విజయవాడ: మద్యం ప్రియులకు సంక్రాంతి షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. తాజాగా మద్యం ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం(జనవరి 12వ తేదీ) మద్యం ధరలకు పెంపునకు ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం ధరలు తగ్గిస్తానని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇవ్వగా, ఇప్పుడు మాత్రం ధరలను పెంచుకుంటూ వెళుతున్నారు.
బాటిల్‌పై రూ. 10 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో బాటిల్‌పై రూ. 10 పెంచిన బాబు సర్కార్.. ఇప్పుడు మరో రూ. 10 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరొకవైపు లిక్కర్ సిండికేట్‌కు చంద్రబాబు ప్రభుత్వం దాసోహమైంది. బార్లకు అదనపు రిటైల్ ట్యాక్స్ తొలగించింది.
అయితే సంక్రాంతి పండుగను క్యాష్ చేసుకోవడానికే ఏపీ ప్రభుత్వం మద్యం ధరను పెంచిందని పలువురు విమర్శిస్తున్నారు. సంపద సృష్టిస్తానని పదే పదే ఎన్నికల్లో ప్రచారం చేసిన బాబు.. మరి ఇప్పుడు లిక్కర్ ధరల పెంపు ద్వారా సంపద సృష్టిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గత గురువారం (జనవరి 8 వ తేదీన) సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోగా, తాజాగా పెంపునకు ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం. మద్యం సీసాపై (బీరు, వైన్ మినహా) రూ.10 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మద్యం సీసాపై రూ.10 చొప్పున పెంచడం ద్వారా ప్రభుత్వానికి రూ.1,391 కోట్ల ఆదాయం చేకూరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


