నావికా దళంలోకి మూడో స్వదేశీ అణు జలాంతర్గామి
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతూనే ఉంది
నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి వెల్లడి
న్యూఢిల్లీ: భారత నావికా దళం నానాటికీ బలోపేతం అవుతున్నట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె.త్రిపాఠి చెప్పారు. అణు శక్తిని సముపార్జించుకుంటూ తిరుగులేని దళంగా మారుతోందని వెల్లడించింది. దేశంలో మూడో స్వదేశీ అణు జలాంతర్గామి ‘ఐఎన్‌ఎస్ అరిదమన్’ త్వరలో నావికా దళంలో లాంఛనంగా చేరనుందని ప్రకటించారు. ఈ నెల 4వ తేదీన ‘నేవీ డే’ను నిర్వహించుకోనున్న నేపథ్యంలో దినేశ్ త్రిపాఠి మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇండియన్ నేవీని అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.
ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దీటుగా తిప్పికొట్టగల సామర్థ్యం మనకు ఉందన్నారు. ప్రాజెక్టు 75 ఇండియా(పీ75–ఐ)లో భాగంగా ఆరు స్టీల్త్ సబ్‌మెరైన్లను సమకూర్చుకొనే ప్రక్రియ దాదాపు ముగింపు దశకు వచ్చిందని వెల్లడించారు. ఫ్రాన్స్ నుంచి 26 రఫేల్–ఎం యుద్ధవిమానాలు కొనుగోలు చేస్తున్నామని, ఇందులో మొదటి నాలుగు విమానాలు 2028లో మనదేశానికి రాబోతున్నాయని చెప్పారు.
పాకిస్తాన్‌కు భారీగా ఆర్థిక నష్టం
ఆపరేషన్ సిందూర్‌లో భారత నావికా దళం కీలక పాత్ర పోషించిందని దినేశ్ కె.త్రిపాఠి గుర్తు చేశారు. మనం దూకుడుగా ముందుకెళ్లడంతో పాకిస్తాన్ నావికా దళానికి దిక్కుతోచలేదని, దాడులు జరుగుతాయన్న భయంతో అక్కడ వెంటనే ఓడరేవులను మూసివేశారని వెల్లడించారు. పశి్చమ అరేబియా సముద్రంలో ఎలాంటి ఆపరేషన్లకైనా సర్వసన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అక్కడ భారత్, పాకిస్తాన్ మధ్య గత ఎనిమిది నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఆపరేషన్ సిందూర్ ఆగలేదని, ఇంకా కొనసాగుతూనే ఉందని ఆయన తేల్చిచెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం బయటపెట్టలేదు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్‌కు ఆర్థికంగా భారీ నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. విదేశీ వాణిజ్య నౌకలు పాకిస్తాన్‌కు వెళ్లడానికి వెనుకంజ వేస్తున్నాయని తెలిపారు. పాకిస్తాన్‌కు వెళ్లే నౌకల బీమా వ్యయం విపరీతంగా పెరిగిందన్నారు.
సముద్ర గర్భం నుంచి అణ్వాయుధాల ప్రయోగం
అణుశక్తి సంపన్న బాలిస్టిక్ మిస్సైల్ సబ్‌మెరైన్(ఎస్‌ఎస్‌బీఎన్) కార్యక్రమానికి భారత ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో ఐఎన్‌ఎస్ అరిహంత్, ఐఎన్‌ఎస్ అరిఘాత్ జలాంతర్గాములను అభివృద్ధి చేశారు. నావికా దళంలో ప్రవేశపెట్టారు. మూడో జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిదమన్ ట్రయల్స్ దాదాపు పూర్తయ్యాయి.
భూఉపరితలం, ఆకాశం నుంచి అణ్వాయుధాలను ప్రయోగించే శక్తిసామర్థ్యాలను భారత్ ఇప్పటికే సొంతం చేసుకుంది. సముద్ర గర్భం నుంచి ప్రయోగించడంపై దృష్టి పెట్టింది. అణు జలాంతర్గాములు అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా, భారత్ వంటి కొన్నిదేశాల వద్ద మాత్రమే ఉన్నాయి.
⇒ ఐఎన్‌ఎస్ అరిదమన్ జలాంతర్గామిని విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్‌లో నిర్మించారు. వచ్చే ఏడాది జనవరిలో నావికాదళంలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సబ్‌మెరైన్ పొడవు 112 మీటర్లు, వెడల్పు 15 మీటర్లు, ఎత్తు 10 మీటర్లు.
⇒ లాంగ్ రేంజ్ కె–4 క్షిపణులను మోసుకెళ్లగలదు.
⇒ ఇందులో అత్యాధునిక అండర్ వాటర్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంటుంది.
⇒ ఎనిమిది వరి్టకల్ లాంచ్ సిస్టమ్ ట్యూబ్స్ ఉంటాయి. 3,500 కిలోమీటర్ల దూరం వరకు క్షిపణులను ప్రయోగించవచ్చు.
⇒ 83 ఎండబ్ల్యూ కాంపాక్ట్ లైట్ వాటర్ రియాక్టర్‌తో తనకు అవసరమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటుంది.
⇒ గంటకు 44 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.


