ఫైల్‌ఫోటో
కాకినాడ:: కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జార్జిపేటలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ పూజారి సుందర సీతారామయ్యశర్మపై దాడి అమానుషమని మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ ఆక్షేపించారు. పదునైన ఆయుధంతో పూజారిపై దాడి, నాగరిక సమాజాన్ని తలదించుకు ఘటన అని ఆయన అభివర్ణించారు. పూజారిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
దాడిలో తీవ్రంగా గాయపడి, కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పురోహితుడు సుందర సీతారామయ్య శర్మను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్, ఆస్పత్రి బయట మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏమన్నారంటే..:
క్షమించరాని నేరం
భగవంతుడి సేవలో ఉన్న పూజారిపై కిరాతక దాడి జరగడం దురదృష్టకరం. వృత్తి రీత్యా ఇక్కడికి వచ్చి శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో పౌరహిత్యం చేస్తున్న పేద బ్రాహ్మణుడిపై ఇలా దాడి చేయడం క్షమించరాని నేరం. వేట కొడవలితో దాడి చేయడం, ఆ పని చేసిన వ్యక్తి నైజాన్ని స్పష్టంగా చూపిస్తోంది. దాడికి పాల్పడిన వ్యక్తి టీడీపీకి చెందిన గ్రామ నాయకుడి కుమారుడు కొండమూరి శివయ్య, అతని మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్పి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి నేరాలకు మానసిక పరిస్థితి పేరిట ముసుగులు వేయడం చాలా పెద్ద తప్పు. నిందితుడిని కఠినంగా శిక్షించాల్సిందే.
కూటమి పాలనలో ఏ ఒక్కరికీ భద్రత లేదు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కరువయ్యాయి. రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారు. మహిళలు, చిన్నపిల్లలు, దేవాలయ సేవకులకూ భద్రత లేకుండా పోయింది. పేద బ్రహ్మణ కుటుంబానికి చెందిన సుందర సీతారామయ్య శర్మ అప్పుల్లో కూరుకుపోయి పురోహిత్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అలాంటి వ్యక్తిపై దాడి చేయడం దుర్మార్గం. ఆ కుటుంబానికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
కూటమి నేతల అండతోనే ఇలాంటి దుర్ఘటనలు
రాష్ట్రంలో దేవాలయాల్లో వరుసగా జరుగుతున్న ఘటనలపై సమగ్ర విచారణ జరగాలి. తిరుపతి తొక్కిసలాట, సింహాచలంలో అమాయక భక్తుల మరణాలు, శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘటనలు.. ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలే. కూటమి నేతల అండతోనే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. పూజారిపై జరిగిన దాడి ఘటనలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజలు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ హెచ్చరించారు.


