దేశంలో రీటెయిల్ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతోంది. వీధికో షాపింగ్ మాల్ వెలుస్తోంది. అయితే.. అన్ని షాపింగ్ మాల్స్ నిండుగా ఉంటున్నాయా? ఊహూ లేదు. చాలా వాటిల్లో షాపులు పెట్టుకునే స్థలాలుంటున్నాయి కానీ.. ఎవరూ అద్దె/ లీజుకు తీసుకోవడం లేదు. ఫలితంగా దేశంలో ఏటికేడాదీ ఘోస్ట్‌మాల్స్ పెరిగిపోతున్నాయి!
ఘోస్ట్‌మాల్స్ అంటే ఏమిటని ఆలోచిస్తున్నారా? చాలా సింపుల్ ఏ మాల్‌లోనైనా సగం కంటే ఎక్కువ స్పేస్ మూడేళ్లపాటు ఖాళీగా ఉందంటే దాన్ని ఘోస్ట్‌మాల్ అంటారు. ప్రస్తుతం భారత్‌లోని 32 నగరాల్లో మొత్తం 72 మాల్స్ ఈ స్థితికి చేరుకున్నాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా అనే సంస్థ లెక్కకట్టింది. మొత్తం 365 షాపింగ్ సెంటర్స్‌లో 13.4 కోట్ల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉంటే.. కోటీ యాభైఐదు లక్షల చదరపు అడుగులు (15.4 శాతం) ఖాళీగా ఉన్నట్లు ఈ సంస్థ ‘థింక్ ఇండియా, థింక్ రిటైల్ 2025 – వాల్యూ క్యాప్చర్: అన్‌లాకింగ్ పొటెన్షియల్’ పేరుతో విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది.
నైట్ ఫ్రాంక్ ఇండియా ‘థింక్ ఇండియా, థింక్ రిటైల్ 2025 – వాల్యూ క్యాప్చర్: అన్‌లాకింగ్ పొటెన్షియల్’ నివేదిక ప్రకారం భారతదేశంలోని రిటైల్ రంగంలో ఖాళీ స్థలాల సమస్య తీవ్రంగా ఉంది. దేశంలోని 32 ప్రధాన నగరాల్లో ఉన్న 365 షాపింగ్ సెంటర్లలో మొత్తం 134 మిలియన్ చదరపు అడుగుల స్థలంలో 15.4% అంటే 15.5 మిలియన్ చదరపు అడుగుల స్థలం ఖాళీగా ఉంది.
మూడేళ్లుగా మాల్స్‌ల్లో 40% కంటే ఎక్కువ స్థలాలు ఖాళీగా ఉంటే వాటిని ఘోస్ట్ మాల్స్‌గా పరిగణిస్తారు. ఈ 74 ఘోస్ట్ మాల్స్‌లు మొత్తం రిటైల్ స్థలాల్లో 20% ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇవి ప్రధానంగా టైర్-2 నగరాల్లో (ఉదా: నాగ్‌పూర్, అమృత్‌సర్, జలంధర్) ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి విరుద్ధంగా మైసూరు, వదోదర వంటి నగరాల్లో 2-6% మాత్రమే ఖాళీగా ఉన్నాయి.
ఘోస్ట్ మాల్స్‌కు దారి తీస్తున్న కొన్ని కారణాలు..
మాల్స్‌ల్లో ప్రధానంగా టెనెంట్ మిక్స్, మాల్స్ నాణ్యత ఖాళీ స్థలాలకు కారణంగా ఉంది. చాలా మాల్స్ బలమైన ఆంకర్ టెనెంట్స్ (హైపర్‌మార్కెట్స్, మల్టిప్లెక్స్‌లు వంటివి) లేకుండా ప్రారంభమవుతున్నాయి. ఆంకర్ టెనెంట్స్ కస్టమర్లను ఆకర్షించి చిన్న షాపులకు మద్దతు ఇస్తాయి. వీటి లేమి కారణంగా కస్టమర్ ఫుట్‌ఫాల్ తగ్గుతుంది.
గ్రేడ్-సీ మాల్స్‌లో ఖాళీ 36% వరకు ఉంది. వీటిలో చాలా వరకు డిజైన్, లేఅవుట్‌ల్లో ఆధునిక అవసరాలకు దూరంగా ఉన్నాయి (ఉదాహరణకు, మురికిపడిన కారిడార్లు, బ్యాడ్ లైటింగ్, అన్‌ఫ్రెండ్లీ లేఅవుట్‌లు).
కొన్ని నగరాల్లో (ముఖ్యంగా టైర్-2) డిమాండ్‌కు మించి అధిక స్థలాలు అందుబాటులో ఉండటం సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది.
సైట్ లొకేషన్ సెలక్షన్ వంటి దీర్ఘకాలిక సమస్యలున్నాయి.
ఆన్‌లైన్ షాపింగ్
ఆధునిక కస్టమర్ షాపింగ్ అలవాట్లలో వచ్చిన మార్పు, ప్రత్యేకించి ఈ-కామర్స్ పెరుగుదల, మాల్స్‌కు తీవ్రమైన సవాలుగా మారింది. భారతదేశంలో ఆన్‌లైన్ షాపింగ్ మార్కెట్ 2023లో 883 బిలియన్ డాలర్ల నుండి 2025 నాటికి 1.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లు అందించే సౌకర్యాల కారణంగా కస్టమర్లు ఆన్‌లైన్ షాపింగ్‌ను ఎంచుకుంటున్నారు. కొవిడ్ తర్వాత గ్లోబల్‌గా మాల్ విజిటర్లు 42% తగ్గారు. ఇది భారతదేశంలోనూ చిన్న మాల్స్‌లను తీవ్రంగా ప్రభావితం చేసింది.
అద్దెలు, నిర్వహణ ఖర్చులు
హై-క్వాలిటీ మాల్ స్థలాలకు డిమాండ్ పెరగడంతో అద్దెలు పెరిగాయి. పాత, తక్కువ నాణ్యత గల మాల్స్ అద్దెలు తగ్గినప్పటికీ, అవి ఆధునిక మాల్స్‌తో పోటీపడలేకపోతున్నాయి. ఫలితంగా టెనెంట్స్ వాటిని వదిలి వెళ్తున్నారు.
పరిష్కారాలు.. భవిష్యత్తు అవకాశాలు
ఘోస్ట్ మాల్స్‌గా మారినప్పటికీ ఈ ఖాళీ స్థలాలను అవకాశాలుగా మార్చుకోవడానికి మార్గాలు ఉన్నాయి. ఖాళీ స్థలాలను కో-వర్కింగ్ స్పేస్‌లు, సర్వీస్ అపార్ట్‌మెంట్‌లు లేదా హెల్త్ సెంటర్లు వంటి ఇతర అవసరాలకు ఉపయోగించవచ్చు. మాల్ డిజైన్, లేఅవుట్, లైటింగ్‌ను ఆధునీకరించడం ద్వారా కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచవచ్చు. మొత్తంగా భారతదేశంలో ఘోస్ట్ మాల్స్ సమస్య రిటైల్ రంగంలో జరుగుతున్న డిజిటల్, భౌతిక మార్పులను ప్రతిబింబిస్తోంది. సరైన వ్యూహాలు, పునరుద్ధరణ ద్వారా ఈ ఖాళీ స్థలాలను తిరిగి ఉత్పాదక ఆస్తులుగా మార్చవచ్చు.
ఇదీ చదవండి: జీవిత బీమాపై అపోహలు తగ్గాలి


