పక్కా పథకం ప్రకారం దారుణ హత్య! | Unknown Persons Attack on YSRCP Chevireddy Madhusudhan Reddy Parents | Sakshi
Sakshi News home page

పక్కా పథకం ప్రకారం దారుణ హత్య!

Nov 28 2025 10:16 AM | Updated on Nov 28 2025 10:16 AM

Unknown Persons Attack on YSRCP Chevireddy Madhusudhan Reddy Parents

రాజకీయ ప్రత్యర్థుల పనేనా?  

దొంగల పనైతే బీరువాల్లో డబ్బు, ఆభరణాల జోలికెందుకెళ్లలేదు! 

సూత్రధారులెవరని అనుమానాలు 

కూటమి రాకతో పల్లెల్లో పేట్రేగుతున్న రాజకీయ వైషమ్యాలు 

వైఎస్సార్‌ సీపీ మండలాధ్యక్షుని తల్లిదండ్రులను తుదముట్టించడమే ప్లాన్‌ 

ఉలిక్కిపడిన శ్రీకాళహస్తి 

జనసంచారం అంతగా లేని వ్యవసాయ క్షేత్రం. మురిపాల పొదరింట్లో పెనవేసుకున్న మూడు ముళ్ల బంధం. ఒకరిపై ఒకరు ఆధారపడి జీవిస్తున్న దాంపత్య జీవితం. ఎవరికి కన్నుకుంట్టిందో.. ఎవరు కక్ష పెంచుకున్నారో తెలియదుగానీ.. వృద్ధ దంపతులపై కత్తులు దూశారు. పండు ముత్తైదువును మారణాయుధాలతో పొడిచి ప్రాణం తీశారు. పక్కనే ఉన్న ఆమె భర్తను కూడా తుదముట్టించాలని ప్రయతి్నంచారు. ఇద్దరూ రక్తపు మడుగులో పడిపోయారు. పొద్దున్నే వచ్చిన పని మనిషి చూసి నిర్ఘాంతపోయారు. ఇది దొంగల పనా..? రాక్షస రాజకీయ క్రీడలో భాగమా అంతుపట్టడం లేదు. దంపతుల కుమారుడు వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడిగా రాణిస్తున్నారు. అతన్ని అడ్డుకోవడం చేతగాక ఆగంతకులు ఆయన తల్లిదండ్రులపై దాడికి తెగబడినట్టు స్థానికులు చర్చించుకుంటున్నారు.  

ఏర్పేడు: ‘పచ్చని పల్లెల్లో రాజకీయ విషపుభీజాలు నాటిన విశృంఖల రాక్షసక్రీడ రాజ్యమేలుతోంది. కత్తుల వేటలో రక్తపుటేరులు పల్లె నేలను తడుపుతున్నాయి. సగటు మనిషి ప్రాణం తృణప్రాయమైంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పల్లెల్లో అరాచకశక్తులే రాజ్యమేలుతున్నాయి. సగటు పౌరుడు ఎప్పుడు ఏమి జరుగుతుందో.. అని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాడు. తాజాగా శ్రీకాళహస్తి మండలం పుల్లారెడ్డికండ్రిగలో వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్‌రెడ్డి తల్లిదండ్రులు చెవిరెడ్డి జయమ్మ(70), మహదేవరెడ్డి(81) ఉంటున్న ఇంట్లోకి గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని ఆగంతుకులు ప్రవేశించి కత్తులతో దాడులు చేసి జయమ్మను హతమార్చారు. ఆమె భర్తను కత్తిపోట్లతో తీవ్రంగా గాయపరిచారు. ఈ దుర్ఘటనతో శ్రీకాళహస్తి ఒక్కసారిగా ఉలిక్కిపడింది.’’ 

అరాచక పాలనకు దర్పణం 
‘వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్‌రెడ్డి ఇంటిపై దాడి చేసి వారి తల్లిని హతమార్చి, తండ్రిని గాయపరచిన దుర్ఘటన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అరాచకపాలనకు దర్పణంగా నిలుస్తోంది. ఇక్కడ శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయి. మునుపెన్నడూ చూడని అరాచకశక్తులు రాజ్యమేలుతున్నాయి.. అని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఈ దుర్ఘటనను తీవ్రంగా ఖండించారు. హత్యోదంతం గురించి తెలిసిన వెంటనే ఆయన హుటాహుటిన పుల్లారెడ్డి కండ్రిగ గ్రామానికి చేరుకుని మధుసూదన్‌రెడ్డి తల్లిదండ్రులు నివాసముంటున్న ఇంటిని పరిశీలించారు. హత్య కోణాలపై మృతురాలి కుటుంబసభ్యులతో చర్చించారు. అనంతరం శ్రీకాళహస్తిలో చికిత్స పొందుతున్న మహదేవరెడ్డిని పరామర్శించి, ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. పోలీసులు కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను వెంటనే అరెస్ట్‌ చేసి శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మృతురాలి కుమారుడు చెవిరెడ్డి మధుసూదన్‌రెడ్డికి ధైర్యం చెప్పారు. మాజీ ఎమ్మెల్యేతోపాటు బర్రి హేమభూషణ్‌రెడ్డి, బర్రి సుదర్శన్‌రెడ్డి, గంగిరెడ్డి, రవీంద్రారెడ్డి, సురే‹Ù, శేఖర్‌రెడ్డి, నాధముని, శివారెడ్డి, రవి, ఆర్కాడు ముత్తు, సుమన్, దిలీప్, మున్నారాయల్, జయశ్యామ్‌రాయల్‌ తదితరులు ఉన్నారు.

విద్యావేత్తగా ఎదిగి.. రాజకీయ రంగంలోనూ రాణిస్తూ.. 
జయమ్మ, మహదేవరెడ్డి దంపతుల కుమారుడు చెవిరెడ్డి మధుసూదన్‌రెడ్డి శ్రీకాళహస్తిలో విద్యాసంస్థలు నడుపుతూ కొన్ని దశాబ్దాలుగా రాణిస్తున్నారు. ఆయన రాజకీయంపైనా ఆసక్తితో మొదట్నుంచీ వైఎస్సార్‌ సీపీ అనుయాయుడుగా ఉంటూ వస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డికి విధేయుడిగా, పార్టీ పటిష్టతకు నిబద్ధతతో పనిచేసుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని పార్టీ అధిష్టానం వైఎస్సార్‌ సీపీ శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడిగా నియమించింది. పదవి పొందినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ మండలంలోని అన్ని గ్రామాల్లో పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేసుకుంటూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారు. అయితే ఆయనకు ఎంతో ఇష్టమైన తల్లిదండ్రుల కోసం సొంతూరిలోని వ్యవసాయ క్షేత్రంలో పెద్ద ఇల్లు నిర్మించి సకల సౌకర్యాలు  కలి్పంచారు.  

ఎంపీ పరామర్శ 
శ్రీకాళహస్తి: వైఎస్సార్‌ సీపీ శ్రీకాళహస్తి మండలాధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్‌రెడ్డి తల్లిదండ్రులపై ఆగంతుకుల దాడిలో తల్లి మృతి చెందగా తండ్రి మహదేవరెడ్డి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికి త్స పొందుతున్నాడు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్‌ సిపాయి సుబ్రహ్మణ్యం, ముక్కంటి ఆలయ పాలకమండలి మాజీ చైర్మన్‌ అంజూరు తారక శ్రీనివాసులు ఆస్పత్రికి చేరుకుని వారిని పరామర్శించారు. వైద్యులను అడిగి చికిత్స వివరాలను తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వయ్యాల కృష్ణారెడ్డి, రత్నంరెడ్డి, బుజ్జిమేస్త్రీ, అంజూరు వెంకటే‹Ùబాబు, పఠాన్‌ఫరీద్, శ్రీవారి సురే‹Ù, రామచంద్రారెడ్డి, పెరుమాళ్‌రెడ్డి, న్యాయవాది లక్ష్మీపతి, మల్లెంబాకం మునికృష్ణారెడ్డి, గోపీ గౌడ్, తేజు రాయల్, బాల, సు«దీర్‌ తదితరులు పాల్గొన్నారు.

 మాజీ ఎమ్మెల్యే పరామర్శ
శ్రీకాళహస్తి:  గుర్తుతెలియని దుండగుల దాడిలో గాయపడిన  చెవిరెడ్డి మధుసూదన్‌ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి పరామర్శించారు. శ్రీకాళహస్తి మండలంలోని పుల్లారెడ్డి కండ్రిగలోని చెవిరెడ్డి మహదేవరెడ్డి, జయమ్మ దంపతులపై గుర్తుతెలియని దుండగులు దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో చెవిరెడ్డి జయమ్మ మృతి చెందగా, తండ్రి మహాదేవరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. మహాదేవరెడ్డి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం, ఆయన చెవిరెడ్డి మధుసూదన్‌ రెడ్డిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే  మాట్లాడుతూ ఈ దారుణమైన హత్యకు కారకులైన వారిని పోలీసులు వెంటనే గుర్తించి, చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు బర్రె‡ సుదర్శన్‌ రెడ్డి, గంగిరెడ్డి, రవీంద్రారెడ్డి, సురేష్, శేఖర్‌ రెడ్డి, నాదముని, శివరెడ్డి, ముద్ధమూడి రవి, ఆర్కాడు ముత్తు, సుమన్, దిలీప్, మున్నా రాయల్, బుల్లెట్‌ జై శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.  

పథకం ప్రకారమే హత్య.. 
అయితే జనసంచారం అంతగా లేని వ్యవసాయ క్షేత్రంలో ఉంటున్న మధుసూదన్‌రెడ్డి తల్లిదండ్రులను అంతమొందించేందుకు పక్కా ప్రణాళికతో హత్య చేయడానికి వచ్చినట్లు హత్య జరిగిన తీరును బట్టి చూస్తే అర్థమవుతోంది. రాజకీయ ప్రత్యర్థులెవరైనా దాడి చేయించా రా? అనే కోణంలో వారి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే సమీపంలోని ఎస్టీ కాలనీకి చెందిన వారెవరైనా బంగారు, డబ్బు కోసం ఇంట్లోకి చొరబడి హత్య చేశారా? అనే కోణంలోనూ పోలీ సుల దర్యాప్తు సాగుతోంది. ఇంతటి దారుణానికి ఒడి గట్టిన వారిని పోలీసులు వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం డిమాండ్‌ చేస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement