సాహస పథం
సౌత్ పోల్‌కు స్కీయింగ్ చేసిన అతి పిన్న వయస్కురాలైన భారతీయురాలిగా, ప్రపంచంలో రెండవ అతి పిన్న వయస్కురాలైన మహిళగా చరిత్ర సృష్టించింది పద్దెనిమిదేళ్ల కామ్య కార్తికేయన్.
నూట పదిహేను కిలోమీటర్‌ల సవాళ్లతో కూడిన రహదారి అది. అడుగడుగునా సవాళ్లు ఎదురైనా ఆమె వెనక్కి తగ్గలేదు. భారత నావికాదళ అధికారి కుమార్తె అయిన కామ్య చిన్న వయసు నుంచి ఎన్నో సాహసగాథలు విన్నది. ఆ గాథలే తనను సాహసానికి ప్రేరేపించాయి.
కామ్య సాధించిన విజయాన్ని భారత నావికాదళం ‘ఎక్స్’ వేదికగా ప్రశంసించింది. ‘భూమిపై అత్యంత కఠినమైన వాతావరణాన్ని అధిగమించి ముందుకు సాగడం అనేది ఆమె ధైర్యాన్ని, దృఢసంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. వంట్లోని రక్తాన్ని గడ్డకట్టించేంత అత్యల్ప ఉష్ణోగ్రతలు, తుఫాను గాలులను ఎదుర్కొంటూ ఆమె తన ప్రయాణాన్ని విజయవంతంగా ముగించింది.
నేవీ చిల్డ్రన్ స్కూల్ పూర్వ విద్యార్థి అయిన కావ్య కార్తికేయన్ గతంలోనూ ఎన్నో సాహసాలు చేసింది. నేపాల్ వైపు నుండి ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించింది. ప్రపంచంలోని అత్యంత కఠినమైన సాహసోపేతమైన సవాళ్లలో ఒకటైన ‘ఎక్స్΄్లోరర్స్ గ్రాండ్‌స్లామ్’పై దృష్టి పెట్టింది. దీనికోసం ఏడు ఖండాలలోని ఎత్తైన శిఖరాలను అధిరోహించి, ఉత్తర, దక్షిణ ధ్రువాలకు స్కీయింగ్ చేయాల్సి ఉంటుంది. సాహసాన్ని వెన్నెముకగా ధరించిన కామ్య కార్తికేయన్‌కు అది ఏమంత పెద్ద సవాలు కాకపోవచ్చు!


