సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరవాసులు పల్లెలకు క్యూ కట్టారు. ఏపీకి వెళ్లే వారి వాహనాలతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. ఇవాళ సాయంత్రం ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగిపోయింది. యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పంతంగి టోల్‌ప్లాజా దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద..
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ట్రాఫిక్ జామ్‌తో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్... విజయవాడ హైవే ఇబ్రహీంపట్నం వద్ద వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. ట్రాఫిక్ ఆంక్షలతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేడు, రేపు(శని, ఆది) ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉందని.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఐ చంద్రశేఖర్ అన్నారు.
హైదరాబాద్లో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్..
హైదరాబాద్‌లో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సిటీ కాలేజీ, ఎంజే మార్కెట్, బేగంబజార్, హైకోర్టు, ఆఫ్జల్‌గంజ్, నయాపూల్ భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. వీకెండ్ సంక్రాంతి సెలవులు, ఎగ్జిబిషన్ కారణంగా రద్దీ నెలకొంది.
విజయవాడలో..
పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. సంక్రాంతికి సొంత గ్రామాలకు ప్రజలు ప్రయాణమయ్యారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు కావడంతో రద్దీ పెరిగింది. ఇవాళ ఉదయం నుండి ప్రయాణికులతో బస్టాండ్లు రద్దీగా మారాయి.



