
ఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్‌లో దబంగ్ ఢిల్లీ జట్టు ఖాతాలో మరో విజయం చేరింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న ఢిల్లీ జట్టు శుక్రవారం జరిగిన పోరులో 37–31 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్‌పై గెలుపొందింది. ఢిల్లీ తరఫున అక్షిత్ ధుల్ 12 పాయింట్లతో సత్తా చాటగా... నవీన్ 6, ఫజల్ 5 పాయింట్లు సాధించారు. తలైవాస్ తరఫున అర్జున్ దేశ్వాల్ 11 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది.
తాజా సీజన్‌లో ఢిల్లీ 16 మ్యాచ్‌లు ఆడి 13 విజయాలు, 3 పరాజయాలతో 26 పాయింట్లు ఖాతాలో వేసుకొని రెండో స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 42–29 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్‌ను చిత్తుచేసింది. జైపూర్ తరఫున అలీ సమది 13 పాయింట్లు, నితిన్ 11 పాయింట్లతో రాణించగా... యోధాస్ తరఫున సురేందర్ 12 పాయింట్లతో పోరాడాడు.
గ్రూప్ అడుగున ఉన్న జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 51–49తో బెంగాల్ వారియర్స్‌పై నెగ్గింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్‌తో దబంగ్ ఢిల్లీ, తెలుగు టైటాన్స్‌తో పుణేరి పల్టన్, బెంగాల్ వారియర్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ ఆడతాయి.