ప్రకాశం జిల్లా: మండలంలోని కొలుకుల గ్రామంలో ఒక సామాజిక వర్గానికి చెందిన వారు వింత ఆచారంతో వివాహం జరిపించారు. ఈ వివాహాన్ని గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు. వివరాల్లోకి వెళ్తే.. గురువారం బత్తుల శివగంగరాజు, నందిని వివాహం పెద్దలు వైభవంగా జరిపించారు. అయితే తర తరాలుగా వస్తున్న తమ కుల ఆచారం ప్రకారం వరుడు శివగంగరాజుకు చీర, రవిక, మెడలో నగలు, చేతికి గాజులు ధరింప చేసి పెళ్లికుమార్తెగా, వధువు నందినికి పంచె, చొక్క, తలపై కండువ, చేతికి వాచి పెట్టి అచ్చం పెళ్లి కుమారుడిగా అలంకరించారు.
వీరిని ఇరువైపులా బంధువులు గ్రామ వీధుల్లో ఊరేగింపుగా గంగమ్మ, ఎల్లమ్మ దేవతలు కొలువై ఉన్న దేవాలయం వద్దకు తీసుకొని వెళ్లి అక్కడ పొంగళ్లు చేసి నైవేద్యం పెడతారని ఆ గ్రామ పెద్దలు తెలిపారు. బత్తుల వంశంలో అనాదిగా వస్తున్న ఆచారాన్ని మరచిపోకుండా వివాహాలు జరుపుతుంటామని, వివాహం అయిన మరుసటి రోజు దేవతలకు నైవేద్యం పెట్టేందుకు గుడివద్దకు వరుడు వధువు దుస్తులు, వధువు వరుడి దుస్తులు వేసుకొని వెళ్లి తమ మొక్కులు తీర్చుకుంటారని వారు తెలిపారు.


