రెండేళ్లలోనే రెట్టింపైన పసిడి రుణాలు
రూ.15.6 లక్షల కోట్లకు చేరిన బంగారం రుణ మార్కెట్
ఏడాది కాలంలో 42 శాతం వృద్ధి
ముంబై: బంగారం ధరలు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరుగుతుండడం.. వాటి తనఖా రుణాల మార్కెట్ విస్తరణకు అనుకూలిస్తోంది. 2025 నవంబర్ నాటికి రెండేళ్లలో పసిడి రుణాలు రెట్టింపై రూ.15.6 లక్షల కోట్లకు చేరాయి. ధరల పెరుగుదలతో బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు వాటిపై మరింత మొత్తంలో రుణాల మంజూరునకు వీలు కల్పిస్తోంది. 2025 నవంబర్ నాటికి ఏడాది కాలంలో బంగారం తనఖా రుణాలు 42 శాతం పెరిగాయి.
2024 నవంబర్ నాటికి ఏడాది కాలంలో పెరుగుదల 39 శాతంగా ఉంది. దీంతో 2023 నాటికి రుణాల మొత్తం రూ.7.9 లక్షల కోట్లుగా ఉంటే, 2025 నవంబర్ చివరికి రూ.15.6 లక్షల కోట్లకు వృద్ధి చెందింది. మొత్తం రిటైల్ రుణాల్లో పసిడి రుణాల వాటా 9.7 శాతానికి చేరింది. ఏడాది క్రితం ఇది 8.1 శాతంగా ఉంది. ఈ వివరాలను క్రెడిట్ బ్యూరో సంస్థ క్రిఫ్ హైమార్క్ విడుదల చేసింది. పసిడి రుణాల్లో రూ.2.5 లక్షలకు మించినవి మొత్తం రుణాల్లో సగం మేర ఉన్నాయి. 2023 మార్చి నాటికి ఇవి 36.4 శాతంగా ఉన్నాయి. 36 శాతం రుణాలు పురుషులు తీసుకున్నవే.
మరింత వేగవంతం..
2024–25 ఆర్థిక సంవత్సరంలో జారీ అయిన బంగారం రుణాలు, వాటి విలువ 2025–26 ఆర్థిక సంవత్సరం మొదటి 8 నెలల్లోనే అధిగమించడం గమనార్హం. బంగారం రుణాల్లో ప్రభుత్వరంగ బ్యాంకులు 60% వాటాతో ఆధిపత్యం చలాయిస్తున్నా యి. బంగారం రుణ ఆధారిత ఎన్‌బీఎఫ్‌సీల వాటా 8.1%గా ఉంది. బంగారం రుణ ఆస్తుల నాణ్యత మెరుగుపడినట్లు క్రిఫ్ హైమార్క్ తెలిపింది.
దక్షిణాదిలోనే అధికం..
బంగారం రుణాల మా ర్కెట్ దక్షిణాదిలోనే ఎక్కు వగా ఉంది. మూడింట రెండొంతుల బంగారం రుణా లు దక్షిణాది రాష్ట్రాలో ఉన్నాయి. ఇక పది రాష్ట్రా ల పరిధిలోనే 90% రుణాలు ఉండడం గమనార్హం. 2025 నవంబర్‌తో ముగిసిన ఏడాది కాలంలో బంగారం రుణాల్లో 67% వృద్ధి గుజరాత్‌లో నమోదైంది. ఆ తర్వాత కర్ణాటక, మహారాష్ట్రలో 50% వృద్ధి కనిపించింది. బంగారం రుణాలు సకాలంలో చెల్లించని రాష్ట్రాల్లో ఎక్కువగా తమిళనాడు, యూపీ, మహారాష్ట్రలు ఉన్నాయి.


