
సాక్షి, సిటీబ్యూరో: సంస్థాగత పెట్టుబడులు ద్వితీయ శ్రేణి పట్టణాలకు శరవేగంగా విస్తరిస్తున్నాయి. పట్టణీకరణ, అధిక జనాభా, కొనుగోలు శక్తి పెరుగుతుండటంతో వ్యవస్థీకృత రిటైల్ కేంద్రాలకు అవకాశాలు లభిస్తున్నాయి. మారుతున్న వినియోదారుల అభిరుచులతో ప్రపంచ బ్రాండ్లు విస్తరణపై దృష్టిసారిస్తున్నాయి.
చంఢీఘడ్, ఇండోర్, సూరత్, భువనేశ్వర్, కోయంబత్తూరు వంటి ద్వితీయ శ్రేణి పట్టణాలు నెక్సస్(బ్లాక్ స్టోన్), డీఎల్‌ఎఫ్, ఫీనిక్స్ మిల్స్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, లేక్‌షోర్, రహేజా గ్రూప్, పసిఫిక్ వంటి సంస్థాగత దిగ్గజాలను ఆకర్షిస్తున్నాయి. ఈ ఏడు సంస్థలు వచ్చే 3–5 ఏళ్లలో 4.25 కోట్ల చ.అ. కంటే ఎక్కువ విస్తీర్ణంలో కొత్తగా 45 షాపింగ్ మాల్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నాయి.
ప్రస్తుతం ఈ ఏడు సంస్థలకు సమష్టిగా 3.4 కోట్ల చ.అ. విస్తీర్ణంలో 58 మాల్స్ ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో గ్రేడ్-ఏ, బీ, సీ కేటగిరీ మాల్స్ అన్నీ కలిపి 650 షాపింగ్ మాల్స్ ఆపరేషనల్‌లో ఉన్నాయి. ఇండియాలో 11 కోట్ల చ.అ. నాణ్యమైన రిటైల్ స్పేస్ ఉంది. అమెరికాలో 70 కోట్ల చ.అ., చైనాలో 40 కోట్ల చ.అ. రిటైల్ స్థలం అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో అధిక శాతం స్థలం సంస్థాగత నిర్మాణ సంస్థల యాజమాన్యంలోనే ఉన్నాయని అనరాక్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది.