హైదరాబాద్: హైదరాబాద్ పికిల్‌బాల్ లీగ్ (HPL) తొలి సీజన్ అత్యంత ఉత్సాహంగా ముగిసింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని 'ది లీగ్' వేదికగా జరిగిన తుది పోరులో క్రెడికాన్ మావెరిక్స్(Credicon Mavericks) జట్టు అఖండ విజయం సాధించి, తొలి సీజన్ ఛాంపియన్‌గా నిలిచింది. ఆల్ స్టార్స్ జట్టుతో జరిగిన ఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసింది. పోరు హోరాహోరీగా సాగి, ఏడో సెట్ అయిన నిర్ణయాత్మక టై-బ్రేకర్ వరకు వెళ్ళింది. అక్కడ మావెరిక్స్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి, 4–3 తేడాతో విజయాన్ని ఖరారు చేసుకుంది. ఈ విజయంతో హెచ్‌పీఎల్ చరిత్రలో తొలి టైటిల్ విజేతలుగా క్రెడికాన్ మావెరిక్స్ జట్టు తమ పేరును లిఖించుకుంది.
సుమారు 2,000 మంది పికిల్‌బాల్ క్రీడాభిమానులు ఈ అత్యంత ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చారు. ఇది హైదరాబాద్‌లో పికిల్‌బాల్ క్రీడపై పెరుగుతున్న ఆసక్తిని, ఈ లీగ్ ఎంత వేగంగా ప్రజాదరణ పొందుతుందో తెలియజేస్తుంది. విజేతగా నిలిచిన క్రెడికాన్ మావెరిక్స్ జట్టు ట్రోఫీతో పాటు రూ. 6 లక్షల నగదు బహుమతిని గెలుచుకుంది. రన్నరప్‌గా నిలిచిన ఆల్ స్టార్స్ జట్టు తమ అద్భుత ప్రదర్శన తర్వాత రూ. 3 లక్షల నగదు బహుమతిని అందుకుంది.

చివరి రాత్రి క్రీడ, వినోదం కలగలిసి సాగింది. మ్యాచ్ మధ్యలో ప్రముఖ గాయకుడు లక్కీ అలీ, అతని బృందం ప్రదర్శించిన పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. తొలి సీజన్ విజయవంతంపై స్పందిస్తూ, సెంటర్ కోర్ట్ స్పోర్ట్ & ఎంటర్‌టైన్‌మెంట్, హైదరాబాద్ పికిల్‌బాల్ లీగ్ కో ఫౌండర్ యశ్వంత్ బియ్యాల మాట్లాడుతూ.. "ఈ ఫైనల్స్, హెచ్‌పీఎల్ ముఖ్య లక్షణాలైన.. ఉత్కంఠ, సామాజిక అనుబంధం, వినోదం అన్నింటినీ బలంగా చూపించింది" అని అన్నారు. ఆల్ స్టార్స్ జట్టుకు చెందిన సమీర్ వర్మ 'మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్' అవార్డును గెలుచుకున్నారు.


