కృష్ణలంక(విజయవాడతూర్పు): వారిద్దరు మైనర్లు. ఒకే పాఠశాలలో బాలిక తొమ్మిదో తరగతి, బాలుడు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. ప్రేమ అనే ఆకర్షణకు లోనైన ఆ ఇద్దరు కలసి కనిపించకుండా వెళ్లిపోయిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. రాణిగారితోట, సిద్దెం కృష్ణారెడ్డి రోడ్డులోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో యూపీ కుటుంబానికి చెందిన బాలిక తొమ్మిదో తరగతి, రాణిగారితోటకు చెందిన బాలుడు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. బుధవారం బాలుడి పుట్టినరోజు కావడంతో స్కూల్‌కు వెళ్లనని ఇంటిలో చెప్పి తండ్రి ఫోన్ తీసుకుని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. స్కూల్‌కు వెళ్లి వస్తానని తల్లిదండ్రులకు చెప్పిన బాలిక ఇంటి నుంచి బయలుదేరి స్కూల్‌కు వెళ్లకపోగా తిరిగి ఇంటికి చేరుకోలేదు.
వారి తల్లిదండ్రులు స్కూల్ సిబ్బందిని, చుట్టు పక్కల, బంధువులను విచారించినా ఆచూకీ లభించలేదు. వెంటనే పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తమ పిల్లలు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా ఇద్దరు కలిసి బస్టాండ్‌కు చేరుకుని హైదరాబాద్ బస్సు ఎక్కినట్లు గుర్తించారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నట్లు నిర్ధారించుకున్న సీఐ నాగరాజు తన సిబ్బంది అక్కడకు పంపి మైనర్లను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వారివారి తల్లిదండ్రులకు అప్పగించారు.


