భారీగా ఇన్వెస్ట్ చేస్తున్న బ్లాక్‌స్టోన్, ఎస్‌ఎంబీసీ, వార్‌బర్గ్ పింకస్
ఆర్‌బీఎల్, ఫెడరల్, యస్‌బ్యాంకుల్లో వాటాల షాపింగ్
2025–26లో ఇప్పటివరకూ రూ. 54,000 కోట్ల పెట్టుబడులు
దేశీ ప్రయివేట్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ వ్యవస్థలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2025–26) అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే పలు బ్యాంకులలో విదేశీ ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజాలు భారీగా ఇన్వెస్ట్ చేయగా మరికొన్ని ఎన్‌బీఎఫ్‌సీలలోనూ వాటాలు సొంతం చేసుకుంటున్నాయి. ఈ బాటలో మార్చికల్లా ఐడీబీఐ బ్యాంక్‌లోనూ మెజారిటీ వాటా కొనుగోలు చేసే వీలుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ప్రయివేట్ ఫైనాన్షియల్ రంగం 6 బిలియన్ డాలర్ల(రూ. 54,000 కోట్లు) విదేశీ పెట్టుబడులను ఆకట్టుకోవడం విశేషం! వివరాలు చూద్దాం..
కొద్ది నెలలుగా దేశీ ఫైనాన్షియల్ రంగం విదేశీ పెట్టుబడులతో కళకళలాడుతోంది. ప్రయివేట్ రంగ బ్యాంకులతోపాటు ఎన్‌బీఎఫ్‌సీలు విదేశీ ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజాలను ఆకట్టుకుంటున్నాయి. సానుకూల నిబంధనలు, నియంత్రణా వ్యవస్థలకుతోడు.. మొండిబకాయిల తగ్గుదలతో బ్యాంకుల బ్యాలెన్స్‌షీట్లు పటిష్టంకావడం, దేశ ఆర్థిక పురోభివృద్ధికున్న అవకాశాలు, దీర్ఘకాలంలో మధ్యస్థాయి బ్యాంకులు ఆకర్షణీయ పనితీరు చూపగలవన్న ధీమా తదితర అంశాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం(2026–27)లోనూ ఈ ట్రెండ్ కొనసాగవచ్చునని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. వెరసి దేశీ ప్రయివేట్ ఫైనాన్షియల్ రంగ సంస్థలు మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకట్టుకునే వీలున్నట్లు అంచనా వేస్తున్నాయి. ఐడీబీఐ బ్యాంకులో మెజారిటీ వాటా కొనుగోలుకి దేశీ సంస్థలతో కెనడియన్ దిగ్గజం ఫెయిర్‌ఫాక్స్ పోటీపడే అవకాశమున్నట్లు పేర్కొన్నారు.
నిధుల ఆవశ్యకత
దేశీయంగా పలు ప్రయివేట్ రంగ ఫైనాన్షియల్ సంస్థలు డిజిటల్, సైబర్ సెక్యూరిటీ, డేటా విశ్లేషణ తదితర ఆధునిక టెక్నాలజీలను అందిపుచ్చుకునేందుకు విదేశీ పెట్టుబడులు సహకరించగలవని తెలియజేశారు. దీంతో వాటా విక్రయానికి ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు. ఇది ఇటు దేశీ సంస్థలకు, అటు విదేశీ ఇన్వెస్టర్లకు జోష్‌నిస్తున్నట్లు బ్యాంకింగ్ రంగ విశ్లేషకులు తెలియజేశారు.
వాటా కొనుగోలుకి క్యూ
→ ప్రపంచ ఆల్టర్నేట్ అసెట్ మేనేజ్‌మెంట్ బ్లాక్‌స్టోన్ ఇటీవల ఫెడరల్ బ్యాంక్‌లో 9.99 శాతం వాటా కొనుగోలుకి ప్రతిపాదించింది. ఇందుకు దాదాపు రూ. 6,192 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది.
→ ఇప్ప టికే యస్ బ్యాంక్‌లో 24% పైగా వాటా కొనుగోలు చేసేందుకు జపనీస్ దిగ్గజం సుమితోమొ మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్(ఎస్‌ఎంబీసీ) ముందడుగు వేసింది. ఇందుకు 1.6 బిలియన్ డాలర్లు(రూ. 14,400 కోట్లు)పైగా వెచి్చస్తోంది.
→ ఆర్‌బీఎల్ బ్యాంక్‌లో యూఏఈ దిగ్గజం ఎన్‌బీడీ బ్యాంక్ 60 శాతం వాటా కొనుగోలుకి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు 3 బిలియన్ డాలర్లు(దాదాపు రూ. 27,000 కోట్లు) వినియోగించనుంది. ఇది దేశీ ప్రయివేట్ బ్యాంకింగ్ రంగంలోనే అత్యధిక పెట్టుబడుల్లో ఒకటి కావడం విశేషం!
→ ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో అబు ధాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ(ఏడీఐఏ)తో కలసి యూఎస్ పీఈ దిగ్గజం వార్‌బర్గ్ పింకస్ 14.58 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 7,500 కోట్లు వెచ్చించింది.
రికార్డ్ ఎఫ్‌డీఐ..
→ శ్రీరామ్ ఫైనాన్స్‌లో డీల్ తదుపరి విస్తరించనున్న ఈక్విటీలో 20% వాటాను జపనీస్ దిగ్గజం ఎంయూఎఫ్‌జీ బ్యాంక్ సొంతం చేసుకుంటోంది. ఇందుకు ప్రిఫరెన్షియల్ షేర్ల జారీ మార్గాన్ని ఎంచుకుంది. తద్వారా 4.4 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 39,618 కోట్లు) వెచి్చంచనుంది. ఇది దేశీ ఫైనాన్షియల్ రంగంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ)కావడం విశేషం!
→ అవెండస్ క్యాపిటల్‌లో 60% వాటాను జపనీస్ దిగ్గజం మిజుహో ఫైనాన్షియల్ గ్రూప్ కొనుగోలు చేయనుంది. ఇందుకు యూఎస్ పీఈ దిగ్గజం కేకేఆర్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
→ సమ్మాన్ క్యాపిటల్‌లో అబుధాబి దిగ్గజం ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ(ఐహెచ్‌సీ) 42% వాటా చేజిక్కించుకోనుంది. ఇందుకు బిలియన్ డాలర్లు్ల (రూ. 9,000 కోట్లు) వినియోగించనుంది.
– సాక్షి, బిజినెస్ డెస్క్


