గ్లోబల్ సమ్మిట్‌తో రియల్‌ మార్కెట్ రైజింగ్‌ | Real Estate Market Rising With Global Summit | Sakshi
Sakshi News home page

గ్లోబల్ సమ్మిట్‌తో రియల్‌ మార్కెట్ రైజింగ్‌

Dec 13 2025 7:25 PM | Updated on Dec 13 2025 8:00 PM

Real Estate Market Rising With Global Summit

విజన్‌ డాక్యుమెంట్‌లో అన్ని రంగాలకు ప్రాధాన్యం

నివాసం, పర్యాటకం, గిడ్డంగులు, డేటా సెంటర్లలో పెట్టుబడులకు అవకాశం

ఫ్యూచర్‌ సిటీ, మూసీ మాస్టర్‌ ప్లాన్స్‌ తర్వాతే పెట్టుబడులపై స్పష్టత

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, రూపాయి పతనం, ఉద్యోగాల తొలగింపు, స్థిరమైన వడ్డీ రేట్లు వంటి రకరకాల కారణంగా కొంతకాలంగా హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ స్తబ్దుగా ఉంది. ఇటీవల రాయదుర్గం, నియోపొలిస్‌ భూముల వేలంలో రూ.వందల కోట్ల బిడ్డింగ్‌తో నగర స్థిరాస్తి మార్కెట్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్‌ సమ్మిట్‌–2025తో ఈ ఉత్సాహం రెట్టింపు అయ్యింది. సమ్మిట్‌లో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన విజన్‌ డాక్యుమెంట్‌-2047తో రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలు పెరిగాయి. విద్యా, వైద్యం, తయారీ, క్రీడలు, పర్యాటకం, నివాసం, పరిశ్రమలు.. అన్ని రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడంతో.. స్థానిక స్థిరాస్తి రంగంలో సానుకూల దృక్పథం ఏర్పడింది. ప్రధానంగా సామాన్య, మధ్యతరగతి గృహాలు, పర్యాటకం, గిడ్డంగులు, డేటా సెంటర్లలో రియల్టీ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది.  – సాక్షి, సిటీబ్యూరో

అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు గ్లోబల్‌ సమ్మిట్‌ రూపంలో ప్రభుత్వం తీసుకున్న చొరవ ప్రశంసనీయం. రియల్‌ ఎస్టేట్‌కు జీవం.. ఉపాధి.. ప్రస్తుతం తరుణంలో ఈ ప్రాథమిక అంశంపై ప్రభుత్వం దృష్టిసారించడం కీలకం. విజన్‌ డాక్యుమెంట్‌తో ప్రభుత్వ దీర్ఘకాల విజన్‌పై స్పష్టత ఇవ్వడంతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం నెలకొంటోంది. జాయింట్‌ వెంచర్లు, విదేశీ పెట్టుబడి అవకాశాలు పెరుగుతాయి. కొత్త ప్రాజెక్ట్‌లు, అనుమతుల్లో వేగం, పాలసీలతో సెంటిమెంట్‌ బలపడుతుంది. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన విజన్‌ డాక్యుమెంట్‌లో తయారీ, ఐటీ, ఫార్మా వంటి రంగాలే కాదు సినిమా, క్రీడలు, సెమీ కండక్టర్లు, అంతరిక్షం, జీవ ఉత్పత్తులు, జీవ వైవిధ్యం వంటి అన్ని రంగాలతో సమగ్రంగా ఉంది. దీంతో నివాస, ఆఫీసు స్పేస్‌లోనే పర్యాటకం, క్రీడలు, గిడ్డంగులు, డేటా సెంటర్ల వంటి ఇతర రియల్టీ మాధ్యమాలలో కూడా పెట్టుబడి అవకాశాలు ఏర్పడ్డాయి.

వెస్ట్‌ టు సౌత్‌..
నగర రియల్టీ మార్కెట్‌లో ఇప్పటి వరకు వెస్ట్‌ హైదరాబాద్‌దే ఆధిపత్యం. బహుళ జాతి ఐటీ, ఆర్థిక సంస్థలు, డేటా సెంటర్లు పశి్చమంలో కేంద్రీకృతమై ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అలాగే ఈ ప్రాంతానికి శంషాబాద్‌ విమానాశ్రయం, ఔటర్‌ రింగ్‌ రోడ్‌కు సులువైన కనెక్టివిటీతో పాటు విశాలమైన రహదారులు, మెరుగైన మురుగునీటి వ్యవస్థ, తాగునీరు, నిరంతరం విద్యుత్‌ వంటి మెరుగైన మౌలిక సదుపాయాలున్నాయి. దీంతో బహుళ అంతస్తుల నివాస, వాణిజ్య సముదాయాలు, అంతర్జాతీయ విద్యా, వైద్యం, వినోద సంస్థలకు డిమాండ్‌ ఏర్పడింది. ఫలితంగా రాయదుర్గం, కోకాపేట, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్, గచ్చిబౌలి, మాదాపూర్‌ వంటి వెస్ట్‌ హైదరాబాద్‌లో భూములు హాట్‌కేక్‌లుగా మారాయి.

ప్రభుత్వం నిర్వహించే వేలంలోనే ఎకరం రూ.వందల కోట్లు పలుకుతుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఖరీదైన ప్రాంతంలో సామాన్య, మధ్యతరగతికి సొంతిల్లు కలే. ఇలాంటి సమయంలో ప్రభుత్వం కొత్త ప్రాంతానికి అభివృద్ధిని విస్తరించడం హర్షించదగిన పరిణామం. నగరానికి దక్షిణ భాగమైన శ్రీశైలం జాతీయ రహదారి, నాగార్జున సాగర్‌ రాష్ట్ర రహదారి మధ్యలో భారత్‌ ఫ్యూచర్‌ సిటీని నిర్మించాలని నిర్ణయించింది. దీంతో గ్రీన్‌ఫీల్డ్‌ నెట్‌ జీరో సిటీ పరిసర ప్రాంతాలలో మౌలిక వసతులు మెరుగవుతాయి. ఫలితంగా నివాస, వాణిజ్య సముదాయాలు వెలుస్తాయి. సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు అందుబాటు ధరల్లోనే సొంతింటి కలను సాకారం చేసుకునే వీలు ఏర్పడుతుంది.

మాస్టర్‌ ప్లాన్స్‌పై స్పష్టత వస్తేనే..
ఏ ప్రాజెక్ట్‌కైనా బృహత్‌ ప్రణాళిక(మాస్టర్‌ ప్లాన్‌) కీలకం. రాష్ట్రాభివృద్ధిని మార్చే కీలక ప్రాజెక్ట్‌లలో భారత్‌ ఫ్యూచర్‌ సిటీ, మూసీ పునరుజ్జీవం కీలకమని పదే పదే ప్రభుత్వం చెబుతోంది. అలాంటి కీలకమైన ప్రాజెక్ట్‌లకు మాస్టర్‌ ప్లాన్‌ వస్తేనే పెట్టుబడులపై స్పష్టత వస్తుంది. డెవలపర్లు, పెట్టుబడిదారులు ఎవరికైనా సరే మాస్టర్‌ ప్లాన్‌లో ఏ జోన్‌ ఎక్కడ వస్తుంది? బహుళ వినియోగ జోన్‌ ఏరియా ఎంత? వంటి కీలక అంశాలను పరిగణలోకి తీసుకొనే ముందడుగు వేస్తారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీ, మూసీ పునరుజ్జీవం బృహత్తర ప్రాజెక్ట్‌ల సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ విడుదల అయితేనే ఆయా ప్రాంతాలలో పెట్టుబడి అవకాశాలపై స్పష్టత వస్తుందని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు.

కార్యరూపం దాలిస్తేనే ఫలాలు..
‘అన్ని రహదారులు రోమ్‌కు దారితీస్తాయి’ విస్తృతమైన రోడ్‌ నెట్‌వర్క్‌ను దాని రాజధానికి అనుసంధానించే క్రమంలో ఉద్భవించిన ప్రాచీన రోమ్‌ నానుడి లాగే.. ఇప్పుడు ఫ్యూచర్‌ సిటీ కేంద్రంగా ప్రభుత్వం చేపట్టే ఏ పనైనా రియల్‌ ఎస్టేట్‌కు ఊతమిస్తుంది. రెండు రోజుల గ్లోబల్‌ సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్లు పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. ఇందులో పాక్షికంగా కార్యరూపంలోకి వచ్చినా రాష్ట్ర అభివృద్ధి ముఖచిత్రమే మారిపోతుంది.

పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వెల్లువెత్తుతాయి. దీంతో రియల్టీలో పెట్టుబడులు పెరుగుతాయి. అసలు సమస్య ఏంటంటే.. ఫ్యాబ్‌ సిటీ, ఎల్రక్టానిక్‌ సిటీ, ఫార్మా సిటీ.. ఇలా ఏ పేరుతోనైనా ఏ ప్రభుత్వమైనా భూములు సమీకరించడం సర్వ సాధారణమే. కానీ, అవి కార్యరూపం దాలిస్తేనే అభివృద్ధి. లేకపోతే ఇతర రాష్ట్రాలు నిర్వహించే సాధారణ సమ్మిట్‌ మాదిరిగానే ఈ గ్లోబల్‌ సమ్మిట్‌ కూడా వారం, నెల రోజుల్లో మరుగునపడిపోతుంది. స్థానిక అవసరాలు, బలాలను దృష్టిలో పెట్టుకొని కార్యాచరణ రూపొందిస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement