తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారి క్షేమం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): మహంతీపురం పరిధిలో గురువారం నాలుగేళ్ల చిన్నారి తప్పి పోవడంతో తల్లిదండ్రులు కొత్తపేట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సకాలంలో స్పందించిన స్థానికుల సహకారంతో బాలుడిని గుర్తించి తల్లికి అప్పగించారు. ఏలూరు జిల్లా పాతూరు గ్రామానికి చెందిన నాగుల్‌మీరా, మీరాబీ దంపతుల కుటుంబం మహంతీపురంలోని ఓ వివాహానికి హాజరైంది. ఇంట్లో అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న తరుణంలో నాగుల్‌మీరా కుమారుడు నాలుగేళ్ల జాహిద్ ఆడుకుంటూ రోడ్డుపైకి వచ్చి తప్పిపోయాడు. కొంత సేపటి తరువాత జాహిద్ కనిపించడం లేదని గుర్తించిన తల్లిదండ్రులు, బంధువులు కంగారు పడుతూ చుట్టు పక్కల వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. అనంతరం కొత్తపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాలుడి కోసం గాలింపు చేపట్టారు. ఇంతలో స్థాని కులు రోడ్డుపై బాలుడు ఏడుస్తూ వెళ్లడాన్ని గమనించారు. అదే సమయంలో బాలుడి కోసం గాలిస్తున్న పోలీసులు బాలుడిని గుర్తించి తల్లికి అప్పగించారు.
కూచిపూడి(మొవ్వ): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కూచిపూడి శ్రీ సిద్ధేంద్ర యోగి నాట్య కళా పీఠంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి నాట్యంలో ప్రవేశాల ఇంటర్వ్యూలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 20వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. 133 మంది ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకున్నారని కళాపీఠం వైస్ ప్రిన్స్‌పాల్ డాక్టర్ చింతా రవిబాలకృష్ణ తెలిపారు. సర్టిఫికెట్ కోర్సుకు 47, డిప్లొమా 30, యక్షగానం 18, సాత్విక అభినయం 10, మాస్టర్ ఆఫ్ ఫెర్ఫార్మింగ్ ఆర్ట్స్(ఎంపీఏ)కు 28 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. సాత్విక అభినయం, యక్షగానం, ఎంపీఏకోర్సులకు సంబం ధించి అభ్యర్థుల దరఖాస్తులు పరిశీలన, ఇంటర్వ్యూలను గురువారం కళాపీఠంలో నిర్వహించారు. వైస్ ప్రిన్సిపాల్‌తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏలేశ్వరపు శ్రీనివాసులు, పసుమర్తి హరినాథశాస్త్రి పాల్గొన్నారు.
మచిలీపట్నంటౌన్: ఏదో విధంగా ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే దిశగా చంద్రబాబు ప్రభుత్వం పావులు కదుపుతోంది. ప్లానుకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను అపరాధ రుసుం చెల్లించి క్రమబద్ధీకరించుకునేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్) అమలుకు 225 జీఓ విడుదల చేసింది. ఈ జీఓ ప్రకారం మచిలీపట్నం నగర పాలక సంస్థ పరిధిలో అనధికారికంగా, తీసుకున్న ప్లానుకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించుకోవచ్చు. 1985 నుంచి 2025 ఆగస్టు 31వ తేదీ లోపు నిర్మించిన భవనాలకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ నెల 12వ తేదీ నుంచి 120 రోజుల్లోపుగా అనధికార భవనాలు కలిగిన యజమానులు ఆన్‌లైన్‌లో రూ.10 వేల ప్రాథమిక ఫీజును చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఈ జీఓ ప్రకారం అనధికార భవనాలకు చట్టబద్ధత రావడంతో పాటు బ్యాంకు లోన్లు పొందే వీలు ఉంటుందని, అపరాధ రుసుం, భవన కూల్చివేత, కోర్టు కేసులు వంటివి లేకుండా రక్షణ కలుగుతుందని పేర్కొంది. అనధికారిక లే అవుట్ల క్రమబద్ధీకరణ స్కీం కూడా ప్రస్తుతం అమల్లోనే ఉంది. నగర ప్రజలు బీపీఎస్ ఎల్‌ఆర్‌ఎస్‌లను సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులు సూచిస్తున్నారు.
తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారి క్షేమం


