అంతులేని భూదాహం | second time land pooling in Amaravati For Capital | Sakshi
Sakshi News home page

అంతులేని భూదాహం

Nov 29 2025 3:08 AM | Updated on Nov 29 2025 3:08 AM

second time land pooling in Amaravati For Capital

రాజధానిలో రెండో విడత 7 గ్రామాల్లో 20,494.57 ఎకరాల భూ సమీకరణకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌  

బినామీల భూముల ధరలు పెంచుకోవడం, నిర్మాణ పనుల్లో కమీషన్ల వసూలే అజెండా 

2015లో రాజధాని నిర్మాణానికి తొలి విడతలో 53,748 ఎకరాల సమీకరణ 

భవనాలు, వసతులు, రైతుల ప్లాట్లకు పోగా ఇంకా 8,250 ఎకరాలు మిగులుతుందన్న చంద్రబాబు  

ఆ భూమిని అమ్మగా వచ్చే నిధులతోనే నిర్మాణం.. అదో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సిటీ అంటూ గొప్పలు  

2024లో అధికారంలోకి వచ్చాక మాట మార్చిన ముఖ్యమంత్రి.. 

29 గ్రామాలకే పరిమితమైతే అదో చిన్న మున్సిపాలటీగా మిగిలిపోతుందని పదే పదే ప్రకటనలు 

రాజధానిలో భూముల ధరలు పెరగాలంటే స్మార్ట్‌ ఇండస్ట్రీస్‌ రావాలని స్పష్టీకరణ 

అది జరగాలంటే ఇంటర్నేషనల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్‌ సిటీ నిర్మించాలని వెల్లడి 

ఈ క్రమంలోనే 11 గ్రామాల్లో 44,676.74 ఎకరాల సమీకరణకు సిద్ధం.. మలి విడత భూ సమీకరణకు జూన్‌ 24న కేబినెట్‌లో ఆమోద ముద్ర 

జూలై 1న భూ సమీకరణ పథకం–2025 విధి విధానాలు జారీ 

తొలి విడత భూములు ఇచ్చిన రైతుల ఆగ్రహంతో తాత్కాలికంగా వెనక్కు తగ్గిన సర్కారు 

చిన్న మున్సిపాల్టీగా మిగిలి పోకూడదంటూ తాజాగా కేబినెట్‌లో పచ్చ జెండా 

మూడో విడతలో మిగతా 24,182.17 ఎకరాల సమీకరణ దిశగా పావులు.. 

53,748 ఎకరాల్లో రాజధాని తొలి దశ నిర్మాణానికే రూ.77,249 కోట్లు అవసరమన్న సీఎం  

ఆ భూముల్లో, రెండు, మూడో దశల్లో సమీకరించే భూముల్లో రాజధాని నిర్మాణానికి మరో రూ.3 లక్షల కోట్లు అవసరం 

ఇదంతా అప్పుగా తేవాల్సిందే.. ఈ భారమంతా ప్రజలపై తప్పదంటున్న ఆర్థిక నిపుణులు

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి ఇప్పటికే 53,748 ఎకరాలు సమీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి భూ దాహం తీరడం లేదు. మలి విడతలో తుళ్లూరు, తాడికొండ, అమరావతి, మంగళగిరి మండలాల్లోని 11 గ్రామాల పరిధిలో 44,676.74 ఎకరాల భూమిని సమీకరించే దిశగా అడుగులు వేశారు. గత జూన్‌ 24న మంత్రివర్గంలో మలి విడత భూ సమీకరణకు ఆమోద ముద్ర వేయించారు. రాజధాని మలి విడత భూ సమీకరణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ జూలై 1న ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం (భూ సమీకరణ పథకం)–2025 విధి విధానాలు జారీ చేశారు. 

మొదటి విడత సమీకరణ కింద పదేళ్ల క్రితం భూములు ఇచ్చిన తమకు అప్పట్లో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు చేయలేదని.. అభివృద్ధి చేసిన నివాస(రెసిడెన్షియల్‌), వాణిజ్య (కమర్షియల్‌) ప్లాట్లు ఇవ్వలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల్లో ఆగ్రహావేశాలు గమనించిన చంద్రబాబు సర్కార్‌ కాస్త వెనక్కు తగ్గినట్లు తగ్గి.. మలి విడత భూ సమీకరణకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వచి్చంది. రాజధాని ప్రాంతంలో భూముల ధరలు పెరగాలంటే స్మార్ట్‌ ఇండస్ట్రీస్‌ రావాలని, అవి రావాలంటే ఇంటర్నేషనల్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్‌ సిటీ నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, పురపాలక మంత్రి నారాయణ పదేపదే చెబుతూ వచ్చారు. వీటి నిర్మాణానికి భూమి అందుబాటులో లేదని వాపోతూ వచ్చారు. రాజధాని 29 గ్రామాలకే పరిమితమైతే అదో చిన్న మున్సిపాలీటిగా మిగిలి పోతుందని, అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందాలంటే– మలి విడత భూ సమీకరణ తప్పదంటూ గురువారం రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. ఇందుకు రైతులు సహకరించకపోతే అమరావతి చిన్న మున్సిపాలీటిగా మిగులుతుందని అన్నారు.

మూడో విడత కూడా ఖాయం 

  • ఈ నేపథ్యంలో శుక్రవారం కేబినెట్‌లో రెండో విడత తుళ్లూరు, అమరావతి మండలాల పరిధిలో వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కార్లపూడి, వడ్లమాను, హరిశ్చంద్రాపురం, పెద్దపరిమిలో రైతులకు చెందిన 16,666.57 ఎకరాల పట్టా భూమి, మరో 3,828 ఎకరాల ప్రభుత్వ భూమి వెరసి.. 20,494.57 ఎకరాల భూ సమీకరణకు ఆమోద ముద్ర వేయించారు.  

  • మిగతా నాలుగు గ్రామాల్లో (మొతడక, తాడికొండ, కంతేరు, కాజా) 24,182.17 ఎకరాలను మూడో విడతలో సమీకరించడం ఖాయమని అధికార వర్గాలు తెలిపాయి. భూ సమీకరణ మూడో విడత కూడా ఉంటుందని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ స్పష్టం చేయడం దీన్ని బలపరుస్తోంది.  

  • మొత్తంమ్మీద 98,424.74 ఎకరాలలో రాజధాని నిరి్మంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టమవుతోంది. అందుకయ్యే వ్యయాన్ని అప్పుగా తెచి్చ.. రాష్ట్ర ప్రజలు చెల్లించే పన్నులతోనే తీర్చాల్సి వస్తుందని ఆరి్థక నిపుణులు తేగిసి చెబుతున్నారు. రాజధాని అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సిటీ ఏమాత్రం కాదన్నది మలి విడత భూ సమీకరణతోనే స్పష్టమైందని చెబుతున్నారు.   
    మిగిలిందన్న 8,250 ఎకరాల మాటేంటి? 

  • గుంటూరు జిల్లాలో తుళ్లూరు, తాడికొండ, మంగళగరి మండలాల పరిధిలోని 29 గ్రామాలలో రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ కింద   29,442 మంది రైతుల నుంచి 34,823.12 ఎకరాలు 2015లో ప్రభుత్వం సమీకరించింది. మరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూమి కలిపి 53,748 ఎకరాల్లో (217 చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మాణం చేపట్టినట్లు ప్రకటించింది. 

  •   ప్రభుత్వ భవనాల నిర్మాణం, రహదారులు.. మురుగు నీటి వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలు కలి్పంచేందుకు.. రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చినా ప్రభుత్వానికి 8,250 ఎకరాలు మిగులుతుందని, దాన్ని అమ్మగా వచ్చే నిధులతో అమరావతి తనను తానే నిర్మించుకుంటుందని సీఎం చంద్రబాబు అనేకసార్లు సెలవిచ్చారు. అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సిటీ అంటూ గొప్పలు చెప్పారు.  

  •  కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్‌ సిటీ, స్మార్ట్‌ ఇండస్ట్రీస్‌కు భూములు లేవని చెప్పడంపై రైతులే విస్తుపోతున్నారు. ఇప్పటికే సమీకరించిన 53,748 ఎకరాల్లోనే.. రాజధాని తొలి దశ నిర్మాణానికే రూ.77,249 కోట్లు అవసరమని గత ఏప్రిల్‌ 16న 16వ ఆరి్థక సంఘానికి సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్‌ ఇచ్చారు.  

  • తొలి దశ రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి రూ.1.50 లక్షల కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన తాజాగా సమీకరిస్తున్న 44,676.74 ఎకరాల్లో రాజధాని నిర్మాణం పూర్తికి మరో రూ.1.5 లక్షల కోట్లు అవసరమవుతాయి. రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి వ్యయం రూ.3 లక్షల కోట్లకు చేరుకుంటుందని అధికారుల అంచనా. ఆ రూ.3 లక్షల కోట్లను అప్పుగా తేవాల్సిందే. ఇక వాటిని వడ్డీతో కలిపి చెల్లించడానికి ఇంకెన్ని రూ.లక్షల కోట్లు అవసరమవుతాయో అంచనా వేసుకోవచ్చని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 
     

    రాజధానా.. రియల్‌ ఎస్టేట్‌ వెంచరా?  
    చంద్రబాబు ప్రభుత్వం రాజధాని నిర్మిస్తోందా.. లేక రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ వేసి వ్యాపారం చేస్తోందా.. అని ఆరి్థక రంగ నిపుణులు ప్రశి్నస్తున్నారు. ఇప్పటికే సమీకరించిన భూమిలో రాజ«­దాని నిర్మాణంపై దృష్టి సారించకుండా.. మలి విడత భూ సమీకరణకు సిద్ధమవ్వడం ఏమిటని నిలదీస్తున్నారు. పదేళ్ల క్రితం రాజధానికి భూములు ఇచి్చన రైతులకు ఇప్పటికీ హామీలు నెరవేర్చలేదని.. అభివృద్ధి చేసిన ప్లాట్లు కూడా ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి18 నెలలైనా, రాజధాని నిర్మాణ పనులు జరుగుతున్న తీరు ఏమాత్రం ఆశాజనకంగా లేవని రాజధాని రైతులు బాహాటంగా వ్యాఖ్యానిస్తుండటాన్ని వారు ఎత్తిచూపుతున్నారు. ఈ స్థితిలో మలి విడతగా 44,676.74 ఎకరాల సమీకరణకు సిద్ధమవడంపై అటు రైతులు, ఇటు ఆర్థిక వేత్తలు, నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

భూముల ధరలు పెంచుకోవడం, కమీషన్లే లక్ష్యం  

  • రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా కాజేసిన భూముల ధరలు పెంచుకోవడం కోసం.. ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు అధిక ధరలకు నిర్మాణ పనులు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకోవడం కోసం మలి విడత రాజధాని భూ సమీకరణకు చంద్రబాబు సర్కార్‌ సిద్ధమైందనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. దీనికి 2015 నుంచి ఇప్పటి వరకు జరిగిన, జరుగుతున్న పరిణా­మాలను నిపుణులు, అధికార వర్గాల వారు ఎత్తిచూపుతున్నారు.  

  • సరైన ఆర్థిక ప్రణాళిక (నిధులు ఉన్నాయా లేదా అన్నది చూసుకోకుండా) లేకుండా రాజధాని ప్రాంతంలో 2016–­19 మధ్య రహదారులు, మౌలిక సదుపాయాలు, ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించిన పనులను 55 ప్యాకేజీల కింద రూ.33,476.23 కోట్లకు అప్పగించారు. ఈ పనుల కోసం సీఆర్‌డీఏ రూ.8,540.52 కోట్లను అప్పు  తెచ్చింది. కానీ.. ఆ పనులకు రూ.5,428.41 కోట్లను మాత్రమే 2019 మే నాటికి వ్యయం చేసింది. ఆ పనులు పూర్తి కావాలంటే రూ.28,047.82 కోట్లు కావాలి. ఇప్పుడు ఆ పనులన్నింటినీ ప్రభుత్వం రద్దు చేసింది. 2018–19 ధరలతో పోలి్చతే.. పెట్రోల్, డీజిల్, సిమెంటు, స్టీలు తదితర ధరల్లో పెద్దగా మార్పులేదు. అయినా సరే మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 50 నుంచి 105% పెంచేసి కొత్తగా టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించింది.  

  • రాజధాని నిర్మాణ పనుల కోసం ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో (హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు నుంచి రూ.5 వేల కోట్లు, ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ నుంచి రూ.7,500 కోట్లు, ఏపీఎస్‌పీసీఎల్‌ నుంచి రూ.1,500 కోట్లు వెరసి రూ.40 వేల కోట్లు అప్పు తీసుకోవడానికి ఒప్పందం చేసుకుంది. 

  • సీఆర్‌డీఏ బాండ్ల ద్వారా మరో రూ.21 వేల కోట్లు సమీకరించడానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అంటే.. ఇప్పటికే రూ.61 వేల కోట్లు అప్పులు చేస్తున్నారన్నది స్పష్టమవుతోంది. ఇక 2025–26 బడ్జెట్‌లో రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ఖజానా నుంచి రూ.6 వేల కోట్లు కేటాయించారు. వీటిని పరిశీలిస్తే.. రాజధాని కామధేనువు కాదు.. అప్పులకుప్ప అన్నది స్పష్టమవుతోంది. మరి సెల్ఫ్‌ పైనాన్స్‌ మోడల్‌ ఎక్కడ ఉందన్నది పెరుమాళ్లకెరుక!

  •  రాజధాని నిర్మాణ పనులు రూ.62 వేల కోట్ల అంచనా వ్యయంతో ఇప్పటికే కాంట్రాక్టర్లకు అప్పగించి.. అందులో పది శాతం అంటే రూ.6,200 కోట్లను మొబిలైజేషన్‌ అడ్వాన్సుగా ముట్టజెప్పేసి నీకింత–నాకింత అంటూ పెద్దలు పంచుకుతిన్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. 2014–19 మధ్య రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థల నుంచి పెద్దల తరఫున కమీషన్లు వసూలు చేస్తూ ఆదాయపు పన్ను శాఖ అధికారులకు దొరికిపోయిన అధికారికే ఇప్పుడూ అదే బాధ్యతలు అప్పగించడం గమ­నార్హం. అటు తమ భూముల ధరలు పెంచుకోవడం, ఇటు నిర్మాణ పనుల్లో కమీషన్లు కాజేయడమే లక్ష్యంగా ప్రభుత్వ పెద్దలు ముందుకు వెళుతున్నట్లు స్పష్టమవుతోంది. 

  • ప్రభుత్వం ఇటీవల జపిస్తున్న గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌­పోర్టుకు 5వేల ఎకరాలు, మరో 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్‌ సిటీ నిర్మాణాన్ని సమీప వ్యక్తులకు కట్టబెట్టి.. కమీషన్లు దండుకునేందుకు వ్యూహం సిద్ధమైందని సమాచారం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement