోతీలాల్ మొదలు సర్దార్ పటేల్, బాబూ రాజేంద్రప్రసాద్, సుభాష్ చంద్ర బోస్, నెహ్రూ, జేబీ కృపలానీ, పురుషోత్తమదాస్ టండన్, సప్రూ, ప్రకాశం, పట్టాభి, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ల వరకు కలసి సాగారు. ఎన్నో సంఘర్షణలు, సర్దుబాట్లు. మరెన్నో విభేదాలు. పూలూ, రాళ్లూ కూడా. ప్రపంచ చరిత్రలో ప్రత్యేకతను సంతరించుకున్న భారత స్వరాజ్య సమరానికి ఒక నేతను నిర్మించి ఇచ్చినది ఆ ప్రయాణమే. చరిత్ర మరువని ఉద్యమనేతగా గాంధీని మలచినది ఈ ప్రస్థానమే. దాని నేపథ్యమే. అంతిమంగా ఆయన మార్గం ప్రపంచ ఉద్యమాలకు మార్గదర్శకంగా నిలించింది. అహింసా ఒక ఆయుధమేనని గాంధీ నిరూపించారు. - డా. గోపరాజు నారాయణరావు -
అక్టోబర్‌లో ట్రెడా ప్రాపర్టీ షో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) అక్టోబరు 1, 2,3 తేదీల్లో 11వ ఎడిషన్ ప్రాపర్టీ షోను నిర్వహించనుంది. మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనుంది. సుమారు 150 నిర్మాణ సంస్థలు, 400 ప్రాపర్టీలను ప్రదర్శనలో ఉంచనున్నట్లు ట్రెడా జనరల్ సెక్రటరీ సునీల్ చంద్రారెడ్డి తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడిప్పుడే పుంపుకుంటోంది. ఇటీవల ఆగస్టులో క్రెడాయ్ ఆధ్వర్యంలో హైటెక్స్, హైదరాబాద్‌లో జరిగిన ప్రాపర్టీ షోకి సైతం మంచి స్పందన లభించింది. చదవండి: CII-Anarock survey: రూ.90 లక్షల్లోపు బడ్జెట్ ఇళ్లను తెగకొనేస్తున్నారు -
‘సచివాలయ’ ఉద్యోగులకు రాత పరీక్ష!
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల తొలి బ్యాచ్ ఉద్యోగులకు ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీకి రెండేళ్ల సర్వీసు పూర్తవుతోంది. నిబంధనల ప్రకారం వారందరికీ ప్రొబేషన్ డిక్లేర్ చేసి పే స్కేలు అమలు చేయనున్నారు. దీనికి ముందు వారికి శాఖ పరంగా æక్రెడిట్ బేస్ అసెస్మెంట్ పరీక్షను సెప్టెంబర్ 11 – 17 తేదీల మధ్య ఒక రోజు నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. 90 నిమిషాల్లో వంద ప్రశ్నలతో పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దేశ చరిత్రలోనే రికార్డు స్థాయిలో 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి, నాలుగు నెలల్లోనే వాటి భర్తీ కూడా పూర్తి చేసిన విషయం తెలిసిందే. వీరిలో 1.21 లక్షల మంది 9 ప్రభుత్వ శాఖలకు అనుబంధంగా సచివాలయాల్లో పనిచేస్తున్నారు. వీరిలో తొలి బ్యాచ్‌కు పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షకు శాఖలవారీగా సిలబస్‌ను నిర్ధారించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఆయా శాఖలకు శుక్రవారం లేఖలు రాశారు. ఏవైనా శాఖలు 65 ప్రశ్నల కేటగిరీలో రాతపరీక్షకు బదులు కేవలం ప్రాక్టికల్స్ నిర్వహించాలని భావిస్తే అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రశ్నపత్రాల తయారీ, మార్కుల వెల్లడి బాధ్యతలను ఏపీపీఎస్సీకి అప్పగించినట్టు అజయ్‌జైన్ పేర్కొన్నారు. -
జన్మభూమికి కొత్త పాటలు సిద్ధం!
హైదరాబాద్: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమానికి మరోసారి శ్రీకారం చుట్టనుంది. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమం కోసం సరికొత్తగా నాలుగు పాటలను టీడీపీ ప్రభుత్వం రూపొందించింది. ఆ పాటలను ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరాం రచించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్ని అందించారు. గతంలో జన్మభూమి టైటిల్ సాంగ్‌ను వందేమాతం శ్రీనివాస్ అందించిన సంగతి తెలిసిందే. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జన్మభూమి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున్న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ మరోసారి అధికారాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'జన్మభూమి - మన ఊరు' పేరిట కొత్త కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. తమ సొంత గ్రామానికి, ప్రజలకు తోడ్పాటు అందించాలన్న లక్ష్యంతో దీనిని నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించిన ప్రకటనలో వెల్లడించారు.