వడ్డీ ఎంత అన్నది. కరెక్టేనా? ఊహూ కాదంటోంది పైసాబజార్. పండుగ రుణాలు తీసుకునేటప్పుడు మనోళ్లు.. అంటే దక్షిణాది రాష్ట్రాల వాళ్లు వడ్డీ రేట్ల కంటే.. ఎంత వేగంగా రుణం వస్తుంది? డిజిటల్ సౌకర్యం ఉందా? లేదా? అన్నదానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారట. ఇదేమీ ఒట్టి మాటేమీ కాదండోయ్. సర్వే చేసి మరీ నిర్ణయించామని చెబుతోంది ఆ సంస్థ. వివరాలు ఇలా ఉన్నాయి..
ఈ రోజుల్లో అప్పు చేయకుండా ఉండటం అన్నది చాలామందికి అసాధ్యం. పండగ షాపింగ్ కావచ్చు. ఇంట్లో చిన్న చిన్న మరమ్మతులు కావచ్చు.. అన్ని సందర్భాల్లోనూ మన సేవింగ్స్ మాత్రమే అక్కరకు రావు. చేబదులు లేదా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లో రుణాలు తీసుకోక తప్పని పరిస్థితి. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళల్లో అప్పుకు ఈ మూడే ప్రధాన కారణాలని పైసాబజార్ సర్వే చెబుతోంది. సర్వే చేసిన వారిలో సుమారు 33 శాతం మంది రూ.మూడు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకూ అప్పు చేశారని, వీరు వడ్డీ రేట్ల కంటే డిజిటల్ ఎక్స్‌పీరియన్స్, ప్రాసెస్ వేగాలను ఆధారంగా చేసుకుని ఏ సంస్థ నుంచి రుణం తీసుకోవాలో నిర్ణయించుకుంటున్నారని ఈ సర్వే ద్వారా తెలిసింది.
దక్షిణాది రాష్ట్రాల్లోని సుమారు 18 పట్టణాల్లో 1700 మందిని ప్రశ్నించి సిద్ధం చేశారీ సర్వేను. అడక్కుండానే మన ఆర్థిక స్థితిగతులు, పరపతులకు తగ్గట్టుగా లభించే ప్రీఅప్రూవ్డ్, ఇన్‌స్టంట్ లోన్లు మేలని సర్వే చేసిన వారిలో 41 శాతం మంది అభిప్రాయపడ్డారు. లోన్ ప్రాసెస్ మొత్తం చిట్టీలు, అకౌంట్ పుస్తకాల్లో కాకుండా డిజిటల్ పద్ధతిలో ఉంటే ఇష్టమని 24 శాతం చెబితే.. కేవలం 20 శాతం మంది మాత్రమే వడ్డీ రేట్లు ఎక్కువ తక్కువ ఉంటే అక్కడ రుణాలు తీసుకునేందుకు ఇష్టపడతామని చెప్పడం గమనార్హం. ఇంకో విషయం సర్వే చేసిన వాళ్లలో ఏకంగా 80 శాతం మంది మొత్తం ప్రాసెస్‌ను పద్ధతిగా వివరించే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై రుణం తీసుకునేందుకు మక్కువ చూపారు.
అవసరం ఏమిటి? మొత్తం ఎంత?
ముందుగా చెప్పుకున్నట్లు అత్యధిక శాతం మంది.. స్పష్టంగా చెప్పాలంటే 39 శాతం మంది హోమ్ రెనవేషన్ కోసమే అప్పు చేస్తున్నట్లు ఈ సర్వే ద్వారా స్పష్టమైంది. రుణాల సర్దుబాటు కోసం కొత్త రుణం చేస్తున్న వారు 27 శాతం మంది ఉంటే.. పండుగ షాపింగ్, పెట్టుపోతల వంటి వాటి కోసం అప్పు చేస్తున్న వారు 14 శాతం మంది. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, బంగారం కొనుగోళ్లకు అప్పులు చేస్తున్న వాళ్లు వరుసగా 12 శాతం, 10 శాతం ఉన్నట్లు స్పష్టమైంది.
సుమారు 35 శాతం మంది మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకూ అప్పు చేస్తుంటే.. 22 శాతం మంది తాలూకూ మొత్తాలు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకూ మాత్రమే ఉన్నట్లు ఈ సర్వేలో తెలిసింది. కేవలం 14 శాతం మంది మాత్రమే పది లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం అప్పు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం సమాజంలో చాలామంది కేవలం అత్యవసరాల కోసం మాత్రమే కాకుండా.. లైఫ్‌స్టైల్ కోసం, ఆశలు నెరవేర్చుకునేందుకు కూడా అప్పులు చేస్తున్నారని ఈ సర్వే నిర్వహించిన పైసా బజార్ సీఈవో సంతోశ్ అగర్వాల్ తెలిపారు. రుణ వ్యవస్థ మెరుగైన పనితీరుకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు.


