167 మొబైల్ ఫోన్లు రికవరీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పోయిన 167 మొబైల్ ఫోన్‌లను సైబర్ క్రైమ్ పోలీసులు రికవరీ చేశారు. వాటిని పోగొట్టుకున్న వారికి పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు ఆదేశాల మేరకు గురువారం సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణ ప్రసన్న తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణప్రసన్న మాట్లా డుతూ.. మొబైల్ ఫోన్ పోయినట్లు తమకు అందిన ఫిర్యాదుల మేరకు మొబైల్ సెంట్రల్ ఎక్యుప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) సేవల ద్వారా రికవరీ చేసి బాధితులకు తిరిగి అందజేశామని తెలిపారు. ఇప్పటి వరకూ 2,467 ఫోన్‌లను రికవరీ చేసి బాధితులకు అప్పగించామని పేర్కొన్నారు. ఫోన్‌లు తీసుకునేందుకు వచ్చిన వారికి పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఏసీపీ బి.రాజశేఖర్, ఇన్‌స్పెక్టర్లు గుణరామ్, దుర్గాప్రసాద్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
రామవరప్పాడు: కృష్ణలంక పోస్ట్ ఆఫీస్‌లో సబ్ పోస్ట్‌మాస్టర్‌గా పని చేసిన నెమలికంటి మనోజ్ కుమార్ నివాసాన్ని గురువారం ప్రసాదంపాడులో పోస్టల్ డిమార్ట్‌మెంట్ అధికారులు జప్తు (సీజ్) చేశారు. మనోజ్‌కుమార్ విధులను దుర్వినియోగం చేసి సుమారు రూ.1.31 కోట్లు గోల్‌మాల్ చేశారు. పోస్టల్ డిపార్ట్‌మెంట్ సూపరింటెండెంట్ ఎం.నరసింహ స్వామి నేతృత్వంలో పోస్టల్ అధికారులు, ఏఎస్పీలు అలీ, దేవానంద్, పీఆర్‌ఐపీలు ఎం.వెంక టేశ్వరరావు, శ్రీనివాసరెడ్డితో కూడిన బృందం గ్రామ రెవెన్యూ అధికారి, పోలీసుల సహకారంతో ఇంటికి సీల్ వేశారు. ప్రసాదంపాడులోని వెంటేశ్వర నిలయం అపార్టుమెంట్‌లో ఫస్ట్ ఫ్లోర్‌లోని ఎఫ్‌ఎఫ్–1 ఫ్లాట్‌కు తాళాలు వేసి సీల్ వేశారు. 2022లో కృష్ణలంక పోస్ట్ ఆఫీస్‌లో నెమలికంటి మనోజ్‌కుమార్ సబ్ పోస్ట్‌మాస్టర్‌గా విధులు నిర్వహించారు. ఆ సమయంలో ఖాతాదారులకు చెందిన సుమారు రూ.1.31 కోట్లను దారి మళ్లించి దుర్వినియోగం చేశారు. అప్పట్లో ఈ ఘటన వెలుగు చూడటంతో విచారణ చేసిన అధికారులు మనోజ్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. తదుపరి చర్యల్లో భాగంగా ప్రసాదంపాడులోని ఆయన నివాసాన్ని జప్తు చేసి పోస్టల్ డిపార్టుమెంట్‌కు అటాచ్ చేశారు. ఈ సందర్భంగా పోస్టల్ సూపరింటెండెంట్ నరసింహ స్వామి మాట్లాడుతూ.. మనోజ్‌కుమార్ రూ.1.31 కోట్లు గోల్‌మాల్ చేసిన కేసులో కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం అతని నివాసాన్ని జప్తు చేశామన్నారు. అతనిపై సీబీఐ కేసు కూడా నడుస్తోందని తెలిపారు. అతనికి ఇబ్రహీంపట్నంలో కూడా ఆస్తి ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. జప్తు చేసిన నివాసాన్ని త్వరలో వేలం వేస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఆర్‌ఆర్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం ఇదే ప్రథమమని తెలిపారు.
167 మొబైల్ ఫోన్లు రికవరీ


