అడుగడుగునా ఉల్లంఘనలు | - | Sakshi
Sakshi News home page

అడుగడుగునా ఉల్లంఘనలు

Mar 2 2026 7:29 AM | Updated on Mar 2 2026 7:29 AM

అడుగడ

అడుగడుగునా ఉల్లంఘనలు

అమలుకు నోచని నిబంధనలు

అందుకే ఇంతటి ఘోరం

కాసుల కక్కుర్తిలో అధికారులు

కాకినాడ క్రైం: వేట్లపాలెం సూర్యశ్రీ ఫైర్‌ వర్క్స్‌లో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.. పర్యవేక్షణలో ప్రభుత్వ నిర్లక్ష్యమే భారీ పేలుడుకు, 22 మంది దుర్మరణానికి, పలువురు చావుబతుకుల్లో కొట్టుమిట్టాడటానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. అగ్నిమాపక, పంచాయతీ, పోలీసు, కార్మిక శాఖ అధికారులెవ్వరూ తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం బాణసంచా తయారీ కేంద్రంలో నలుగురు కార్మికులు మాత్రమే ఉండాలి. కానీ, పేలుడు జరిగిన చోట 45 మంది కూలీలున్నారని అధికారులే చెబుతున్నారు.

పొట్టకూటి కోసం వచ్చిన ఈ కూలీలు పనిలో నిమగ్నమై ఉండగా.. ఓ పేలుడు పదార్థం చుడుతున్న క్రమంలో ఒత్తిడి ఎక్కువై విస్ఫోటం సంభవించిందని అంటున్నారు. అలాగే, షెడ్లను 5 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మాత్రమే నిర్మించాలి. దీనివలన తక్కువ పరిమాణంలోనే అక్కడ మందుగుండు నిల్వ చేసే అవకాశం ఉంటుంది. కానీ, సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్‌లో ఏకంగా 10 చదరపు మీటర్ల విస్తీర్ణంలో షెడ్లు నిర్మించారు. ఇలాంటివి అక్కడ నాలుగున్నాయి. నిజానికి నాలుగు షెడ్ల నిర్మాణానికి అక్కడ అసలు అనుమతులే లేవు. బాణసంచా తయారీ కేంద్రం కాలువకు అవతల వైపు పొలాల్లో ఉండటంతో కార్లు వెళ్లే అవకాశం లేదు.

దీంతో, అక్కడకు అధికారులు తనిఖీలకే వెళ్లేవారు కాదని ఆయా శాఖల్లో చర్చ జరుగుతోంది. అప్పుడప్పుడు ద్విచక్ర వాహనాలపై వెళ్లే సిబ్బంది అన్నీ చూసి, జేబులు నింపుకొని వెళ్లిపోయేవారని అక్కడ గతంలో సూపర్‌వైజర్‌గా పని చేసిన ఓ వ్యక్తి చెప్పాడు.

సస్పెన్షన్లపై గందరగోళం

వేట్లపాలెం పేలుడుకు బాధ్యుల్ని చేస్తూ రెవెన్యూ అధికారి, డీఎస్పీ, అగ్నిమాపక అధికారి, కార్మిక శాఖ అధికారులను సస్పెండ్‌ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే, వీరి పేర్లు స్పష్టంగా పేర్కొనకపోవడం చర్చనీయాంశమైంది. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, కార్మిక శాఖ జిల్లా అధికారి బీఎస్‌ఎం వల్లీ, జిల్లా ఫైర్‌ అధికారి పీవీ రాజేష్‌లు సస్పెన్షన్‌ జాబితాలో ఉండగా, రెవెన్యూ పరిధిలో ఆర్‌డీవోనా, తహసీల్దారా అనే విషయం స్పష్టం కాలేదు. సూర్యశ్రీ ఫైర్‌ వర్క్స్‌ అనుమతులు 2025లో రెన్యువల్‌ చేశారు. దీనికి ముందు తగిన పరిశీలన చేయాలి. కానీ, అటువంటి పరిశీలన కూడా లేకుండానే కొంత మంది అధికారులు లంచాలు పుచ్చుకుని, రెన్యువల్‌ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల సస్పెన్షన్‌పై ఆదివారం సాయంత్రం వరకూ ఎటువంటి ఉత్తర్వులూ విడుదల కాలేదు.

అడుగడుగునా ఉల్లంఘనలు1
1/1

అడుగడుగునా ఉల్లంఘనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement