అయ్యప్ప దీక్షలో ఉన్న బాలికను కొట్టిన టీచర్
ఇబ్రహీంపట్నం: అయ్యప్ప దీక్ష తీసుకున్న ఓ బాలికను ‘ఈ వయసులో నీకు పూజలెందుకు’ అంటూ ఓ టీచర్ చితకబాదింది. ఈ ఘటన ఇబ్రహీంపట్నంలోని గుంటూరు ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌లో గురువారం జరిగింది. కంచికచర్ల మండలానికి చెందిన దంపతులు ఇబ్రహీంపట్నంలో అద్దె ఇంట్లో ఉంటూ తమ ఇద్దరు కుమార్తెలను గుంటూరు ఆక్స్‌ఫర్డ్ స్కూల్లో చదివిస్తున్నారు. మూడో తరగతి చదువుతున్న చిన్న కుమార్తె ఇటీవల అయ్యప్ప మాల ధరించింది. రోజూ దీక్ష దుస్తుల్లో స్కూలుకు రావడం ఇష్టలేని ఇన్‌చార్జ్ టీచర్ రేవతి ఆ బాలికను వారిస్తూ వస్తోంది. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుత్ను బాలిక గురువారం తరగతి గదిలో నిద్రపోయింది. దీనిని గమనించిన రేవతి ఈ వయస్సులో పూజలెందుకు? రాత్రులు నిద్ర లేకుండా తరగతిలో నిద్రపోవడం ఎందుకు? అంటూ ఆగ్రహించింది. ఫ్లోరింగ్ ఊడ్చే మాప్ కర్రతో ఇష్టానుసారంగా బాలికను కొట్టింది. చేతులు, కాళ్లు, వీపు, నడుంపై ఎర్రగా కందిపోవడంతో బాలిక భోరున ఏడ్చింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వచ్చి ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించారు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు. పోలీసులు వెంటనే పాఠశాల వద్దకు వచ్చారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటానని ప్రిన్సిపాల్ హామీ ఇవ్వడంతో విద్యార్థిని తల్లిదండ్రులు కేసు పెట్టకుండా వదిలేశారు.
టీచర్ కొట్టిన దెబ్బలతో బాలిక శరీరంపై ఏర్పడిన గాయాలు
అయ్యప్ప దీక్షలో ఉన్న బాలికను కొట్టిన టీచర్


