మీరు కారు గానీ బైక్ కొనుగోలు చేయడానికి ఏదైనా సంస్థ నుంచి లోన్ తీసుకున్నారా? ఏదైనా కారణాలతో లోన్ కట్టకుండా పెండింగ్‌లో ఉంచారా?. అయితే ఫేక్ లోన్ రికవరీ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీ వాహనం యెుక్క లోన్ బకాయిలు చెల్లించాలంటూ వారు మిమ్మల్ని బుట్టలో వేయవచ్చు. ఎంత కొంత చెల్లించకుంటే వాహనాన్ని సీజ్ చేస్తామని బెదిరిస్తూ అందిన కాడికి దోచుకోని వారు పరారయ్యే అవకాశమూ ఉంది.
ప్రస్తుత 5జీ కాలంలో టెక్నాలజీతో పాటు మోసాలు అదే విధంగా అప్‌డేట్ అవుతున్నాయి. సైబర్ అటాక్‌లతో అకౌంట్లలో డబ్బును రాత్రికి రాత్రి మాయం చేసేవారు కొందరైతే దొంగతెలివిని ఉపయోగించి ప్రజలను మోసం చేసేవారు మరికొందరు. ఇటీవల కాలంలో కొత్తరకం మోసగాళ్లు పుట్టుకొచ్చారు. ఫైనాన్స్ కంపెనీలలో పెండింగ్ బకాయిలు ఉన్న వారే టార్గెట్‌గా వీరు వల పనుతున్నారు. వివిధ రకాల ఫైనాన్స్ కంపెనీలలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వాహనాల వివరాలు వీరు సేకరిస్తున్నారు. ఆ వాహనానికి లోన్ ఏ కంపెనీ నుంచి తీసుకున్నారో ఆ కంపెనీ ఏజెంట్లుగా నటిస్తూ లోన్ తీసుకున్నవారిని బెదిరిస్తున్నారు. అందినకాడికి డబ్బులు చేతపట్టుకొని అక్కడి నుంచి ఊడాయిస్తున్నారు.
తాజాగా ఇటువంటి ఘటన కర్ణాటకలో జరిగింది. అక్కడి పర్యాటక ప్రాంతమైన కూర్గ్ నుంచి ఒక వ్యక్తి తిరిగివస్తూ ఉండగా ముగ్గురు వ్యక్తులు తనని వెంబడించారని తెలిపారు. ఒక కారు డ్రైవ్ చేస్తూ ఉండగా ఒక వ్యక్తి కారు డోర్ కొట్టారని ఏంటని ప్రశ్నించగా ఈ కార్ లోన్ పెండింగ్‌లో ఉంది. దీని డబ్బుులు కట్టాలని అడిగారన్నారు. అయితే కారుకు సంబంధించిన డ్యాకుమెంట్స్ అన్ని క్లియర్‌గా ఉండడంతో ఇది మోసం అని తాను గ్రహించానని వెంటనే అక్కడి నుంచి ఊడాయించానని అన్నారు. ఆ వ్యక్తికి ఏదురైన భయానక అనుభూతిపై రెడ్డిట్‌లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌పై నెటిజన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు.
అయితే ఇటువంటి ఘటనలు ఈ మధ్యన తరచుగా జరుగుతున్నాయి. ఒకవేళ మిమ్మల్ని కూడా ఎవరైనా పెండింగ్ బకాయిలు ఉన్నాయని ఆపితే వారు సంబంధింత ఫైనాన్స్ కంపెనీకి చెందిన వారా కాదా అని నిర్ధారించుకొండి. మీరు ఏ ఫైనాన్స్ కంపెనీలో లోన్ తీసుకున్నారో ఆ సంస్థకు ఫోన్ చేసి వివరాలు నిజ నిర్ధారణ చేసుకొండి. దాని తరువాతే వారికే డబ్బులు చెల్లించడమో లేదా వాహనాన్ని ఇవ్వడమో చేయండి. నకీలీ ఏజెంట్లకు కంపెనీల ఐడీ కార్డులు సృష్టించడం ఏమాత్రం పెద్ద విషయం కాదు కనుక ఐడీకార్డులను చూసి వారికి డబ్బులు చెల్లించి వారి వలలో పడొద్దు.


