
మాల్స్‌లో లీజింగ్ 45 శాతం అప్
టాప్–8 నగరాల్లో నమోదు
హైదరాబాద్‌లో 3.5 శాతం వృద్ధి
కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదిక
న్యూఢిల్లీ: రిటైల్ వాణిజ్య వసతులకు డిమాండ్ బలంగా కొనసాగుతోంది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ నగరాల్లో షాపింగ్ మాల్స్, ప్రముఖ ప్రాంతాల్లోని రిటైల్ వసతుల (ప్రధాన రహదారుల వెంట/హైస్ట్రీట్) లీజింగ్ సెపె్టంబర్ త్రైమాసికంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే 45 శాతం పెరిగింది. దేశవ్యాప్తంగా టాప్– 8 నగరాల్లో 2.41 మిలియన్ చదరపు అడుగుల (ఎస్‌ఎఫ్‌టీ) లీజింగ్ నమోదైంది.
క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్ 1.66 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ ఈ వివరాలను విడుదల చేసింది. ‘‘భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధి క్రమంలో కొనసాగుతోంది. వినియోగదారుల ప్రాధాన్యతలు విస్తరిస్తుండడంతో నాణ్యమైన రిటైల్ వసతులకు డిమాండ్ పెరుగుతోంది’’అని కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఎండీ గౌతమ్ సరాఫ్ తెలిపారు.
నగరాల వారీ లీజింగ్..
→ హైదరాబాద్‌లో 0.51 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ మేర రిటైల్ వసతుల లీజింగ్ నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్ 0.49 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీతో పోల్చి చూస్తే 3.5 శాతం పెరిగింది.
→ ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఏకంగా 87 శాతం అధికంగా 0.51 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ రిటైల్ లీజింగ్ జరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 0.27 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగానే ఉంది.
→ ముంబై మార్కెట్‌లో క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్ 0.22 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీతో పోల్చి చూస్తే రెట్టింపై 0.59 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీకి చేరింది.
→ పుణెలోనూ 85 శాతం అధికంగా 0.33 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ మేర రిటైల్ వసతుల లీజింగ్ నమోదైంది.
→ బెంగళూరులో లీజింగ్ 13 శాతం తగ్గి 0.18 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీకి పరిమితమైంది.
→ చెన్నై మార్కెట్లో 8 శాతం వృద్ధితో రిటైల్ లీజింగ్ 0.16 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది.
→ అహ్మదాబాద్‌లో 27 శాతం తక్కువగా 0.06 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీకి లీజు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్ 0.09 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది.
→ కోల్‌కతాలో 12 శాతం పెరిగి 0.06 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ మేర లీజింగ్ లావాదేవీలు జరిగాయి.
ప్రీమియం వసతులకు డిమాండ్..
కొత్త మాల్స్ నిర్మాణం పూర్తి అయి అందుబాటులోకి రావడంతోపాటు, క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్ తక్కువగా ఉండడం, అధిక వృద్ధికి కారణమైనట్టు డీఎల్‌ఎఫ్ వైస్ చైర్మన్, ఎండీ శ్రీరామ్ ఖట్టర్ తెలిపారు. ‘‘వినియోగదారులు కేవలం ఉత్పత్తినే కాకుండా మెరుగైన అనుభవం (వసతులు) కోసం చూస్తున్నారు. దీంతో మేము ప్రీమియం వసతులను ఆఫర్ చేయడంపై దృష్టి సారించాం’’అని ఖట్టర్ వివరించారు.
భారత వినియోగ మార్కెట్ పట్ల దేశ, విదేశీ బ్రాండ్లలో విశ్వాసం పెరగడం వల్ల బలమైన లీజింగ్ నమోదైనట్టు నెక్సస్ సెలక్ట్ మాల్స్ ప్రెసిడెంట్ నిజార్ జైన్ తెలిపారు. దేశ మధ్యతరగతి వర్గం పెరుగుతుండంతో వినియోగ మార్కెట్ విషయమై రిటైలర్లలోనూ బలమైన విశ్వాసం నెలకొన్నట్టు ఆరోణ్ గ్రూప్ ఎండీ నిమిష్ అరోరా తెలిపారు. డీ2సీ బ్రాండ్లు ఇప్పుడు ఆఫ్‌లైన్ మార్కెట్‌లోనూ విస్తరణపై దృష్టి పెట్టినట్టు చెప్పారు.