సౌతాఫ్రికాతో రెండో టీ20లో పాకిస్తాన్ (PAK vs SA 2nd T20) ఘన విజయం సాధించింది. లాహోర్ వేదికగా సఫారీ జట్టును ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తద్వారా తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
ప్రపంచ రికార్డు బద్దలు
ఈ మ్యాచ్ సందర్భంగా పాక్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం (Babar Azam) సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్న టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. టీ20 క్రికెట్‌లో హయ్యస్ట్ రన్ స్కోరర్‌గా బాబర్ నిలిచాడు.
బాబర్ డకౌట్
వరుస వైఫల్యాల నేపథ్యంలో పాక్ కెప్టెన్సీ కోల్పోయిన బాబర్ ఆజం.. చాన్నాళ్ల పాటు టీ20 జట్టులోనూ స్థానం దక్కించుకోలేకపోయాడు. ఎట్టకేలకు స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ సందర్భంగా సెలక్టర్లు అతడిని కరుణించారు. అయితే, రావల్పిండి వేదికగా సఫారీలతో తొలి టీ20లో బాబర్ డకౌట్ అయి పూర్తిగా నిరాశపరిచాడు.
ఇందుకు తోడు ఈ మ్యాచ్‌లో పాక్ 55 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో బాబర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అతడిని జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్లు పెరిగాయి. అయితే, తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో పాక్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది.
110 పరుగులకు ఆలౌట్
లాహోర్ వేదికగా టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాను 19.2 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌట్ చేసింది. ప్రధాన ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగిన ప్రొటిస్ జట్టు టాపార్డర్ పాక్ బౌలర్ల ధాటికి కుదేలైంది.
రీజా హెండ్రిక్స్ డకౌట్ కాగా.. క్వింటన్ డికాక్ (7), టోనీ డి జోర్జి (7) పూర్తిగా విఫలమయ్యారు. యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ 25 పరుగులతో ప్రొటిస్ ఇన్నింగ్స్‌లో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. మిగిలిన వారిలో కెప్టెన్ డొనోవాన్ ఫెరీరా (15), కార్బిన్ బాష్ (11), ఒట్‌నీల్ బార్ట్‌మన్ (12) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు.
పాక్ బౌలర్లలో ఫాహీమ్ ఆష్రఫ్ నాలుగు వికెట్లు తీయగా.. సల్మాన్ మీర్జా మూడు, నసీం షా రెండు, అబ్రార్ అహ్మద్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. 13.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 112 పరుగులు చేసి.. తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది.
సయీమ్ ఆయుబ్ విధ్వంసకర అర్ధ శతకం
ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ (28) ఓ మోస్తరుగా రాణించగా.. సయీమ్ ఆయుబ్ విధ్వంసకర అర్ధ శతకం (38 బంతుల్లో 71) సాధించాడు. అతడికి తోడుగా బాబర్ ఆజం 18 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో 11 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఈ క్రమంలోనే బాబర్ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగుల వీరుడిగా రోహిత్ శర్మను అధిగమించాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగుల వీరులు (టాప్-5)
🏏బాబర్ ఆజం (పాకిస్తాన్)- 130* మ్యాచ్‌లలో 4234 పరుగులు
🏏రోహిత్ శర్మ (ఇండియా)- 159 మ్యాచ్‌లలో 4231 పరుగులు
🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 125 మ్యాచ్‌లలో 4188 పరుగులు
🏏జోస్ బట్లర్ (ఇంగ్లండ్)- 144 మ్యాచ్‌లలో 3869 పరుగులు
🏏పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్)- 153 మ్యాచ్‌లలో 3710 పరుగులు.
చదవండి: అతడే మా ఓటమిని శాసించాడు.. అభిషేక్ మాత్రం అద్భుతం: భారత కెప్టెన్


