ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ అరుదైన రికార్డు | INS Vikrant sets a rare record | Sakshi
Sakshi News home page

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ అరుదైన రికార్డు

Mar 4 2026 6:09 AM | Updated on Mar 4 2026 6:09 AM

INS Vikrant sets a rare record

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌పై ల్యాండ్‌ అయిన యుద్ధ విమానం

1,000వ సురక్షిత ల్యాండింగ్‌ పూర్తి 

సంబరాలు నిర్వహించిన విక్రాంత్‌ బృందం

సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ మరో చరిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. సముద్ర గర్భంలో నిరంతర కార్యకలాపాలు సాగిస్తూ, అత్యంత క్లిష్టమైన 1,000వ ‘అరెస్టెడ్‌ ల్యాండింగ్‌’ని విజయవంతంగా పూర్తి చేసి తన యుద్ధ సన్నద్ధతను చాటుకుంది. తెల్లవారుజామున విమానాల ల్యాండింగ్‌ ప్రయోగం మొదలుకొని, అర్ధరాత్రి వేళ రికవరీల వరకు విక్రాంత్‌ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మిగ్‌–29తో పాటు ఇతర యుద్ధ విమానాలు ఇప్పటివరకూ 1,000 సార్లు విజయవంతమైన సురక్షితమైన ల్యాండింగ్‌లు పూర్తి చేసుకున్నాయి. 

ఇటీవల విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ, మిలాన్‌–2026లో పాల్గొని ఈ విన్యాసాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అనంతరం..విశాఖ నుంచి పశ్చిమ నౌకాదళ ప్రధాన కేంద్రం ముంబైకి తిరుగు పయనమైంది. ఈ నేపథ్యంలోనే 1,000 ల్యాండింగ్స్‌ పూర్తి చేసుకున్న సందర్భంగా..వెస్ట్రన్‌ ఫ్లీట్‌ ఫ్లాగ్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ రియర్‌ అడ్మిరల్‌ వివేక్‌ దహియా టీమ్‌ విక్రాంత్‌ను, ఎంబార్క్‌డ్‌ స్క్వాడ్రన్‌ని అభినందించారు. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్యారియర్‌లో ఈ విజయం సందర్భంగా సిబ్బంది సంబరాలు నిర్వహించారు.   

Advertisement
 
Advertisement
Advertisement