
సాక్షి, సిటీబ్యూరో: ఏటేటా హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వస్తువులు, సేవలను విక్రయించే వాణిజ్య స్థలం(రిటైల్ స్పేస్) పెరుగుతోంది. దీంతో నగరంలో తలసరి రిటైల్ స్పేస్ 3.6 లక్షల చ.అ.లకు చేరింది. ప్రస్తుతం భాగ్యనగరంలో గ్రేడ్–ఏ, బీ షాపింగ్ మాల్స్ స్టాక్ 35.1 లక్షల చ.అ.లుగా ఉండగా.. ఇందులో వేకెన్సీ 1.85 శాతంగా ఉందని కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదిక వెల్లడించింది.
∙నగరంలో ఈ ఏడాది మూడో త్రైమాసికం(క్యూ3)లో 5.1 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ లీజుకు పోయింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 9.3 శాతం ఎక్కువ. కాగా.. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు నగరంలో 20.4 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ లీజుకు పోయింది. గ్రేడ్–ఏ మాల్స్ సరఫరా పరిమితంగా కారణంగా ఈ త్రైమాసికంలో ఎక్కువ లీజులు హైస్ట్రీట్ ప్రాంతాలలో జరిగాయి.
మొత్తం లీజులలో 42 శాతం కొంపల్లి, నల్లగండ్ల, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి సబర్బన్ కారిడార్లలో జరిగాయి. బంజారాహిల్స్, పంజగుట్ట, హిమాయత్‌నగర్ వంటి కోర్ సిటీలో 32 శాతం, సుచిత్ర, బోడుప్పల్ వంటి శివార్లలో 26 శాతం లీజులు జరిగాయి. ఫ్యాషన్, ఫుడ్ అండ్ బేవరేజెస్, యాక్ససరీస్ కేటగిరీల్లో రిటైల్ స్పేస్ లీజులు అధికంగా జరిగాయి. లైఫ్ స్టయిల్ విభాగం 16 శాతం, ఫరీ్నచర్ 10 శాతం, హెల్త్ కేటగిరీలో 10 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. మొత్తం లీజుల్లో దేశీయ బ్రాండ్లు 88 శాతం, అంతర్జాతీయ బ్రాండ్లు 12 శాతం వాటాలున్నాయి.
కొత్త మాల్స్..
ప్రస్తుతం నగరంలో 28 లక్షల చ.అ. కొత్త షాపింగ్ మాల్స్ నిర్మాణంలో ఉన్నాయి. ఇవి 2027 నాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈ ఏడాది నాల్గో త్రైమాసికం నాటికి 17 లక్షల చ.అ. గ్రేడ్–ఏ మాల్స్ స్థలం డెలివరీ అవుతుంది. కొంపల్లి, శంషాబాద్ వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో నివాసితులు వినోద అవసరాలను తీర్చేందుకు ఈ మాల్స్, రిటైల్ స్పేస్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం కొంపల్లి, ఎంజీ రోడ్, దిల్‌సుఖ్‌నగర్, బంజారాహిల్స్, అబిడ్స్, హిమాయత్‌నగర్, అమీర్‌పేట, మాదాపూర్, నల్లగండ్ల, హబ్సిగూడ, కోకాపేట, మణికొండ వంటి ప్రాంతాలలో రిటైల్ స్పేస్ అద్దె నెలకు చ.అ.కు రూ.135–250 వరకు ఉన్నాయి.