ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ నుంచి తీసుకునే ఈ రుణానికి సర్కారు గ్యారెంటీ
ఈ మొత్తంపై రెండు శాతం గ్యారెంటీ కమీషన్ సీఆర్‌డీఏ చెల్లించాలి
మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ
దీంతో రాజధాని అప్పులు రూ.40,000 కోట్లకు చేరిక
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి కోసం చంద్రబాబు ప్రభుత్వం మరో రూ.7,500 కోట్ల అప్పు చేస్తోంది. నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ (ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ) నుంచి సీఆర్‌డీఏ తీసుకునే ఈ అప్పునకు రాష్ట్ర ప్రభుత్వం అసలుకు, వడ్డీకి గ్యారెంటీ ఇచ్చింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. రుణ సంస్థకు ఈ మొత్తం చెల్లించడంలో సీఆర్‌డీఏ విఫలమైన పక్షంలో ప్రభుత్వ హామీ అమలులోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ మేరకు రుణ ఒప్పందంపై ఆర్థికశాఖ అధికారి సంతకం చేయనున్నారు. సీఆర్‌డీఏ తన సొంత వనరుల నుంచి రుణసేవలకు బాధ్యత వహిస్తుందని అందులో పేర్కొన్నారు. హామీ ఇచ్చిన మొత్తంపై రెండు శాతం గ్యారెంటీ కమీషన్ సీఆర్‌డీఏ చెల్లించాలని స్పష్టంచేశారు. దీంతో.. రాజధాని కోసం ఇప్పటివరకు చేసిన అప్పులు రూ.40,000 కోట్లకు చేరాయి.
సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి...
రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని సీఎం చంద్రబాబు అనేక సందర్భాల్లో చెప్పారు. అయితే, అందుకు భిన్నంగా భారీగా అప్పులు తెస్తున్నారు. బడ్జెట్ నుంచి నిధులు విడుదల చేస్తున్నారు. అప్పులు తెస్తూ బడ్జెట్ నుంచి నిధులు విడుదల చేస్తున్నప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు ఎలాగవుతుందో ముఖ్యమంత్రికే తెలియాలని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఇప్పటి వరకు రాజధాని కోసం ఏ సంస్థ నుంచి ఎంత అప్పు‡అంటే... (రూ.కోట్లలో..)
⇒ ప్రపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు 15,000
⇒ హడ్కో 11,000 ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ 7,500
⇒ జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ 5,000
⇒ ఏపీపీఎఫ్‌సీఎల్ 1,500
⇒ మొత్తం 40,000
మంగళవారం మళ్లీ బాబు సర్కారు అప్పు
రూ.3,000 కోట్ల రుణాన్ని నోటిఫై చేసిన ఆర్‌బీఐ
సాక్షి, అమరావతి: వచ్చే మంగళవారం చంద్రబాబు సర్కారు మళ్లీ బడ్జెట్ పరిధిలో అప్పు చేస్తోంది. రూ.3,000 కోట్లు అప్పు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ మొత్తం రుణాన్ని ఆర్‌బీఐ సమీకరించి ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్‌బీఐ శుక్రవారం నోటిఫై చేసింది.


