విలాపాగ్నులు.. విషాదాశ్రులు
పిల్లలను ఎలా పోషించాలి?
మాకు 17 సంవత్సరాల కుమార్తె లలిత, 15 సంవత్సరాల కుమారుడు ప్రేమ్‌కుమార్ ఉన్నారు. ఇద్దరూ మానసిక దివ్యాంగులు. ఏమీ చదువుకోలేదు. వారికి అన్ని పరిచర్యలూ నేనే చేయాలి. కుటుంబాన్ని పోషించుకోవడానికి నా భర్త లోవరాజు పదేళ్లుగా బాణసంచా తయారీ షాపుల్లో పని చేస్తున్నాడు. ప్రమాదం జరిగిన సూర్యశ్రీ ఫైర్‌వర్‌ుక్సలో మూడేళ్లుగా పని చేస్తూ రోజుకు రూ.700 సంపాదించే వాడు. అతడి సంపాదనపైనే మా కుటుంబం ఆధారపడి ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగి ఆయన చనిపోయారు. ఇప్పుడు మా పిల్లలను ఏవిధంగా పోషించుకోవాలో అర్థం కావడం లేదు. నేను పదో తరగతి చదువుకున్నానను. ఎవరైనా దయ తలచి ఉపాధి అవకాశం కల్పించాలి. అధికారులు వచ్చి పరామర్శించారు. ఇంకా ఆర్థిక సహాయం అందలేదు.
– దర్శిపాటి వెంకటలక్ష్మి,
మృతుడు లోవరాజు భార్య
సామర్లకోట/పిఠాపురం/కాకినాడ క్రైం: వేట్లపాలెం సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్‌లో శనివారం సంభవించిన భారీ బాణసంచా విస్ఫోటంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. పేలుడు జరిగిన రోజున ఈ ప్రమాదంలో 20 మంది సజీవదహనం కాగా.. అగ్నికీలల్లో శరీరం కాలిపోయి, మందుగుండు పేలుడు సమయంలో చెలరేగిన వేడికి తీవ్రంగా ఉడికిపోయిన తొమ్మిది మందిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అక్కడ చికిత్స పొందుతూ సామర్లకోటకు చెందిన దర్శిపాటి లోవరాజు (40) ఆదివారం తెల్లవారుజామున, దర్శిపాటి రాజు (28) రాత్రి మృతి చెందారు. వీరితో కలిపి ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 22కి పెరిగింది. కాగా, తీవ్రమైన కాలిన గాయాలతో మరో ఏడుగురు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి మరింత విషమంగా మారిందని వైద్యులు చెబుతున్నారు. వారికి క్యాజువాలిటీ ఐసీయూ, బర్న్స్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. బాధితులందరూ నూరు శాతం కాలిన గాయాలతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌కి గురవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. తమ వారి స్థితిని చూస్తున్న కుటుంబ సభ్యులు జీజీహెచ్ ఆవరణలో గుండెలవిసేలా రోదిస్తున్నారు.
కాకినాడ తరలించే వీలు లేక..
సామర్లకోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)లో శవాలను భద్రపరిచేందుకు కొత్తగా మార్చురీ నిర్మించారు. దీనిని ఇంకా ప్రారంభించాల్సి ఉంది. వేట్లపాలెం పేలుడులో తొలి రోజు ప్రాణాలు కోల్పోయిన 20 మంది మృతదేహాలు ఛిద్రమైపోవడంతో కాకినాడ తరలించడంలో ఇబ్బంది ఎదురైంది. దీంతో, ఈ మృతదేహాలను, పేలుడులో తెగిపడిన అవయవాలను అధికారులు సామర్లకోట సీహెచ్‌సీలోని మార్చురీకే తరలించారు. దీంతో, మార్చురీ మృతదేహాలతో నిండిపోయింది. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి, ఆ మృతదేహాలను అంబులెన్సులు, మహాప్రస్థానం వాహనాల్లో వారి వారి గ్రామాలకు తరలించి, కుటుంబ సభ్యులకు ఆదివారం అప్పగించారు.
మిన్నంటిన మృత్యుఘోష
మృతదేహాల అప్పగింత సందర్భంగా సామర్లకోట సీహెచ్‌సీ మార్చురీ వద్ద అక్కడ మృత్యుఘోష మిన్నంటింది. మందుగుండు పేలుడు తీవ్రతకు కొంత మంది మృతదేహాలు ఛిద్రమైపోయాయి. కొంత మంది శరీర అవయవాలు తెగిపోయి ఎగిరి పడ్డాయి. దీంతో, సీహెచ్‌సీ వద్ద ఏ మృతదేహం ఎవరిదో తెలియని హృదయవిదారక పరిస్థితులు నెలకొన్నాయి. చూద్దామంటే కొంతమందికి ఆకారం లేదు. మరికొంత మందికి ముఖాలు కనిపించని దారుణమైన పరిస్థితి. మరికొందరిని గుర్తు పడదామన్నా ఆనవాళ్లు లేవు. అధికారులు తెల్లని వస్త్రాల్లో కట్టి ఇచ్చిన మూటలనే తమవారి మృతదేహాలుగా భావించి అంత్యక్రియలు నిర్వహించాల్సిన దుర్భర పరిస్థితులు ఎదురవడంతో పలువురు గొల్లుమంటూ విలపించారు. కడసారి చూపు చూసే వీలు కూడా లేకుండా తమవారు కానరాని లోకాలకు చేరుకున్నారంటూ పలువురు మృతుల కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ రోదించారు. ఇటువంటి దయనీయ పరిస్థితుల్లో తమవారి మృతదేహాలను మరుభూమికి తరలిస్తున్న వేళ.. అయినవారి కన్నీటికి అడ్డుకట్ట వేయడం ఎవ్వరి తరమూ కాలేదు. ఆయా గ్రామాల్లో సాధారణంగా వారానికో నెలకో ఒకరిద్దరి మృతదేహాలు మాత్రమే వచ్చేవి. అటువంటి చోట్ల ఒకేసారి అధిక సంఖ్యలో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాల్సి రావడం చూసి, పలువురు కన్నీటిపర్యంతమయ్యారు.
వేట్లపాలెం శ్మశానవాటిక వద్ద
మృతుల బంధువుల రోదనలు
ఫ వేట్లపాలెం బాణసంచా విస్ఫోటంలో మరో ఇద్దరి మృతి
ఫ 22కి పెరిగిన మరణాలు
ఫ కాకినాడ జీజీహెచ్‌లో ఏడుగురికి చికిత్స
ఫ వీరిలో పలువురి పరిస్థితి విషమం
ఫ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌కు గురవుతున్న క్షతగాత్రులు
ఫ బంధువులకు మృతదేహాల అప్పగింత
వివిధ ప్రాంతాల్లో జాతరలు, వివాహాది వేడుకలు, రాజకీయ నాయకుల ర్యాలీలకు కొత్త వెలుగుల్ని అద్దే ఆ నిరుపేదల కుటుంబాల్లో ఎన్నటికీ తీరని విషాదం మిగిలింది. ఒకరూ ఇద్దరూ కాదు. ఏకంగా 22 మంది ప్రాణాలను బలి తీసుకున్న వేట్లపాలెం బాణసంచా పేలుడు అనంతరం.. ఆ గ్రామాల్లో చితిమంటలు రగిలాయి. ఆ జ్వాలలు ఆ కుటుంబాల్లో మాత్రం పెనుచీకట్లు నింపాయి. వారానికో నెలకో ఒకరిద్దరి మృతదేహాలు ఆ మరుభూములకు వచ్చేవి. అటువంటిది ఒకేసారి ఎక్కువ సంఖ్యలో మృతదేహాలు రావడంతో అక్కడ ఒక్కసారిగా మృత్యు రోదనలు మిన్నంటాయి.
మిగిలిన వారేమయ్యారు?
బాణసంచా తయారీ కేంద్రంలో విస్ఫోటం జరిగిన సమయంలో 40 నుంచి 45 మంది వరకూ పని చేస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షుల కథనాన్ని బట్టి తెలుస్తోంది. వీరిలో 22 మంది మరణించగా మరో ఏడుగురు ఆస్పత్రిలో ఉన్నారు. ఒక కార్మికుడు శామ్యూల్ ప్రమాదం నుంచి తప్పించుకుని బతికి బయట పడ్డాడు. ఈ 30 మంది కాకుండా మిగిలిన వారు ఏమయ్యారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై ఫైర్‌వర్క్స్ నిర్వాహకుడు అడబాల అర్జున్‌ను విచారిస్తేనే ప్రమాద సమయంలో అక్కడ ఎంత మంది ఉన్నారనే విషయంపై స్పష్టత వస్తుంది. అయితే, అర్జున్ పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు.
విలాపాగ్నులు.. విషాదాశ్రులు
విలాపాగ్నులు.. విషాదాశ్రులు
విలాపాగ్నులు.. విషాదాశ్రులు
విలాపాగ్నులు.. విషాదాశ్రులు
విలాపాగ్నులు.. విషాదాశ్రులు
విలాపాగ్నులు.. విషాదాశ్రులు


