చాంపియన్ దబాంగ్ ఢిల్లీ (PC: PKL)
ప్రొ కబడ్డీ లీగ్ (PKL)-12వ సీజన్‌లో దబాంగ్ ఢిల్లీ కేసీ విజేతగా అవతరించింది. ఢిల్లీలోని త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో 31-28 తేడాతో టేబుల్ టాపర్ పుణెరి పల్టన్ (Dabang Delhi Beat Puneri Paltan)ను ఓడించింది. ఫలితంగా ఆషు మాలిక్ కెప్టెన్సీలోని ఢిల్లీ రెండోసారి పీకేఎల్ టైటిల్ అందుకుంది.
అరుదైన ఘనత
గతంలో ఎనిమిదో సీజన్‌లో ఢిల్లీ ట్రోఫీ నెగ్గిన విషయం తెలిసిందే. ప్రస్తుత హెడ్ కోచ్ జోగిందర్ నర్వాల్ (Joginder Narwal) అప్పుడు ఆ జట్టుకు కెప్టెన్‌గా ఉండటం విశేషం. తద్వారా పీకేఎల్‌లో కెప్టెన్‌గా, హెడ్‌కోచ్‌గా టైటిల్ గెలిచిన రెండో వ్యక్తిగా జోగిందర్ నిలిచాడు.
ఇక పుణెరి పల్టన్‌తో ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ రైడర్ నీరజ్ నర్వాల్ ఎనిమిది పాయింట్లతో సత్తా చాటగా.. అజింక్య పవార్ ఆరు పాయింట్లతో రాణించాడు. మరోవైపు, పుణెరి పల్టన్ తరఫున ఆదిత్య షిండే సూపర్ టెన్ సాధించినా.. అభినేష్ నాడరాజన్ నాలుగు ట్యాకిల్ పాయింట్లతో మెప్పించినా ఫలితం లేకుండా పోయింది.
CLINICAL. CONSISTENT. CHAMPIONS. 🏆
What an incredible season for #DabangDelhiKC! 👏👏👏 pic.twitter.com/C3fc1SwU48— Star Sports (@StarSportsIndia) October 31, 2025
మరి ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్ విజేత, రన్నరప్‌నకు దక్కే ప్రైజ్‌మనీ, ఈ సీజన్‌లో వివిధ విభాగాల్లో అవార్డులు గెలుచుకున్న ప్లేయర్లు ఎవరో తెలుసుకుందామా?
ప్రైజ్‌మనీ ఎంతంటే?
🏆విజేత దబాంగ్ ఢిల్లీ కేసీకి దక్కే ప్రైజ్‌మనీ- రూ. 3 కోట్లు
👏రన్నరప్ పుణెరి పల్టన్‌కు దక్కే ప్రైజ్‌మనీ- రూ. 1.8 కోట్లు
వివిధ అవార్డులు గెలిచిన ఆటగాళ్లు
🌟మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్- ఫజల్ అట్రాచలీ (దబాంగ్ ఢిల్లీ)
🌟బెస్ట్ రైడర్ : అయాన్ లోహచబ్ (పట్నా పైరేట్స్)- 316 రైడింగ్ పాయింట్లు
🌟బెస్ట్ డిఫెండర్ : నవదీప్ (పట్నా పైరేట్స్)- 73 టాకిల్ పాయింట్లు
🌟మషాల్ స్పోర్ట్స్ న్యూ యంగ్ ప్లేయర్: దీపక్ శంకర్ (బెంగళూరు బుల్స్)
PKL పన్నెండు సీజన్ల విజేతల జాబితా
🏆సీజన్ 1: జైపూర్ పింక్ పాంథర్స్
🏆సీజన్ 2: యు ముంబా
🏆సీజన్ 3: పట్నా పైరేట్స్
🏆సీజన్ 4: పట్నా పైరేట్స్
🏆సీజన్ 5: పట్నా పైరేట్స్
🏆సీజన్ 6: బెంగళూరు బుల్స్
🏆సీజన్ 7: బెంగాల్ వారియర్స్
🏆సీజన్ 8: దబాంగ్ ఢిల్లీ కేసీ
🏆సీజన్ 9: జైపూర్ పింక్ పాంథర్స్
🏆సీజన్ 10: పుణెరి పల్టన్
🏆సీజన్ 11: హర్యానా స్టీలర్స్
🏆సీజన్ 12: దబాంగ్ ఢిల్లీ కేసీ
పీకేఎల్-12 ఫైనల్ సాగిందిలా..
ఈ సీజన్‌లో గత మ్యాచ్‌లలో రాణించినట్లుగానే తుదిపోరులోనూ అస్లాం ఇనాందార్, ఆషు మాలిక్ తమ జట్లకు తొలి పాయింట్లు అందించారు. ఆ తర్వాత నీరజ్ నర్వాల్ బాధ్యత తీసుకుని.. ఒక డబుల్-పాయింట్ రైడ్.. ఒక ట్యాకిల్‌తో ఢిల్లీకి ఆరంభంలోనే నాలుగు పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించిపెట్టాడు.
అయితే, పుణెరి పల్టన్ ఆ ఒత్తిడికి లొంగలేదు. గౌరవ్ ఖత్రీ రెండు సూపర్ టాకిల్స్ సాధించి.. స్కోర్ల మధ్య తేడాను ఒక పాయింట్‌కు తగ్గించాడు. ఇరు జట్లు డూ -ఆర్ -డై వ్యూహాన్ని అనుసరించడంతో ఆట కాస్త నెమ్మదించింది. ఈ దశలో అజింక్య పవార్, తొలి పది నిమిషాలు ముగిసే సమయానికి దబాంగ్ ఢిల్లీకి రెండు పాయింట్ల ఆధిక్యాన్ని నిలబెట్టాడు.
ఆపై, అనేష్ పల్టన్‌కు మూడో సూపర్ టాకిల్ నమోదు చేయడంతో, ఆట మళ్లీ ఒక పాయింట్ తేడాకు వచ్చింది. కానీ, 15వ నిమిషంలో అజింక్ పవార్ అద్భుత ఆటతో ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన ఢిల్లీ ఆరు పాయింట్ల ఆధిక్యంతో మళ్లీ ముందంజ వేసింది.
సొంత గడ్డపై ఆడుతున్న ఢిల్లీ నీరజ్ నర్వాల్ సూపర్ రైడ్‌తో తమ ఆధిపత్యాన్ని మరింత పెంచుకుని, ఆధిక్యాన్ని ఎనిమిది పాయింట్లకు పెంచుకుంది. పుణెరి కూడా పంకజ్ మోహితే ట్యాకిల్, ఆదిత్య షిండే డబుల్ -పాయింట్ రైడ్‌తో దీటుగా స్పందించి అంతరాన్ని కాస్త తగ్గించింది.
అయితే, అజింక్య పవార్ వెంటనే మరో మల్టీ -పాయింట్ రైడ్‌తో జోరు చూపడంతో దబాంగ్ ఢిల్లీ 20-14 స్కోరుతో తొలి అర్ధభాగాన్ని ముగించింది. రెండో అర్ధభాగంలో ఇరు జట్లూ నెమ్మదిగా ఆడాయి. దబాంగ్ ఢిల్లీ తమ ఆధిక్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించింది. పుణెరి పల్టన్ కూడా దూకుడు ప్రదర్శించకుండా, తమ డిఫెన్స్, డూ -ఆర్ -డై వ్యూహంపై ఆధారపడి తిరిగి ఆటలోకి రావడానికి ప్రయత్నించింది.
ఈ క్రమంలో గుర్దీప్ రెండు ట్యాకిల్స్ సాధించి లోటును నాలుగు పాయింట్లకు తగ్గించాడు. కానీ, దబాంగ్ ఢిల్లీ ఓ సూపర్ టాకిల్‌తో తన ఆధిక్యాన్ని 24-18కి పెంచుకుంది. స్టార్ రైడర్ ఆషు మాలిక్ ఓ పాయింట్ రాబట్టగా..అనురాగ్ చేసిన సూపర్ ట్యాకిల్‌తో దబాంగ్ ఢిల్లీ భారీ విజయం దిశగా దూసుకెళ్లింది.
అయితే, చివరి నిమిషాల్లో పుణెరి పల్టన్ అంత తేలిగ్గా తలొగ్గలేదు. అమాన్ చేసిన ట్యాకిల్, ఆదిత్య షిండే వరుస రైడ్ పాయింట్లతో కీలక దశలో ఢిల్లీని ఆలౌట్ చేసింది. దీంతో మరో మూడు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా 25–28తో నిలిచి మ్యాచ్‌లో మరింతను పెంచింది. ఆపై ఆదిత్య షిండే అంతరాన్ని ఒక్క పాయింట్‌కు తగ్గించాడు, కానీ, ఢిల్లీ ఆటగాడు నీరజ్ నర్వాల్ మెరుపు రైడ్‌తో తమ ఆధిక్యాన్ని మూడు పాయింట్లకు పెంచాడు.
ఆదిత్య షిండే మరో రెండు -పాయింట్ల రైడ్‌తో తన సూపర్ టెన్ పూర్తి చేసుకున్నాడు. చివరి నిమిషంలోకి అడుగుపెట్టేసరికి ఇరు జట్ల మధ్య కేవలం ఒక పాయింట్ మాత్రమే తేడా ఉంది. ఈ కీలక సమయంలో, ఫజెల్ అత్రాచలి తన అనుభవాన్ని ఉపయోగించి ఆదిత్య షిండేను ట్యాకిల్ చేసి, ఈ మ్యాచ్‌లో తన తొలి పాయింట్‌ను సాధించాడు. ఈ ట్యాకిల్‌తోనే దబాంగ్ ఢిల్లీ సొంత మైదానంలో రెండోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది.
చదవండి: రోహిత్ శర్మ ఆల్‌టైమ్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన బాబర్
Dabang Delhi K.C. are the crowned champions of PKL 12! 🏆⭐👏🏻
[Pro Kabaddi League, PKL 12, Dabang Delhi K.C., Agent Ashu] pic.twitter.com/ICIUPuuMMP— Star Sports (@StarSportsIndia) October 31, 2025


