సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహిళా ఐఏఎస్ అధికారులపై అసభ్య, అనుచిత ప్రచారంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. మహిళల గౌరవం, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
మంత్రి సీతక్క తాజాగా మాట్లాడుతూ..‘మహిళా అధికారుల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. బాధ్యతాయుతంగా పనిచేస్తున్న మహిళా ఐఏఎస్‌లను లక్ష్యంగా చేసుకోవడం ఆందోళనకరం. మహిళలు ఉన్నత స్థాయికి చేరితే తట్టుకోలేని ఫ్యూడల్ మానసిక స్థితే.. దుష్ప్రచారాలకు కారణం. మహిళా అధికారుల వ్యక్తిత్వాన్ని కించపరిచే ప్రచారాన్ని సహించబోము. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలనే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉంది.
మహిళా ఐఏఎస్ అధికారులు ధైర్యంగా, నిబద్ధతతో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహిళా అధికారుల వెనుక రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా నిలుస్తుంది. అసభ్య వ్యాఖ్యలు, దూషణలు చేసిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయి. మహిళలపై ద్వేషపూరిత ప్రచారానికి సమాజం మొత్తం వ్యతిరేకంగా నిలవాలి. మహిళల గౌరవం, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిది’ అంటూ వ్యాఖ్యలు చేశారు.


