ఏవో, డిప్యూటీ డీవీఈవో పోస్టుల కన్వర్షన్‌పై ఎటూ తేల్చని ప్రభుత్వం
డీఐఈవోలుగా జూనియర్ ప్రిన్సిపాళ్లు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ బోర్డులో పోస్టుల మార్పుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పోస్టుల విభజన చేసిన ప్రభుత్వం కొన్ని పోస్టుల కన్వర్షన్‌పై ఎటూ తేల్చడం లేదు. దీంతో కమిషనరేట్ అధికారులు జూనియర్ కాలేజీ ప్రిన్సిపాళ్లకు ఎఫ్‌ఏసీ (పూర్తి అదనపు బాధ్యతలు) అప్పగిస్తున్నారు. అయితే ఈ విధానంలో తమకు అన్యాయం జరుగుతోందని సీనియర్లు ఆరోపిస్తున్నారు. పైరవీలు చేసుకున్న వారికే అధికారులు అవకాశం కల్పిస్తున్నారని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాకు ఒక్క అధికారే ఉండేలా..
ఉమ్మడి జిల్లాల్లో జిల్లా వొకేషన్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్(డీవీఈవో), డిప్యూటీ వొకేషన్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్/ ఏవో, ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారి (ఆర్‌ఐవో) పోస్టులు ఉండేవి. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత పోస్టుల రీ ఆర్గనైజేషన్ చేస్తూ జిల్లాకు ఒక్కరే అధికారి ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో డీవీఈవో పోస్టును జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డీఐఈవో)గా మార్చారు. ప్రస్తుతం పాత జిల్లాలకు డీఈవోలు ఉండగా, కొత్తగా ఏర్పడిన జిల్లాలకు ఇన్‌చార్జిలే దిక్కుగా ఉన్నారు.
ఇదీ పరిస్థితి
రాష్ట్రంలో జిల్లాల విభజన తర్వాత ఇంటర్మీడియట్ బోర్డులో జిల్లా స్థాయి పోస్టులతో సహ ఉద్యోగులను జిల్లాలకు సర్దుబాటు చేశారు. ఈ క్రమంలో ఏవో/ డిప్యూటీ జిల్లా వొకేషనల్ ఎడ్యుకేషనల్ (డీఐఈవో) అధికారి పోస్టులను కొత్త జిల్లాలకు కేటాయించారు. దీంతో పాటు ఆ పోస్టులను జిల్లా వొకేషన్ ఎడ్యుకేషనల్ అధికారిగా మార్చాలని (కన్వర్షన్) అధికారులు ప్రభుత్వానికి, ఆర్థికశాఖకు ఫైల్ పంపారు.
దీనిపై ఇప్పటివరకూ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే, జిల్లా వొకేషన్ ఎడ్యుకేషనల్ అధికారి పోస్టు పేరు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా మార్పుచేశారు. దీంతో పాత జిల్లాల్లోని డీవీఈవోలు డీఐఈవోలుగా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, కొత్త జిల్లాలకు మాత్రం జూనియర్ కాలేజీ ప్రిన్సిపాళ్లకు డీఐఈవోలుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో వీరు తమ కాలేజీ నిర్వహణతో పాటు జిల్లా బాధ్యతలు కూడా చూస్తూ ఒత్తిడికి గురవుతున్నారు.


