సాక్షి, విజయవాడ: పరకామణి కేసులో సీఐడీ విచారణకు మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. రెండు రోజుల క్రితం నాటి ఈవో ధర్మారెడ్డి, సీ.ఎస్.వో నరసింహ కిషోర్‌లను విచారించిన సీఐడీ అధికారులు.. ఇవాళ వైవీ సుబ్బారెడ్డి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. విచారణ అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పరకామణి అక్రమాలపై సమగ్రంగా విచారణ జరిపించాలని కోరారని తెలిపారు. గంటన్నరపాటు జరిగిన విచారణలో సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చానన్నారు.
మనోభావాలకు సంబంధించి ఇష్యూను పొలిటికల్ ఇష్యూలా మారుస్తున్నారు. లడ్డూలో కల్తీ నెయ్యి, పరకామణి అంశాలను రాజకీయ వివాదాలుగా మార్చారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ‘‘పరకామణి కేసులో సమగ్ర దర్యాప్తు జరపాలి. దోషులు ఎవరో నిగ్గు తేల్చాలి. దోషులకు కోర్టు ద్వారా శిక్ష పడాలి. మీ హయంలో జరిగింది కాబట్టి విచారణకు పిలిచామని చెప్పారు. ఎవరిని పిలిచినా ఎవరిని విచారించినా రాజకీయం చేయొద్దు. తప్పు ఎవరు చేసిన తప్పే తప్పు. చేసినా దోషులను శిక్షించాలని మేము చెప్తున్నాం. నన్ను పిలిచినా, భూమన కరుణాకర్ రెడ్డిని పిలిచినా విచారణ కోసమే పిలిచారు.’’ అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.


