సాక్షి, విజయవాడ: అమరావతి కోసం మళ్ళీ భూ సేకరణ చేపట్టాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. రెండో విడత ల్యాండ్ పూలింగ్ కోసం శుక్రవారం జరిగిన కేబినెట్ ఆమోదం తెలిపింది. మొదటి దశలో రైతుల నుంచి 50 వేల ఎకరాల సమీకరణ చేపట్టగా.. ఇప్పుడు రెండో దశలో మరో 20 వేల ఎకరాలపై కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది.
అమరావతి కోసం రైతుల నుంచి 50వేల ఎకరాల భూమి సేకరణ చేపట్టింది. మొదటి దశలో ప్రభుత్వ భూమి 16వేల ఎకరాలను సీఆర్డీఏకు అప్పగించింది. ఇప్పుడు రెండో విడత సమీకరణకు సంబంధించి 7 గ్రామాల్లో భూ సేకరణ చేపట్టనుంది.
వైకుంఠపురంలో 3,361 ఎకరాలు, పెదమద్దూరులో 1,145 ఎకరాలు, ఎండ్రాయి 2,166 ఎకరాలు, కర్లపూడిలో 2,944 ఎకరాలు, వడ్డమానులో 1,913 ఎకరాలు, హరిశ్చంద్రపురంలో 2,418 ఎకరాలు, పెదపరిమిలో 6,513 ఎకరాలను సేకరించనుంది. అసైన్డ్ ప్రభుత్వ భూములతో కలిపి మొత్తం 20,494 ఎకరాల భూ సేకరణ ద్వారా సీఆర్డీఏ తీసుకోనుంది. ఈ మేరకు త్వరలో ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్‌ను సీఆర్‌డీఏ విడుదల చేయనుంది.


