సాక్షి, విజయవాడ: ఎన్నికల హామీలు మరిచిన కూటమి సర్కార్‌పై ఏఐఎస్‌ఎఫ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇచ్చిన మాట తప్పిన విద్యాశాఖ మంత్రి లోకేష్‌పై విద్యార్థి సంఘ నేతలు మండిపడ్డారు. లోకేష్‌తో జరిగిన సమావేశం అసంపూర్తిగా ముగిసిందని.. ఏ అంశం మీదా స్పష్టమైన హామీ రాలేదని విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యారంగంలో సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మంత్రి లోకేష్ ఇంటి ముట్టడికి బయలుదేరిన విద్యార్థి సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విద్యార్థులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

విద్యా రంగ సమస్యల పరిష్కరం కోసం ఏఐఎస్‌ఎఫ్ ఛలో విజయవాడకి పిలుపు నిచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలు విడుదల చేయాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని, విద్యా సంస్థలోకి విద్యార్థి సంఘాలు నిషేధం ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విద్యా రంగం నిర్లక్ష్యానికి గురవుతుందని విద్యార్థి సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



