ఐఎన్‌ఎస్ డేగాలో అత్యాధునిక ఏవియేషన్ లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణానికి శంకుస్థాపన
యుద్ధ విమానాల నిర్వహణ, లాజిస్టిక్ రంగంలో స్వయం సమృద్ధి దిశగా అడుగులు
చైనా సవాళ్లను ఎదుర్కొనేలా తూర్పు తీర రక్షణ కవచం మరింత బలోపేతం
మిగ్ 29కే స్క్వాడ్రన్, పీ 8ఐ, ఎంహెచ్ 60ఆర్ నిర్వహణకు రంగం సిద్ధం
అధునాతన ట్రాకింగ్ సిస్టమ్‌తో ఇక్కడి నుంచే యుద్ధ విమాన విడిభాగాల నిర్వహణ
సాక్షి, విశాఖపట్నం : హిందూ మహా సముద్రంలో మారుతున్న వ్యూహాత్మక అవసరాలకు అనుగుణంగా భారత నౌకాదళం తన సామర్థ్యాన్ని శరవేగంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రమైన విశాఖపట్నం మరో కీలక మైలురాయికి వేదికగా మారుతోంది. నౌకాదళ నేవల్ బేస్ ఐఎన్‌ఎస్ డేగాలో అత్యాధునిక విమానయాన మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా ఈ నెల 21న అత్యాధునిక ఏవియేషన్ లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
దీనిద్వారా యుద్ధ విమానాల నిర్వహణ, లాజిస్టిక్స్ రంగంలో స్వయం సమృద్ధి దిశగా నౌకాదళం కీలక అడుగు వేయనుంది. ఓవైపు అణ్వాయుధ పరీక్షల్లో తనదైన ముద్ర వేస్తున్న తూర్పు తీరం... రక్షణ వ్యవస్థలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించే దిశగా దూసుకుపోతోంది. సముద్ర జలాల పరిరక్షణ, ప్రపంచ వాణిజ్య కార్యకలాపాల భద్రతకు అవసరమైన వ్యవస్థలు తూర్పు నౌకాదళంలో ఒక్కొక్కటిగా కేంద్రీకృతమవుతున్నాయి.

యుద్ధ నౌకల పహారాతోపాటు గగనతలంలోనూ ‘వాయు’ వేగంగా స్పందించే అధునాతన వ్యవస్థలకు కేంద్ర బిందువుగా మారుతోంది. తూర్పు తీరం వెంబడి 2,562 కిలోమీటర్ల విస్తీర్ణంలో స్థావరాల్ని ఏర్పాటు చేసిన ఈఎన్‌సీ.. ఇప్పుడు యుద్ధ విమానాలకు సంబంధించి సరికొత్త వ్యవస్థను తనలో ఇముడ్చుకోనుంది.
యుద్ధ విమానాల ‘లాజిస్టిక్స్’ హబ్
ఐఎన్‌ఎస్ డేగాలో ఉన్న మెటీరియల్ ఆర్గనైజేషన్ (విశాఖపట్నం)కి ఆనుకుని చేపట్టిన ఈ ప్రాజెక్ట్ కేవలం భవన నిర్మాణం కాదు.., ఇదొక టెక్నాలజీ హబ్‌గా చెప్పుకోవచ్చు. యుద్ధం జరిగేటప్పుడు ఆయుధం ఎంత ముఖ్యమో, దానికి సప్లై చైన్ కూడా అంతే ముఖ్యం.
నౌకాదళం తన అమ్ములపొదిలో ఉన్న అత్యాధునిక యుద్ధ విమానాలు, గస్తీ విమానాలు, హెలికాప్టర్లను సమర్థవంతంగా నిర్వహించడంతోపాటు వాటికి అవసరమైన విడిభాగాలను ఆటోమేటెడ్ గిడ్డంగులు, అధునాతన ట్రాకింగ్ సిస్టమ్స్‌తో నిల్వ చేయడం, అత్యవసర సమయాల్లో తక్షణమే ఫ్రంట్‌లైన్‌కు పంపించడం ముఖ్యం. మెటీరియల్ ఆర్గనైజేషన్ పరిధిలో నిర్మిస్తున్న ఈ ‘ఏవియేషన్ లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ కీలకంగా మారనుందని నౌకాదళ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కీలక విమానాల నిర్వహణకు బలం
అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి రానున్న ఈ సరికొత్త ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రధానంగా మూడు రకాల కీలక వైమానిక దళాలకు ఊపిరిపోయనుంది. విమానవాహక నౌకల నుంచి నిప్పులు కురిపించే మిగ్ – 29కే యుద్ధ విమానాల స్క్వాడ్రన్‌ను తూర్పు తీరంలో మోహరించడానికి ఈ సదుపాయాలు అత్యంత కీలకంగా మారనున్నాయి.
అదేవిధంగా సముద్ర గర్భంలో దాగి ఉన్న శత్రు జలాంతర్గాములను వేటాడే ‘హంటర్’ విమానాలుగా పిలిచే పీ – 8ఐ నిర్వహణకు ప్రధాన స్థావరంగా మారబోతోంది. దీంతోపాటుగా రాత్రి, పగలు తేడా లేకుండా సముద్రంలో గస్తీ నిర్వహిస్తూ గగనతల రోమియోలుగా పిలిచే ఎంహెచ్ – 60ఆర్ సీహాక్ హెలికాఫ్టర్ల నిర్వహణకు అవసరమైన హ్యాంగర్లు ఇక్కడకు రాబోతున్నాయి.
డ్రాగన్‌పై పైచేయి సాధించేలా...
హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా నౌకాదళ కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ వ్యూహాత్మకంగా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఐఎన్‌ఎస్ విక్రాంత్ వంటి యుద్ధ విమాన వాహక నౌకలు తూర్పు తీరంలో మోహరించినప్పుడు, వాటికి అవసరమైన పూర్తి స్థాయి వైమానిక మద్దతును విశాఖ నుంచే అందించేలా ఈ ప్రణాళిక రూపొందించారు. పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ రంగాన్ని బలోపేతం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి ఈ ప్రాజెక్ట్ అద్దం పడుతోంది.
విదేశాలపై ఆధారపడకుండా, మన విమానాలకు మనమే మరమ్మతులు చేసుకునేలా, ఆధునికీకరించుకునేలా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు శంకుస్థాపనతో తూర్పు నౌకాదళం కేవలం సముద్రం మీదే కాకుండా గగనతలంలోనూ తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి సిద్ధమైందని నౌకాదళ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. విశాఖపట్నం ఇప్పుడు కేవలం నౌకాదళ కేంద్రమే కాకుండా దక్షిణాసియాలోనే అత్యంత కీలకమైన వైమానిక రక్షణ కేంద్రంగా అవతరించనుంది.


