పచ్చకామెర్ల బారిన పడి పార్వతీపురం మన్యం జిల్లా ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్న గిరిజన విద్యార్థులు (ఫైల్)
కనీసం మంచినీరు కల్పించలేని దుస్థితి
కలుషిత ఆహారం.. దారుణంగా పారిశుధ్యం
వైద్య సేవల్లో ఘోర వైఫల్యం
గత 18 నెలల్లో ఏజెన్సీలో 22 మంది పిల్లలు మృత్యువాత
558 ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో 1.35 లక్షల మంది విద్యార్థుల హాహాకారాలు
సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు సర్కారు గిరిజన బిడ్డల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. నాడు – నేడుతో ప్రైవేట్ స్కూళ్లను మించి సదుపాయాలు కల్పించిన ప్రభుత్వ పాఠశాలలను ప్రస్తుతం కనీసం రక్షిత మంచినీరు కూడా ఇవ్వలేని దుస్థితికి దిగజార్చింది. ఫలితంగా గిరిజన ప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాలల్లో మరణ మదంగం మోగుతోంది. వరుసగా పిల్లలు మత్యువాత పడుతున్నా.. వందల మంది అనారోగ్యంతో ఆస్పత్రుల పాలవుతున్నా పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోకపోవడం నివ్వెరపరుస్తోంది.
» పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన గురుకుల పాఠశాలలో మంచినీటి ఆర్వో ప్లాంట్ పని చేయకపోవడంతో విద్యార్థులు పచ్చకామెర్ల బారి న పడ్డారు. సుమారు 184 మంది అస్వస్థతకు గురి కాగా చిన్నారులు పువ్వల అంజలి (కంబగూడ), తోయక కల్పన (దండనూరు) కామెర్లు ముది రిపోయి మత్యువాత పడ్డారు.
» అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పరిధిలోని డుంబ్రిగుడా మండలం జామిగూడ గిరిజన బాలికల హాస్టల్‌లో కలుషిత ఆహారం (పాడైన గుడ్లు కూర) తిని 60 మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారు.
» అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని ప్రైవేట్ ట్రస్ట్ హాస్టల్‌లో కలుషిత ఆహారం (మిగిలిపోయిన సాంబార్ అన్నం) తిని ముగ్గురు గిరిజన విద్యార్థులు (శ్రద్ధ, జాషువా, నిత్య) చనిపోయారు. 70 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.
కలుషిత నీరు, ఆహారమే కారణం..!
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్వతీపురం సమీకత గిరిజనాభివద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలో 14 మంది, సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఒకరు, పాడేరు ఐటీడీఏ పరిధిలో ఏడుగురు మతి చెందినట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి.
క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఇది మరింత అధికంగా ఉంటుందని అంచనా. వీరంతా కలుషిత నీరు తాగడం, నిల్వ ఆహారం తినడం, పారిశుధ్య లోపం, సకాలంలో సరైన వైద్యం అందకపోవడం లాంటి ప్రధాన కారణాల వల్లే మతి చెందారన్నది తేటతెల్లమవుతోంది. విద్యార్థుల మరణాలను అరికట్టాలంటూ కొద్ది రోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లాలో ఆందోళనలు నిర్వహించారు.
ఏఎన్‌ఎంల నియామకం ఎప్పుడు?
ఏజెన్సీలోని 558 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లకు ఒకరు చొప్పున ఏఎన్‌ఎంలను నియమిస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రతి సందర్భంలో చెబుతున్నా అడుగు ముందుకు పడలేదు.
ప్రతి వంద మంది విద్యార్థులకు ఒక ఏఎన్‌ఎంను నియమిస్తే తక్షణం ప్రాథమిక వైద్యం అందించడంతోపాటు ఆరోగ్య సమస్య తీవ్రతను గుర్తించి ఆస్పత్రికి తరలించేలా అప్రమత్తం చేసే వీలుంది. విద్యాసంస్థల్లో పారిశుధ్య నిర్వహణ, ఆహార నాణ్యతను ఏఎన్‌ఎంల ద్వారా పరిశీలించవచ్చు. వరుస ఘటనలతో గ్రామ సచివాలయాల్లో అరకొరగా ఉన్న ఏఎన్‌ఎంలను ఆయా విద్యా సంస్థల్లో తాత్కాలిక సేవలు అందించాలని ఆదేశించారు.
మంత్రి బాధ్యతారాహిత్యం..!
గిరిజన విద్యా సంస్థలు, హాస్టళ్లలో మంచినీటి (ఆర్వో) ప్లాంట్లు, మరుగుదొడ్లు, భవనాల మరమ్మతులకు కేవలం రూ.వంద కోట్లు అవసరం కాగా రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు మాత్రమే కేటాయించడంతో సమస్యలు తప్పడం లేదు. 558 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో 1.35 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు.
ఇంతమంది గిరిజన విద్యార్థుల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి చంద్రబాబు సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి పాఠశాలలో పిల్లలు జ్వరాలు, పచ్చ కామెర్లతో బాధపడుతున్నారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ గిరిజనశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి బాధ్యతా రాహిత్యంగా వ్యాఖ్యలు చేశారు.


