విశాఖలో అదానీ డేటా సెంటర్‌కు 480 ఎకరాల కేటాయింపు
అదానీని గూగుల్ నోటిఫైడ్ పార్టనర్‌గా గుర్తిస్తూ మంత్రివర్గం ఆమోదం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందని సంకుచిత బుద్ధితో కప్పిపుచ్చిన బాబు
వైఎస్ జగన్ హయాంలోనే అదానీ డేటా సెంటర్‌కు భూమి కేటాయింపు, శంకుస్థాపన
సముద్రంలో కేబుల్ ఏర్పాటుకు సింగపూర్ ప్రభుత్వానికి నాడే లేఖ 480 ఎకరాల కేటాయింపు
సాక్షి, అమరావతి: విశాఖకు గూగుల్ రాక వెనుక నిజాలను తొక్కిపెట్టి సంకుచిత బుద్ధితో చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించిన వైనం తాజాగా మంత్రివర్గ సమావేశం సాక్షిగా మరోసారి బట్టబయలైంది! విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు రాంబిల్లి, అనకాపల్లి పరిధిలో అడవివరం, తర్లువాడ గ్రామాలలో 480 ఎకరాలను గూగుల్‌తో డేటా సెంటర్లకు సంబంధించి వ్యాపార అనుబంధం ఉన్న అదానీకి కేటాయించేందుకు శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడమే దీనికి నిదర్శనం. అదానీ గ్రూపు సంస్థలు అదానీ ఇన్ఫ్రా, అదానీ కోనెక్స్, అదానీ పవర్ లిమిటెడ్ తదితర సంస్థలను గూగుల్ నోటిఫైడ్ పార్టనర్స్‌గా గుర్తిస్తూ మంత్రివర్గం ఆమోదించడం గమనార్హం. విశాఖలో అదానీ సంస్థ డేటా సెంటర్ నిర్మిస్తుందని.. అందుకోసం భూమి అప్పగించాలంటూ గత అక్టోబర్ 4న రాష్ట ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్‌కు గూగుల్ ప్రతినిధి అలెగ్జాండర్ లేఖ రాయడం గమనార్హం.
జగన్ హయాంలోనే డేటా సెంటర్‌కు శంకుస్థాపన
విశాఖ నగరాన్ని అంతర్జాతీయ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో వైఎస్సార్ సీపీ హయాంలోనే 2020 నవంబర్‌లో (కోవిడ్ సమయంలో) అదానీ డేటా సెంటర్‌కు బీజం పడటం.. ఆ తర్వాత 2023 మే 3న అదానీ డేటా సెంటర్‌కి శంకుస్థాపన జరగడం తెలిసిందే. అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు గత ప్రభుత్వంలోనే ప్రక్రియ మొదలైంది. ఇందుకోసం సింగపూర్ నుంచి 3,900 కి.మీ. మేర సముద్రంలో కేబుల్ ఏర్పాటు ప్రక్రియకు నాడే శ్రీకారం చుట్టారు. ఈమేరకు సింగపూర్ ప్రభుత్వానికి వైఎస్సార్ సీపీ హయాంలోనే 2021 మార్చి 9న లేఖ రాయడం గమనార్హం. విశాఖలో అదానీ డేటా సెంటర్‌కు 190 ఎకరాలు కేటాయించి 2023 మే 3న శంకుస్థాపన చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వమే. దాని కొనసాగింపులో భాగంగానే ఇప్పుడు 1,000 మెగావాట్లకు డేటా సెంటర్‌ను విస్తరిస్తున్నారు. ఇందులో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, సింగపూర్, కేంద్ర ప్రభుత్వం, అదానీ కృషి ఎంతో ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. అదానీ పేరెత్తితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందని బాబు సంకుచిత బుద్ధితో వ్యవహరించారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఉద్యోగాలు కూడా ఇచ్చేలా నాడు ఒప్పందం..
డేటా సెంటర్‌కు అవసరమైన హార్డ్‌వేర్, ఇతర టెక్నాలజీని గూగుల్ సమకూరుస్తుండగా.. అదానీ గ్రూప్ దాదాపు రూ.87 వేల కోట్లు పెట్టుబడి పెట్టి దీన్ని నిర్మిస్తోంది. రాష్ట్రానికి గూగుల్‌ను తెస్తున్నందుకు అదానీకి ధన్యవాదాలు చెప్పాల్సిన చంద్రబాబు కనీసం క్రెడిట్ ఇవ్వలేదు. ఆ పేరు చెబితే, వైఎస్సార్ సీపీ ప్రభుత్వ కృషి గురించి కూడా ప్రస్తావించాల్సి వస్తుందనే భయంతోనే నిజాలను కప్పిపుచ్చి గుట్టుగా వ్యవహరించారు. కేంద్రం, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం, అదానీ.. ఇంతమంది కృషితో గూగుల్ రాకకు మార్గం సుగమమైందని చెప్పటానికి చంద్రబాబు సంకోచించారు. కేవలం డేటా సెంటర్ ఏర్పాటు మాత్రమే కాకుండా 25 వేల ఉద్యోగాలు కల్పించాలని ఆ రోజు అదానీతో చేసుకున్న ఒప్పందంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కోరడం గమనార్హం. తద్వారా ఐటీ పార్క్, స్కిల్ సెంటర్, రిక్రియేషన్ సెంటర్ల ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందంలో పొందుపరిచింది.


