 
													మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. అభిషేక్ శర్మ(68), హర్షిత్ రాణా(35) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 18.4 ఓవర్లలో కేవలం 125 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ మూడు వికెట్లతో మెన్ ఇన్ బ్లూ పతనాన్ని శాసించగా.. ఎల్లీస్, బార్ట్‌లెట్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 6 వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలో చేధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే.
ఇక మెల్‌బోర్న్ టీ20 ఓటమిపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓటమి పాలైమని సూర్య చెప్పుకొచ్చాడు. అదేవిధంగా ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ హాజిల్‌వుడ్‌పై సూర్య ప్రశంసల వర్షం కురిపించాడు.
"జోష్ హాజిల్‌వుడ్ ఆసాధరణ బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. పవర్‌ప్లేలో అతడు బౌలింగ్ చేసిన విధానం నిజంగా ఒక అద్భుతం. పవర్‌ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోయాము. ఈ పరిస్థితి నుంచి కోలుకోవడం ఏ జట్టుకైనా చాలా కష్టం. కచ్చితంగా జోష్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే.
మొదటి మ్యాచ్ రద్దు అయినప్పటికి మేము బాగానే బ్యాటింగ్ చేశాము. ఈ మ్యాచ్‌లో కూడా అదే మైండ్ సెట్‌తో ఆడాలి అనుకున్నాము. తొలుత బ్యాటింగ్ చేస్తే ప్రత్యర్ధి ముందు భారీ టార్గెట్ ఉంచాలనుకున్నాము. కానీ మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయడం విఫలమయ్యాము.
ఇక అభిషేక్ గురుంచి ఎంత చెప్పుకొన్న తక్కువే. అతడు గత కొంత కాలంగా తన పనిని తాను చేసుకుపోతున్నాడు. అతడు తన బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ను కొనసాగిస్తున్నాడు. రాబోయే మ్యాచ్‌లలో కూడా అతడు ఇదే జోరును కొనసాగించాలని ఆశిస్తున్నాను" అని సూర్య పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్‌లో పేర్కొన్నాడు.
చదవండి: IND vs SA: రీఎంట్రీలో రిషభ్ పంత్ ఫెయిల్.. భారత్ ఆలౌట్.. .. స్కోరెంతంటే?

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
