7 సహాయ ఓటరు నమోదు అధికారుల పోస్టులు ఖాళీ
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో ఏడు సహాయ ఓటరు నమోదు అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని త్వరలో భర్తీ చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డి.కె.బాలాజీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి తెలిపారు. గురువారం ఉదయం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులయిన కలెక్టర్లతో ఎన్నికల అంశా లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాల వారీగా పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి మాట్లాడుతూ.. జిల్లాలో ఏడు సహాయ ఓటరు నమోదు అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. పెడన, మోపిదేవి, బంటుమిల్లి, కృత్తివెన్ను, కోడూరు, గుడివాడ, గుడ్లవల్లేరు మండలాలకు తహసిల్దార్లు లేరన్నారు. కోర్టు తీర్పు వచ్చిందని త్వరలో వాటిని భర్తీ చేస్తామన్నారు. జిల్లాలో నాలుగు రెవెన్యూయేతర ఓటరు నమోదు అధికారులు (ఈఆర్వోలు) ఉన్నందున వారి స్థానంలో డెప్యూటీ కలెక్టర్ల పేర్లతో ప్రతిపాదనలు పంపించామని, వాటిని ఆమోదించాలని కోరారు. జిల్లాలో 73 కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉందని, వాటికి బూత్ స్థాయి అధికారులను కూడా గుర్తించామన్నారు. ఓటర్ల జాబితా మ్యాపింగు, ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై ఈఆర్వోలకు, ఏఈఆర్వోలకు ఎన్నికల ఉప తహసీల్దారులకు, సీనియర్ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా 15.45 లక్షలకు 6.42 లక్షల ఓటర్ల మ్యాపింగ్‌తో 42 శాతం పూర్తిచేశామన్నారు. జిల్లాకు అందిన 1769 బూత్ స్థాయి అధికా రుల గుర్తింపు కార్డులను పంపిణీ చేశామన్నారు. జిల్లాలో కేవలం ఒక క్లెయిమ్ ఫారం అపరిష్కృతంగా ఉందని దానిని త్వరలో పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో 18,136 ఎపిక్ కార్డులందగా అందులో ఇప్పటికే 15,849 కార్డులను ఓటర్లకు పంపిణీ చేశామని వివరించారు. మిగిలినవి త్వరలో పంపిణీ చేస్తామన్నారు. బుక్ ఏ కాల్ విత్ బీఎల్‌ఓ కార్యక్రమానికి సంబంధించి 135 అభ్యర్థనలు రాగా అన్ని పరిష్కరించామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌ఓ కె.చంద్రశేఖరరావు, మచిలీపట్నం ఆర్డీఓ స్వాతి, డీఎస్‌ఓ మోహన్ బాబు తదితర అధికారులు పాల్గొన్నారు.


